షకీరా x జెన్నిఫర్ లోపెజ్
పోటాపోటీగా ప్రపంచకప్ పాటలు
లండన్: ప్రపంచకప్ ఫుట్‌బాల్ కోసం అభిమానులు ఎంత ఎదురు చూస్తారో... ఆ టోర్నీ సందర్భంగా తయారయ్యే పాట కోసం కూడా అంతే ఆసక్తిగా చూస్తారు. గత ప్రపంచకప్ సందర్భంగా షకీరా ‘వాకా వాకా’ పాట ఇప్పటికీ ప్రపంచం మొత్తం హోరెత్తుతూనే ఉంది. 2006లోనూ షకీరానే ఫిఫా కోసం ప్రత్యేక గీతం తయారు చేశారు. అయితే ఈసారి షకీరాను పక్కనబెట్టిన ఫిఫా జెన్నిఫర్ లోపెజ్‌ను రంగంలోకి దించింది. ఆమెతో పాటు పిట్‌బుల్, క్లాడియా (బ్రెజిల్ పాప్ సింగర్) కలిసి ఓ ‘వియ్ ఆర్ వన్ ఓలె ఓలా’ అంటూ ప్రత్యేక పాటను రూపొందించారు. ప్రపంచకప్ ప్రారంభోత్సవంలో కూడా దీనిని ప్రదర్శిస్తారు.
ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఈసారి తనకు అవకాశం ఇవ్వలేదని హర్ట్ అయిందో లేక ఆటపై అభిమానాన్ని చాటాలనుకుందో... షకీరా కూడా ‘లా లాలలా...’ అంటూ ఓ వీడియో సాంగ్‌ను చిత్రీకరించింది. కొలంబియా సింగర్ షకీరా రూపొందించిన ఈ పాట భారీ హిట్ అయింది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఈ పాటను హోరెత్తిస్తున్నారు. కేవలం ఐదు రోజుల్లో యూ ట్యూబ్‌లో 5 లక్షల మంది ఈ పాటను చూశారు. మరో వైపు జెన్నిఫర్ అండ్ కో రూపొందించిన అధికారిక పాట మాత్రం యావరేజ్‌గా మిగిలింది. ఇందులో బ్రెజిల్ సంసృ్కతి, సంప్రదాయాలు కనిపించడం లేద నే విమర్శలు వచ్చాయి.