ఢిల్లీ: ఐపీఎల్‌లో భాగంగా ఇక్కడ ఫిరోజ్ షా కోట్ల మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ 116 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. రాజస్తాన్ బ్యాట్స్‌మెన్ ఘోరంగా విఫలం కావడంతో ఆ జట్టు స్పల్స స్కోరుకే పరిమితమైంది. రాజస్తాన్ ఆటగాళ్లలో రియాన్ పరాగ్(50; 49 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మినహా ఎవరూ రాణించలేదు. రహానే(2), లివింగ్ స్టోన్(14), సంజూ శాంసన్(5), లామ్రోర్(8), శ్రేయస్ గోపాల్(12), స్టువర్ట్ బిన్నీ(0), కృష్ణప్ప గౌతమ్(6), ఇష్ సోథీ(6)లు వరుసగా క్యూకట్టడంతో రాజస్తాన్ తేరుకోలేకపోయింది. ఢిల్లీ బౌలర్లు విజృంభించి బౌలింగ్ చేయడంతో రాజస్తాన్ మూడంకెల స్కోరును దాటడానికి ఆపసోపాలు పడింది. ఇషాంత శర్మ, అమిత్ మిశ్రాలు తలో మూడు వికెట్లు సాధించగా, ట్రెంట్ బౌల్ట్ రెండు వికెట్లు తీశాడు.
30 పరుగులకే నాలుగు వికెట్లు..
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్తాన్‌కు శుభారంభం లభించలేదు. ఓపెనర్లు రహనే, లివింగ్ స్టోన్‌లు ఆదిలోనే పెవిలియన్ చేరారు. ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో ధావన్‌కు క్యాచ్ ఇచ్చి రహానే ఔట్ కాగా, ఇషాంత్ శర్మ వేసిన మరుసటి ఓవర్‌లో లివింగ్ స్టోన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో 20 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది రాజస్తాన్. ఆపై వెంటనే సంజూ శాంసన్ రనౌట్ కావడంతో పాటు, లామ్రోర్ కూడా పెవిలియన్ బాటపట్టాడు. ఆ దశలో రియన్ పరాగ్ బాధ్యాయుతంగా ఆడాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా చివరి బంతి వరకూ క్రీజ్‌లో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. దాంతో రాజస్తాన్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment