ఆసియా ఆశ జపాన్ | Japan Confident of World Cup Victory Rallies | Sakshi
Sakshi News home page

ఆసియా ఆశ జపాన్

Published Thu, Jun 5 2014 1:10 AM | Last Updated on Sat, Sep 2 2017 8:19 AM

ఆసియా ఆశ జపాన్

ఆసియా ఆశ జపాన్

గ్రూప్-సి విశ్లేషణ
 కొలంబియా, గ్రీస్,
 ఐవరీ కోస్ట్, జపాన్
 
 ఈసారి ప్రపంచకప్ ఫుట్‌బాల్‌లో అన్ని గ్రూప్‌లతో పోలిస్తే సమ ఉజ్జీలు ఉన్న గ్రూప్‌గా ‘సి’ని చెప్పుకోవచ్చు. కొలంబియా ఫేవరెట్‌గా కనిపిస్తున్నా... జపాన్, ఐవరీ కోస్ట్‌లకు కూడా రెండో రౌండ్‌కు చేరడానికి మంచి అవకాశాలే ఉన్నాయి. ఇక గ్రీస్‌ను కూడా తక్కువగా అంచనా వేయలేం. ఆసియా కోటా నుంచి అర్హత సాధించిన దక్షిణకొరియా, ఇరాన్, ఆస్ట్రేలియాలతో పోలిస్తే జపాన్ కాస్త తేలికైన ప్రత్యర్థులతో ఆడబోతోంది. దీంతో ఈసారి ఆసియా ఆశలన్నీ జపాన్‌పైనే.
 
 ఐవరీ కోస్ట్
 ఆఫ్రికా పవర్ హౌజ్ ఐవరీ కోస్ట్‌ను ‘సి’ గ్రూప్‌లో ఏ మాత్రం తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. ఒకవేళ ఈ జట్టును తక్కువగా అంచనావేస్తే తప్పులో కాలేసినట్లే. గత ప్రపంచకప్‌లలో నిరాశే మిగలడంతో ఈసారి కసిగా బరిలోకి దిగుతోంది.
 ప్రపంచకప్ చరిత్ర: ఐవరీ కోస్ట్ తొలిసారిగా 2006 ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. దక్షిణాఫ్రికా ఆతిథ్యమిచ్చిన 2010 ప్రపంచకప్‌లో బరిలోకి దిగింది. ఈ రెండింటిలో గ్రూప్ దశ దాటలేదు.
 
 అర్హత సాధించారిలా: ప్రపంచకప్‌కు క్వాలిఫయింగ్‌లో భాగంగా ఐవరీ కోస్ట్ మూడో రౌండ్‌లో 4-2తో సెనెగల్‌పై పైచేయి సాధించి ప్రపంచకప్‌కు చేరింది.
 కీలక ఆటగాళ్లు: యయ టూరే, గెర్వినో, డిడియర్ డ్రోగ్బా, కోలో టూరే. విల్‌ఫ్రెడ్ బోనీలతో కూడిన ఐవరీ జట్టు సంచలనాలు సాధించడంలో దిట్ట.
 
 కోచ్: సాబ్రి లమౌచి
 అంచనా: కొలంబియా, జపాన్‌లలో ఒకరిని ఓడిస్తే నాకౌట్‌కు చేరొచ్చు.
 
 కొలంబియా
 గ్రూప్ ‘సి’లో కొలంబియాను అంతా హాట్‌ఫేవరెట్‌గా భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఆటతీరు... జట్టులో స్టార్ ఆటగాళ్లు... ర్యాంకుల్లో మెరుగైన స్థానం... కొలంబియాకు కలిసొచ్చే అంశాలు.
 
 ప్రపంచకప్ చరిత్ర: ప్రపంచకప్‌లో కొలంబియా ఐదోసారి బరిలోకి దిగుతోంది. తొలిసారిగా 1962లో ప్రపంచకప్ ఆడిన కొలంబియా మళ్లీ 1990, 94, 98ల్లో ప్రపంచకప్‌లో పాల్గొన్నది. 1990లో రెండో రౌండ్‌కి చేరిన కొలంబియాకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన.
 
 అర్హత సాధించారిలా: కొలంబియా క్వాలిఫయింగ్ టోర్నీలో అదుర్స్ అనిపించింది. 16 మ్యాచ్‌లకుగాను 9 మ్యాచ్‌ల్లో గెలిచి, మూడింటిని డ్రాగా ముగించి, 4 మ్యాచ్‌ల్లో ఓడింది. 30 పాయింట్లతో అర్జెంటీనా తర్వాతి స్థానంలో నిలిచి ప్రపంచకప్‌కు అర్హత సాధించింది.

 కీలక ఆటగాళ్లు: స్టార్ స్ట్రయికర్ ఫాల్కావో జట్టులో ఉండటం కొలంబియాకు కొండంత బలం. యేపెస్, పెరియాలతో పటిష్టమైన రక్షణశ్రేణి కొలంబియా జట్టు సొంతం. ఇక అటాకింగ్ మిడ్ ఫీల్డర్లు జేమ్స్ రోడ్రిగ్వెజ్, టెయో గుతిర్రెజ్ జట్టులో ఉండనే ఉన్నారు.

 కోచ్: జోస్ పెకర్‌మాన్
 అంచనా: తొలి రౌండ్‌లో అగ్రస్థానంలో
 నిలిచే అవకాశం.
 
   గ్రీస్
 గ్రీస్‌పై పెద్దగా అంచనాలేమీ లేవు. పైగా ప్రపంచకప్ చరిత్రలో ఆ జట్టు పెద్దగా సాధించిందేమీ లేదు. ప్రధాన టోర్నీల్లో ఒకటైన యూరోకప్‌లో గ్రీస్ 2004లో విజేతగా నిలిచింది. మెగా టోర్నీల్లో గ్రీస్‌ది ఇదే అత్యుత్తమ ప్రదర్శన.
 
 ప్రపంచకప్ చరిత్ర: ప్రపంచకప్‌లో ఇప్పటిదాకా రెండు సార్లు బరిలోకి దిగింది. 1994, 2010 ప్రపంచకప్‌లలో మొదటి రౌండ్ దాటలేదు.
 అర్హత సాధించారిలా: క్వాలిఫయింగ్‌లో గ్రీస్ 10 మ్యాచ్‌ల్లో 25 పాయింట్లు సాధించింది. అయితే గోల్స్ ఆధారంగా ఆ గ్రూప్‌లో గ్రీస్ రెండో స్థానంలో నిలిచింది. దీంతో రెండో రౌండ్ ఆడాల్సి వచ్చింది. ఆ రౌండ్‌లో గ్రీస్ 4-2తో రొమేనియాపై పైచేయి సాధించి ప్రపంచకప్‌లో అడుగుపెట్టింది.
 
 కీలక ఆటగాళ్లు: జనరల్ గియోర్గాస్ కరాగోనిస్ గ్రీస్‌లో కీలక ఆటగాడు. దిమిత్రియోస్ సాల్పిన్గిడిస్, కోన్‌స్టాన్‌టినోస్ మిత్రోగ్లు స్టార్ ఫార్వర్డ్‌లు. ఇక థియోఫానిస్ గెకాస్, గియోర్గాస్ సమరాస్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్నారు.
 కోచ్: ఫెర్నాండో సాంటోస్
 అంచనా: తొలి రౌండ్ దాటే అవకాశాలు
 అంతంత మాత్రమే.
 
   జపాన్
 గత ప్రపంచకప్‌లో అంచనాలకు మించిన రాణించిన జపాన్ జట్టు ఆ తర్వాత కోచ్‌గా అల్బెర్టో జచ్చెరోని జట్టు బాధ్యతలు చేపట్టాక అద్భుతమైన ఆటతీరును కనబరుస్తోంది. ప్రపంచకప్ గ్రూప్ సిలో కొలంబియా ఫేవరెట్‌గా కనిపిస్తున్నప్పటికీ... మిగిలిన జట్లయిన గ్రీస్, ఐవరీ కోస్ట్‌లకు షాకిచ్చే సత్తా జపాన్‌కు ఉంది.
 
 ప్రపంచకప్ చరిత్ర: ఆసియాలో అత్యంత విజయవంతమైన జట్టు జపాన్.. ఐదోసారి ఫిఫా ప్రపంచకప్‌లో బరిలోకి దిగుతోంది. 1994లో కొద్దిలో ప్రపంచకప్ అర్హతను కోల్పోయినా తదుపరి ప్రపంచకప్‌లో తన కలను నెరవేర్చుకుంది. ఆ తర్వాత 2002, 06, 10 ప్రపంచకప్‌లలో ఆడింది. అయితే 2002, 2010లో మాత్రమే జపాన్ రెండో రౌండ్‌కు అర్హత సాధించింది.

 అర్హత సాధించారిలా: 2010 ప్రపంచకప్‌లో అంచనాలకు మించిన రాణించిన జపాన్ ఆ తర్వాత కోచ్‌గా అల్బెర్టో జచ్చెరోని బాధ్యతలు చేపట్టాక అద్భుతమైన ఆటతీరును కనబరుస్తోంది. ఇక క్వాలిఫయింగ్‌లో తన ప్రదర్శనతో జపాన్ ఆకట్టుకుంది. 8 మ్యాచ్‌ల్లో గ్రూప్ బిలో 17 పాయింట్లతో టాప్‌లో నిలిచింది.  
 
 కీలక ఆటగాళ్లు: జపాన్ జట్టులో మిడ్ ఫీల్డర్ కీసుకె హోండా అద్భుతాలు చేస్తున్నాడు. హిడేటోషి నకాటా, షున్‌సుకే నకమురా లాంటి స్టార్లు లేకపోయినా హోండా ఆ లోటును తీరుస్తున్నాడు. షింజి కగవా, షింజి ఒకఝకి ప్రతిభ జపాన్‌ను ఈ మెగా టోర్నీలో మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశాలున్నాయి.
 
 కోచ్: అల్బెర్టో జచ్చెరోని
 అంచనా: ఐవరీకోస్ట్, కొలంబియాలలో ఒకరిని ఓడిస్తే గ్రూప్ దశ దాటుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement