అలా మొదలైంది... ఆట | Jalaldiwal Village in Ludhiana are Using Hockey to Help Underprivileged Kids Fight Poverty | Sakshi
Sakshi News home page

అలా మొదలైంది... ఆట

Published Tue, Jul 7 2015 2:44 PM | Last Updated on Sun, Sep 3 2017 5:04 AM

అలా మొదలైంది... ఆట

అలా మొదలైంది... ఆట

లూధియానా: అది పంజాబ్‌లోని లూధియానా జిల్లా, ఆ జిల్లాలోని జలాల్‌దివాల్ గ్రామం. శివారున ఓ చిన్న గ్రౌండ్. సాయంత్రం సరిగ్గా నాలుగు గంటలు. ఇంతలో విజిల్ మోగింది. ఒక్కొక్కరే విద్యార్ధులు అక్కడికి చేరుతున్నారు. కొందరి చేతుల్లో హాకీ కర్రలు. అవి చాలా మామూలివి. కొందరి చేతుల్లో అవి కూడా లేవు. దొరికిన కర్రలను చేబూని వచ్చారు. ఆట మొదలైంది. వారి కళ్లలో జీవితంలో ఏదో సాధించాలనే తపన కనిపిస్తోంది.

వారికి సరైన ఆట దుస్తులుగానీ, బూట్లుగానీ లేవు. కారణం వారంతా పేద కుటుంబాల నుంచి, నిమ్న వర్గాల నుంచి వచ్చిన పిల్లలు. అంతే ఆ రోజు నుంచి ఆట సాగుతూనే ఉంది. గ్రౌండ్ చిన్నదైన వారు చిన్నబుచ్చుకోలేదు. అకుంఠిత దీక్షతో ఆడుతూనే ఉన్నారు. వర్షాకాలమైనా, ఎండాకాలమైనా ఆట ఆగలేదు. సరైనా తిండిలేకున్నా, ఇంట్లో తిట్లు తిన్నా రోజూ నాలుగు నుంచి ఆరు గంటల వరకు ఆట సాగాల్సిందే.

అలా రెండు నెలలు గడిచాయి. పిల్లల్లో ఉత్సాహం పెరిగిందేతప్పా తరగలేదు. ఆట పట్ల పిల్లలకుగల అకుంఠిత దీక్షను గమనించిన గ్రామంలోని డబ్బూ, పలుకుబడి కలిగిన పెద్దలు కదిలిపోయారు. సరైన కోచ్ కోసం పట్నాలకెళ్లి వాకబు చేశారు. ఓ పల్లెటూరుకు ఏమొస్తాం అంటూ పట్న వాసానికి అలవాటుపడ్డ ఎంతోమంది కోచ్‌లు పెదవి విరిచారు. ససేమిరా రామన్నారు.

పిల్లల ఆటను స్ఫూర్తిగా తీసుకున్న పెద్దలు కూడా నిరాశకు గురికాలేదు. కోచ్‌ల కోసం గాలిస్తూ వచ్చారు. చివరకు గ్రామీణ నేపథ్యం కలిగిన బల్జీత్ కౌర్ అనే అమ్మాయి అంగీకరించింది. ఆమె పాటియాలలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ ప్రాడక్ట్. ఆమె కోచింగ్‌తో పిల్లలు హాకీలో మరింత పదునుదేరారు. లూధియానాలో జరిగిన ఓ గ్రామీణ క్రీడల్లో ఆ పిల్లలు ఓ మెరపు మెరిసారు. డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన ఖిల్లా రాయ్‌పూర్ గ్రామం జట్టును ఓడించారు.

అంతే పిల్లలతోపాటు జలాల్‌దివాల్ గ్రామానికి పేరొచ్చింది. గ్రామంలోని డబ్బుగల పెద్దలు మరికొంత మంది ముందుకొచ్చి పిల్లలకు కావాల్సిన దుస్తులు, బూట్లు కొనిచ్చారు. కొంతమంది వారికి కావాల్సిన పోషకాహార పదార్థాలను ఉచితంగా సరఫరా చేశారు. ఇక పిల్లలు ద్విగుణీకృత ఉత్సాహంతో పంజాబ్ రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ప్రతి గ్రామీణ క్రీడల్లో పాల్గొంటూ వచ్చారు. ఆ పిల్లల నుంచి జగ్తార్ సింగ్ ఘోడాలోని స్పోర్ట్స్ స్కూల్లో అడ్మిషన్ వచ్చింది.

అమృత్‌పాల్ కౌర్ అనే విద్యార్థినికి పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్‌కు చెందిన బాదల్ గ్రామంలోని స్పోర్ట్స్ అకాడమీలో అడ్మిషన్ వచ్చింది. ఆ గ్రామం పిల్లలకు ఇది మరింత స్ఫూర్తినిచ్చింది. ఆటే ప్రాణంగా భావించే ఆ పిల్లలు చదువును ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. ఆటతో చదువులో ప్రావీణ్యత, శ్రద్ధ మరింత పెరిగిందని పాఠశాల ఉపాధ్యాయులు చెబుతున్నారు.

పిల్లల విజయగాధ విన్న గ్రామానికి చెందిన ఓ ఎన్నారై హాకీ గ్రౌండ్ కోసం తన పొలాన్ని విరాళంగా ఇచ్చారు. గ్రామంతో సంబంధంవున్న కొంతమంది కార్పొరేటర్లు ముందుకొచ్చి ప్రస్తుతం ఆ గ్రౌండ్‌ను అభివృద్ధి చేస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement