ఐపీఎల్–12లో రాజస్తాన్ రాయల్స్ ప్రస్థానం ముగిసింది. కనుచూపు మేరలో ఏదో మూలన ప్లే ఆఫ్ అవకాశాలు కనిపిస్తున్నా పెద్దగా పోరాటం లేకుండానే ఆ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌కు లొంగిపోయింది. తొలుత బ్యాటింగ్‌లో తేలిపోయిన రాయల్స్‌కు అనంతరం స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవడం సాధ్యం కాలేదు.
న్యూఢిల్లీ: గెలిస్తే... అదృష్టం కూడా కలిసొస్తే, ప్లే ఆఫ్స్‌కు చేరే అవకాశం ఉన్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో రాయల్స్ పరాజయం పాలైంది. రెండు జట్ల మధ్య శనివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. స్మిత్ స్వదేశానికి వెళ్లిపోవడంతో ఈ ఆఖరి మ్యాచ్‌లో రాజస్తాన్ జట్టుకు రహానే కెప్టెన్‌గా వ్యవహరించాడు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన రాయల్స్... పేసర్ ఇషాంత్ శర్మ (3/38), ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’, స్పిన్నర్ అమిత్ మిశ్రా (3/17) ధాటికి నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 115 పరుగులే చేయగలిగింది. టీనేజ్ బ్యాట్స్‌మన్ రియాన్ పరాగ్ (49 బంతుల్లో 50; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఒక్కడే వీరికి ఎదురు నిలిచాడు. ట్రెంట్ బౌల్ట్ (2/27) తనవంతుగా రెండు వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో తొలుత తడబడినా వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ (38 బంతుల్లో 53 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) దూకుడైన అజేయ అర్ధ సెంచరీతో ఢిల్లీ 16.1 ఓవర్లలో ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి 121 పరుగులు చేసి నెగ్గింది.
ఇషాంత్ జోరు, మిశ్రా మాయ
ఓపెనర్లు కెప్టెన్ అజింక్య రహానే (2), లివింగ్‌స్టోన్ (14)లను ఆరంభంలోనే ఔట్ చేసి రాజస్తాన్‌ను ఇషాంత్ కోలుకోలేని దెబ్బ కొట్టాడు. పృథ్వీ షా డైరెక్ట్ హిట్‌కు ఫామ్‌లో ఉన్న సంజు సామ్సన్ (5) రనౌట్‌గా వెనుదిరిగాడు. యువ లోమ్రర్ (8)నూ ఇషాంతే పెవిలియన్ చేర్చాడు. పవర్ ప్లే ముగిసేసరికి స్కోరు 30/4. తర్వాత మిశ్రా మాయ మొదలైంది. అతడు ఆల్‌రౌండర్లు శ్రేయస్ గోపాల్ (12), స్టువర్ట్ బిన్నీ (0), కృష్ణప్ప గౌతమ్ (6)ల పనిపట్టాడు. 14వ ఓవర్‌కు 65/7తో నిలిచిన రాయల్స్ కనీసం వందైనా చేస్తుందా? అనిపించింది. అయితే, ఇష్ సోధి (6) అండగా పరాగ్ పరిణతి చూపాడు. వీలుచిక్కినప్పుడల్లా షాట్లు కొడుతూనే వికెట్‌ను కాపాడుకుంటూ పరుగులు చేశాడు. ఇషాంత్ వేసిన 18వ ఓవర్లో రెండు వరుస ఫోర్లు బాదాడు. బౌల్ట్ వేసిన ఆఖరి ఓవర్లో రెండు సిక్స్‌లు బాదాడు. 47 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలో పిన్న వయస్సులో అర్ధ సెంచరీ చేసిన క్రికెటర్‌గా పరాగ్ (17 ఏళ్ల 175 రోజులు) రికార్డు సృష్టించాడు. సంజు సామ్సన్ (2013లో 18 ఏళ్ల 169 రోజులు) పేరిట ఉన్న రికార్డును పరాగ్ సవరించాడు.
ఢిల్లీ... దెబ్బలు తిన్నా
ఢిల్లీకి ధావన్ (16), పృథ్వీ షా (8)లను వరుస బంతుల్లో ఔట్ చేసి సోధి (3/26) కంగారు పెట్టించాడు. రెండు సిక్స్‌లు కొట్టి లక్ష్యాన్ని కరిగించే ప్రయత్నం చేసిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (9 బంతుల్లో 15) కూడా ఎక్కువసేపు నిలవలేదు. పరిస్థితిని గ్రహించిన పంత్ ఈ దశలో అనవసర షాట్లకు పోయి వికెట్ పారేసుకోకుండా ఓపిక, పట్టుదల చూపాడు. పంత్, ఇంగ్రామ్ (12) క్రీజులో ఉన్నా... ఏడో ఓవర్ నాలుగో బంతి నుంచి 15వ ఓవర్ ఐదో బంతి వరకు ఢిల్లీ ఇన్నింగ్స్‌లో ఒక్క బౌండరీ కూడా లేకపోవడం గమనార్హం. ఒకటీ, రెండు పరుగులు చేస్తూ పోయినా లక్ష్యం పెద్దదేమీ కాకపోవడంతో ఇబ్బంది లేకపోయింది. 36 బంతుల్లో 32 పరుగులు చేయాల్సిన దశలో అరోన్ ఓవర్లో పంత్ సిక్స్, ఫోర్ బాది పరిస్థితిని తేలిక చేశాడు. గోపాల్ వేసిన తర్వాతి ఓవర్‌లో రూథర్‌ఫర్డ్ (11), పంత్ చెరో సిక్స్ కొట్టి స్కోరు సమం చేశారు. సోధి బౌలింగ్‌లో లాంగాన్‌లోకి సిక్స్ కొట్టిన పంత్ అర్ధ సెంచరీ (38 బంతుల్లో) పూర్తి చేసుకోవడంతో పాటు మ్యాచ్‌ను ముగించాడు.
Comments
Please login to add a commentAdd a comment