
జైపూర్: సీనియర్ క్రికెటర్ అజింక్యా రహానే(105 నాటౌట్; 63 బంతుల్లో 11ఫోర్లు, 3 సిక్సర్లు) శతకం సాధించడంతో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ 192 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన రాజస్తాన్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. అనవసరపు పరుగు కోసం యత్నించి రనౌటైన శాంసన్.. డైమండ్ డక్‌గా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన స్మిత్‌తో కలిసి రహానే ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. ఆరంభం నుంచే వీరిరువురు ఢిల్లీ బౌలర్లపై ఎదురు దాడికి దిగారు. ఈ క్రమంలో వీరిద్దరూ అర్దసెంచరీలు పూర్తి చేసుకున్నారు. హాఫ్ సెంచరీ పూర్తయిన తర్వాతి బంతికే స్మిత్(50; 32 బంతుల్లో 8ఫోర్లు) భారీ షాట్‌కు యత్నించి క్యాచ్ ఔటయ్యాడు. దీంతో రెండో వికెట్‌కు 130 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెరపడింది.
మరోవైపు రహానే తనదైన రీతిలో క్లాస్ షాట్‌లు, కవర్‌డ్రైవ్‌లతో ఆకట్టుకున్నాడు. స్ట్రైక్ రొటేట్ చేస్తూ.. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కొర్ బోర్డు పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో రహానే ఐపీఎల్‌లో రెండో సెంచరీ సాధించాడు. గతంలో 2012లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై శతకం సాధించాడు. ఇక చివర్లో బిన్ని(19) కూడా బ్యాట్ ఝులిపించడంతో రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో రబడ రెండు వికెట్లు దక్కించుకోగా.. ఇషాంత్, అక్షర్, మోరిస్‌లు తలో వికెట్ పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment