World Cup Football
-
FIFA World Cup Qatar 2022: జర్మనీ... డ్రాతో గట్టెక్కింది!
దోహా: ప్రపంచకప్ ఫుట్‌బాల్ చరిత్రలో జర్మనీది ఘనచరిత్రే! బ్రెజిల్ అంతటి మేటి జట్టు జర్మనీ. బ్రెజిల్ ఐదుసార్లు గెలిస్తే... జర్మనీ నాలుగుసార్లు ప్రపంచకప్‌ను అందుకుంది. అంతేకాదు గెలిచినన్ని సార్లు రన్నరప్‌గా నిలిచింది. మరో నాలుగుసార్లు మూడో స్థానంలో నిలిచింది. ఇలా పాల్గొన్న ప్రతీ మెగా ఈవెంట్లోనూ సత్తా చాటుకున్న మేటి జట్టు గత టోర్నీలో తొలి రౌండ్ దాటకపోవడమే పెద్ద షాక్ అనుకుంటే మళ్లీ ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితుల్నే ఎదుర్కొంటుంది. స్పెయిన్‌తో జరిగిన లీగ్ పోరులో జర్మనీ 1–1తో డ్రాతో గట్టెక్కింది. స్పెయిన్ తరఫున సబ్‌స్టిట్యూట్ అల్వారో మొరాటా (62వ ని.లో), జర్మనీ జట్టులో సబ్‌స్టిట్యూట్ ఫుల్క్రుగ్ (83వ ని.లో) గోల్ చేశారు. ఇప్పుడు ఒక ఓటమి, ఒక డ్రాతో ఉన్న జర్మనీ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో కోస్టారికాను ఓడిస్తేనే సరిపోదు. మిగతా జట్ల ఫలితాలు కూడా కలిసి రావాలి. ఈ గ్రూపులో ఆఖరి లీగ్ పోటీల్లో కోస్టారికాతో జర్మనీ... జపాన్‌తో స్పెయిన్ తలపడతాయి. ఈ రెండు మ్యాచ్‌లు గురువారమే జరుగనున్నాయి. దీంతో ఇంకో రెండు రోజుల్లో ఏ రెండు ముందుకో, ఏ రెండు ఇంటికో తేలిపోతుంది. -
FIFA World Cup Qatar 2022: అర్జెంటీనా నిలిచింది
తొలి మ్యాచ్‌లో సౌదీ అరేబియా చేతిలో ఎదురైన అనూహ్య ఓటమి నుంచి అర్జెంటీనా వెంటనే తేరుకుంది. ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీ లో నాకౌట్ దశకు అర్హత పొందే అవకాశాలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఈ మాజీ చాంపియన్ జట్టు సమష్టి ప్రదర్శనతో రాణించింది. తనదైన రోజున ఎంతటి మేటి జట్టునైనా ఓడించే సత్తాగల మెక్సికోను ఏమాత్రం తేలిగ్గా తీసుకోకుండా ఆడిన అర్జెంటీనా రెండు గోల్స్ తేడాతో విజయం సాధించి ఊపిరి పీల్చుకుంది. పోలాండ్‌తో జరిగే చివరి మ్యాచ్‌లో అర్జెంటీనా గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా ప్రిక్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంటే సౌదీ అరేబియా–మెక్సికో మ్యాచ్ ఫలితంపై అర్జెంటీనా జట్టు నాకౌట్ అవకాశాలు ఆధారపడి ఉంటాయి. పోలాండ్ చేతిలో ఓడితే మాత్రం అర్జెంటీనా లీగ్ దశలోనే ఇంటిముఖం పడుతుంది. దోహా: టైటిల్ ఫేవరెట్స్‌లో ఒక జట్టుగా ఖతర్‌కు వచ్చిన అర్జెంటీనా తొలి మ్యాచ్‌లో సౌదీ అరేబియా చేతిలో ఓడిపోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. కానీ తొలి మ్యాచ్‌లో ఎదురైన పరాభవం నుంచి తేరుకున్న అర్జెంటీనా రెండో మ్యాచ్‌లో స్థాయికి తగ్గట్టు ఆడింది. గ్రూప్ ‘సి’లో భాగంగా మెక్సికోతో భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా 2–0 గోల్స్ తేడాతో విజయం సాధించింది. ఆట 64వ నిమిషంలో కెప్టెన్ లయనెల్ మెస్సీ గోల్‌తో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లిన అర్జెంటీనా... 87వ నిమిషంలో ఎంజో ఫెర్నాండెజ్ గోల్‌తో విజయాన్ని ఖాయం చేసుకుంది. నాకౌట్ చేరే అవకాశాలు సజీవంగా ఉండాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో అర్జెంటీనా జాగ్రత్తగా ఆడింది. మరోవైపు మెక్సికో ఫార్వర్డ్ అలెక్సిక్ వెగా అవకాశం వచ్చినపుడల్లా అర్జెంటీనా రక్షణ శ్రేణి ఆటగాళ్లకు ఇబ్బంది పెట్టాడు. 45వ నిమిషంలో వెగా కొట్టిన షాట్‌ను అర్జెంటీనా గోల్‌కీపర్ సమర్థంగా అడ్డుకున్నాడు. రెండో అర్ధభాగంలో అర్జెంటీనా ఆటగాళ్లు తమ దాడుల్లో పదును పెంచారు. చివరకు 64వ నిమిషంలో కుడివైపు నుంచి డిమారియా ఇచ్చిన పాస్‌ను అందుకున్న మెస్సీ 25 గజాల దూరం నుంచి షాట్ కొట్టగా మెక్సికో గోల్‌కీపర్ డైవ్ చేసినా బంతిని గోల్‌పోస్ట్‌లోనికి పోకుండా అడ్డుకోలేకపోయాడు. దాంతో అర్జెంటీనా బోణీ కొట్టింది. ఖాతా తెరిచిన ఉత్సాహంతో అర్జెంటీనా మరింత జోరు పెంచింది. మెస్సీ అందించిన పాస్‌ను ఎంజో ఫెర్నాండెజ్ అందుకొని షాట్ కొట్టగా బంతి మెక్సికో గోల్‌పోస్ట్‌లోనికి వెళ్లింది. దాంతో ప్రపంచకప్ చరిత్రలో అర్జెంటీనా చేతిలో మెక్సికోకు నాలుగో ఓటమి ఎదురైంది. ప్రపంచకప్‌లో నేడు కామెరూన్ X సెర్బియా మధ్యాహ్నం గం. 3:30 నుంచి దక్షిణ కొరియా X ఘనా సాయంత్రం గం. 6:30 నుంచి బ్రెజిల్ X స్విట్జర్లాండ్ రాత్రి గం. 9:30 నుంచి పోర్చుగల్ X ఉరుగ్వే అర్ధరాత్రి గం. 12:30 నుంచి స్పోర్ట్స్ 18, జియో సినిమా చానెల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం -
పూర్వ వైభవంపై జర్మనీ దృష్టి
ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీ చరిత్రలో అత్యధికంగా 109 మ్యాచ్‌లు ఆడిన జట్టుగా బ్రెజిల్‌తో సమానంగా జర్మనీ నిలిచింది. బ్రెజిల్ ఐదుసార్లు విశ్వవిజేతగా నిలిస్తే, జర్మనీ నాలుగుసార్లు ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. అయితే 2014లో నాలుగోసారి ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన తర్వాత జర్మనీ ఆటలో తిరోగమనం కనిపిస్తోంది. 2018 ప్రపంచకప్‌లో జర్మనీ గ్రూప్ దశలోనే నిష్క్రమించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అనంతరం యూరో టోర్నీలోనూ జర్మనీ ప్రిక్వార్టర్ ఫైనల్‌ను దాటలేకపోయింది. ఈ నేపథ్యంలో ‘ఖతర్’లో జర్మనీ ప్రయాణం ఎంతవరకు సాగుతుందో చెప్పలేని స్థితి. –సాక్షి క్రీడా విభాగం జర్మనీ మాజీ చాంపియన్ స్పెయిన్‌తో మ్యాచ్‌ను మినహాయిస్తే... గ్రూప్ ‘ఇ’లోని ఇతర జట్లయిన కోస్టారికా, జపాన్లపై జర్మనీ విజయం సాధిస్తే తదుపరి దశకు అర్హత పొందడం ఖాయమనుకోవాలి. గుండోగన్, జమాల్ ముసియాలా, కాయ్ హవెర్ట్, లెరాయ్, మార్కో రెయిస్ కీలక ఆటగాళ్లు. ప్రపంచకప్‌లో ఉత్తమ ప్రదర్శన: నాలుగుసార్లు చాంపియన్ (1954, 1974, 1990, 2014). ‘ఫిఫా’ ర్యాంక్: 11. అర్హత ఎలా: యూరోప్ క్వాలిఫయింగ్ లో గ్రూప్ ‘జె’ విజేత. స్పెయిన్ సమన్వయంతో ఆడటంలో స్పెయిన్ ఆటగాళ్లు సిద్ధహస్తులు. గత ఆరేళ్లలో ఆ జట్టు ఆడిన మ్యాచ్‌ల్లో రెండు గోల్స్ తేడాతో ఓడిపోయిన ఒక్క మ్యాచ్ కూడా లేదు. ఈ ప్రపంచకప్‌లో తమ గ్రూప్‌లో జర్మనీతో మ్యాచ్ ఆ జట్టుకు కీలకం కానుంది. పెద్రీ, ఫెరాన్ టోరెస్, మొరాటా, సిమోన్ కీలక ఆటగాళ్లు. ప్రపంచకప్‌లో ఉత్తమ ప్రదర్శన: చాంపియన్ (2010). ‘ఫిఫా’ ర్యాంక్: 7. అర్హత ఎలా: యూరోప్ క్వాలిఫయింగ్‌లో గ్రూప్ ‘బి’ విజేత. జపాన్ వరుసగా ఏడో ప్రపంచకప్‌లో ఆడుతున్న జపాన్ మూడుసార్లు గ్రూప్ దశలో నిష్క్రమించగా, మూడుసార్లు ప్రిక్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగింది. ఆసియా క్వాలిఫయింగ్ రెండో రౌండ్లో జపాన్ ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లోనూ గెలిచింది. మంగోలియాపై 14–0తో, మయన్మార్‌పై 10–0తో నెగ్గిన జపాన్ రెండో రౌండ్లో ఏకంగా 46 గోల్స్ కొట్టి కేవలం రెండు గోల్స్ సమర్పించుకుంది. మూడో రౌండ్లో రెండో స్థానంలో నిలిచి ప్రపంచకప్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. దైచి కమాడా కీలక ఆటగాడు. జర్మనీ, స్పెయిన్లతో మ్యాచ్ ఫలితాలే ఈసారి జపాన్ ప్రస్థానాన్ని నిర్ణయిస్తాయి. ప్రపంచకప్‌లో ఉత్తమ ప్రదర్శన: ప్రిక్వార్టర్ ఫైనల్ (2002, 2010, 2018). ‘ఫిఫా’ ర్యాంక్: 24. అర్హత ఎలా: ఆసియా క్వాలిఫయింగ్‌లో మూడో రౌండ్ గ్రూప్ ‘బి’ రన్నరప్. కోస్టారికా ఆరోసారి ప్రపంచకప్‌లో ఆడుతున్న కోస్టారికా అద్భుతంగా రాణిస్తే తప్ప ఈసారి గ్రూప్ దశను దాటే అవకాశాలు కనిపించడంలేదు. జర్మనీ, స్పెయిన్లలో ఒక జట్టును ఓడిస్తే తప్ప కోస్టారికా ముందుకు వెళ్లడం కష్టమే. అర్సెనల్ జట్టుకు ఆడే జోయల్ క్యాంప్‌బెల్ కీలక ఆటగాడు. ప్రపంచకప్‌లో ఉత్తమ ప్రదర్శన: క్వార్టర్ ఫైనల్ (2014). ‘ఫిఫా’ ర్యాంక్: 31. అర్హత ఎలా: ఉత్తర, మధ్య అమెరికా, కరీబియన్–ఓసియానియా క్వాలిఫయింగ్ ప్లే ఆఫ్ మ్యాచ్ విజేత. -
World Cup 2022: 64 ఏళ్ల తర్వాత... ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు వేల్స్ జట్టు అర్హత
కార్డిఫ్: ఎప్పుడో 1958లో... వేల్స్ ఫుట్‌బాల్ జట్టు ప్రపంచకప్‌లో చక్కటి ప్రదర్శనతో క్వార్టర్ ఫైనల్ వరకు చేరింది. అయితే ఆ మ్యాచ్‌లో అప్పుడు 17 ఏళ్ల వయసు ఉన్న ఆల్‌టైమ్ గ్రేట్ పీలే (బ్రెజిల్) చేసిన ఏకైక గోల్‌తో వేల్స్ పరాజయం పాలైంది. ఆ తర్వాత మరో 15 ప్రపంచకప్‌లు జరిగినా... ఒక్కసారి కూడా వేల్స్ అర్హత సాధించలేకపోయింది. ఇప్పుడు మరోసారి ఆ టీమ్‌కు విశ్వవేదికపై తలపడే అవకాశం వచ్చింది. ఈ ఏడాది ఖతర్‌లో జరిగే ‘ఫిఫా’ వరల్డ్ కప్‌కు వేల్స్ అర్హత పొందింది. క్వాలిఫయర్స్ పోరులో వేల్స్ 1–0 తేడాతో ఉక్రెయిన్‌పై విజయం సాధించింది. ఉక్రెయిన్ ఆటగాడు ఆండ్రీ యర్మొలెంకో 34వ నిమిషంలో చేసిన ‘సెల్ఫ్ గోల్’తో వేల్స్‌కు అదృష్టం కలిసొచ్చింది. వేల్స్ స్టార్ ఆటగాడు, ఐదుసార్లు చాంపియన్స్ లీగ్ టైటిల్ విజయాల్లో భాగమైన గారెత్ బేల్ ఈ విజయాన్ని ‘తమ ఫుట్‌బాల్ చరిత్రలో అత్యుత్తమ ఫలితం’గా అభివర్ణించాడు. బేల్ కొట్టిన ఫ్రీకిక్‌ను హెడర్‌తో దిశ మళ్లించే ప్రయత్నంలోనే విఫలమై యర్మొలెంకో బంతిని తమ గోల్‌పోస్ట్‌లోకే పంపించాడు. ప్రపంచకప్‌లో ఇంగ్లండ్, అమెరికా, ఇరాన్ ఉన్న గ్రూప్ ‘బి’లో వేల్స్ పోటీ పడనుంది. -
India Vs Bangladesh: ఆసియా కప్ బెర్త్ లక్ష్యంగా...
దోహా: ప్రపంచకప్ ఫుట్‌బాల్–2022 అర్హతకు దూరమైన భారత జట్టు ఇప్పుడు ఆసియా కప్‌పై దృష్టి పెట్టింది. ఈ రెండు ఈవెంట్లకు ఉమ్మడి క్వాలిఫయింగ్ టోర్నీ ప్రస్తుతం ఖతర్ లో జరుగుతోంది. గ్రూప్ ‘ఇ’లో ఉన్న భారత్... బంగ్లాదేశ్‌తో సోమవారం జరిగే మ్యాచ్‌లోనైనా గెలిచి బోణీ కొట్టాలనే పట్టుదలతో ఉంది. ఈ గ్రూప్‌లో ఆరు మ్యాచ్‌లాడి ఒక్కటైనా గెలవలేకపోయిన భారత్‌కు మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో గెలవడం కీలకంగా మారింది. దీంతో 2023లో జరిగే ఆసియా కప్‌కు అర్హత సంపాదిస్తుంది. మొత్తం 8 గ్రూపుల్లో మెరుగైన నాలుగో స్థానంలో ఉన్న నాలుగు జట్లే మూడో క్వాలిఫయింగ్ రౌండ్‌కు నేరుగా అర్హత సంపాదిస్తాయి. ప్రస్తుతం మూడు పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నప్పటికీ సునీల్ చెత్రి నాయకత్వంలోని భారత జట్టు ఖాతాలో ఒక్క గెలుపు లేదు. కాబట్టి బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ (15న) లపై గెలిస్తేనే మెరుగైన నాలుగో స్థానం ఖాయ మవుతుంది. నేటి రాత్రి 7 గంటల 30 నిమిషాలకు మొదలయ్యే ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్– 2లో చానెల్లలో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
ఆ మూడు జట్లే ఫేవరెట్: భూటియా
ముంబై: వచ్చే నెల 14 నుంచి రష్యాలో ప్రారంభం కానున్న ప్రపంచకప్ ఫుట్‌బాల్ సమరంలో విజేత ఎవరనే దానిపై క్రమంగా అంచనాలు మొదలవుతున్నాయి. డిఫెండింగ్ చాంపియన్ జర్మనీతో పాటు ఫ్రాన్స్, స్పెయిన్లకు ఈసారి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నాడు భారత మాజీ కెప్టెన్ బైచుంగ్ భూటియా. అయితే అతడు బెల్జియంను డార్క్ హార్స్‌గా పేర్కొంటూ ఆ జట్టుపైనా నమ్మకం ఉంచాడు. ‘జర్మనీ, ఫ్రాన్స్ ఫేవరెట్లే. ప్రతిభావంతులున్న బెల్జియం నన్ను ఆశ్చర్యపరుస్తోంది’ అని పేర్కొన్నాడు. ప్రపంచకప్ అధికారిక ప్రసారకర్త సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఇండియా మంగళవారం నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో భూటియా పాల్గొన్నాడు. ఆతిథ్య రష్యా అవకాశాలపై మాట్లాడుతూ... ‘గ్రూప్ దశ దాటించగల ఆటగాళ్లున్న ఆ జట్టు రాణిస్తుంది. ప్రి క్వార్టర్స్‌కు చేరుతుంది. స్పెయిన్‌కు ఎప్పుడైనా కప్ గెలిచే సామర్థ్యముంది’ అని విశ్లేషించాడు. 1986 ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లండ్‌పై అర్జెంటీనా సాకర్ దిగ్గజం డిగో మారడోనా చేసిన గోల్ తనకు మధుర జ్ఞాపకమని భూటియా చెప్పాడు. -
అయ్యో... ఇటలీ!
మిలాన్ (ఇటలీ): ప్రపంచకప్ ఫుట్‌బాల్ అంటే ముందుగా గుర్తొచ్చే దేశాల పేర్లలో ఇటలీ ముందుంటుంది. అయితే వచ్చే ఏడాది ఈ మేటి జట్టు లేకుండానే ప్రపంచకప్ జరగనుంది. రష్యాలో వచ్చే సంవత్సరం జరిగే ప్రపంచకప్‌కు అర్హత పొందాలంటే స్వీడన్‌పై తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఇటలీ జట్టు 0–0 ‘డ్రా’తో సరిపెట్టుకుంది. ఈనెల 10న స్టాక్‌హోమ్‌లో జరిగిన తొలి దశ ప్లే ఆఫ్ మ్యాచ్‌లో స్వీడన్ 1–0తో గెలిచింది. దాంతో అర్హత అవకాశాలు సజీవంగా ఉండాలంటే రెండో ప్లే ఆఫ్ మ్యాచ్‌లో ఇటలీకి విజయం తప్పనిసరైంది. కానీ ఇటలీ జట్టు ‘డ్రా’తో సరిపెట్టుకోవడంతో ఓవరాల్‌గా స్వీడన్ 1–0తో ప్రపంచకప్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. సొంతగడ్డపై 74 వేల మంది ప్రేక్షకుల సమక్షంలో ఇటలీ జట్టు అవమానభారంతో నిష్క్రమించింది. 1958 తర్వాత ఇటలీ జట్టు ప్రపంచకప్‌కు అర్హత పొందకపోవడం ఇదే తొలిసారి. 1930లో జరిగిన తొలి ప్రపంచకప్‌కు దూరంగా ఉన్న ఇటలీ 1958 టోర్నీ అర్హత సాధించడంలో విఫలమైంది. ఈ రెండు ప్రపంచకప్‌లు మినహా మిగతా అన్ని ప్రపంచకప్‌లలో ఇటలీ పోటీపడింది. 1934, 1938, 1982, 2006 ప్రపంచకప్‌లలో విజేతగా నిలిచిన ఇటలీ జట్టు 1970లో, 1994లో రన్నరప్‌గా నిలిచింది. 1990లో మూడో స్థానం, 1978లో నాలుగో స్థానం సంపాదించింది. గోల్‌కీపర్ బఫన్ వీడ్కోలు ప్రపంచకప్‌కు ఇటలీ అర్హత సాధించకపోవడంతో ఆ జట్టు స్టార్ గోల్‌కీపర్ గియాన్లుగి బఫన్ తన 20 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. 39 ఏళ్ల బఫన్ ఇటలీ తరఫున 175 మ్యాచ్‌లు ఆడాడు. 1998 నుంచి 2014 వరకు వరుసగా ఐదు ప్రపంచకప్‌లలో అతను పాల్గొన్నాడు. 2006లో ఇటలీ విశ్వవిజేతగా నిలువడంలో బఫన్ కీలకపాత్ర పోషించాడు. బఫన్తోపాటు 36 ఏళ్ల డిఫెండర్ ఆండ్రియా బర్జాగ్లి, 34 ఏళ్ల మిడ్‌ఫీల్డర్ డానియల్ డి రోసీ కూడా తమ అంతర్జాతీయ కెరీర్‌కు స్వస్తి పలికారు. -
అర్జెంటీనాను గెలిపించిన మెస్సీ
కిటో (ఈక్వెడార్): వచ్చే ఏడాది రష్యాలో జరిగే ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌కు అర్హత సాధించాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో అర్జెంటీనా అదరగొట్టింది. స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ అన్నీ తానై ‘హ్యాట్రిక్’ సాధించి అర్జెంటీనాను ఒంటిచేత్తో గెలిపించా డు. ఈక్వెడార్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా 3–1తో విజయం సాధించి ప్రపంచకప్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. మ్యాచ్ మొదలైన 38 సెకన్లకే ఇబర్రా చేసిన గోల్‌తో ఈక్వెడార్ ఖాతా తెరిచింది. అయితే మెస్సీ తన మ్యాజిక్‌తో 11వ నిమిషంలో గోల్ చేసి స్కోరును సమం చేశాడు. ఆ తర్వాత 18వ, 62వ నిమిషంలో మెస్సీ మరో రెండు గోల్స్ చేసి హ్యాట్రిక్‌ను పూర్తి చేశాడు. అర్జెంటీనాకు ప్రపంచకప్ బెర్త్‌ను అందించాడు. అర్జెంటీనాతోపాటు కొలంబి యా, ఉరుగ్వే, పనామా జట్లు... యూరోప్ జోన్ నుంచి పోర్చుగల్, ఫ్రాన్స్ జట్లు ప్రపంచకప్‌కు అర్హత పొందాయి. నెదర్లాండ్స్, చిలీ, పరాగ్వే, అమెరికా జట్లు విఫలమయ్యాయి. -
నేపాల్‌పై భారత్ గెలుపు
ప్రపంచకప్ ఫుట్‌బాల్ క్వాలిఫయర్ గువాహటి: స్టార్ స్ట్రయికర్ సునీల్ చెత్రి సూపర్ షోతో అదరగొట్టడంతో ప్రపంచకప్ ఫుట్‌బాల్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో భారత జట్టు 2-0తో నేపాల్‌ను ఓడించింది. గురువారం ఇందిరాగాంధీ అథ్లెటిక్స్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో చెత్రి 53, 69వ నిమిషాల్లో రెండు గోల్స్ సాధించి జట్టుకు విజయాన్ని అందించాడు. 80వ నిమిషంలో హ్యాట్రిక్ గోల్ కోసం ప్రయత్నించినా తన స్పాట్ కిక్ విఫలమైంది. 17న రెండో అంచె మ్యాచ్ ఖాట్మండులో జరుగుతుంది. భూటాన్ సంచలన విజయం: తమ ఫుట్‌బాల్ క్రీడా చరిత్రలోనే భూటాన్ అతిపెద్ద సంచలనాన్ని నమోదు చేసింది. ఫిఫా ర్యాంకింగ్స్‌లో అట్టడుగున (209) ఉన్న భూటాన్ తమ ప్రపంచ కప్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో శుభారంభం చేసింది. శ్రీలంకతో జరిగిన ఈ మ్యాచ్‌లో 1-0తో గెలిచింది. 81వ నిమిషంలో షెరింగ్ డోర్జి ఈ గోల్ సాధించాడు. -
బ్రెజిల్ గెలిస్తే మళ్లీ.. సెక్సీ బాంబ్ పూనం ఆఫర్
మైసూరు (కర్ణాటక): ‘నా ఫేవరేట్ బ్రెజిల్ జట్టు ప్రపంచ కప్ ఫుట్‌బాల్‌లో గెలిస్తే.. ఏం చేస్తానో చెప్పాలని ఉంది. అయితే గుడి ముందు చెప్పలేకపోతున్నా..’ అని బాలీవుడ్ నటి, సెక్సీ బాంబ్ పూనం పాండే మళ్లీ బాంబ్ పేల్చింది. క్రికెట్లో ప్రపంచ కప్‌ను భారత్ గెలుచుకుంటే నగ్నంగా పోజులిస్తానని గతంలో సంచలన వ్యాఖ్యలు చేసిన ఆమె బుధవారం మైసూరుకు వచ్చింది. చాముండేశ్వరి మాత గుడిలో కొంత భక్తిపూర్వకంగా కనిపించిం ది. అనంతరం ఆమె మాట్లాడుతూ బ్రెజిల్ గెలిస్తే ఏ విధంగా సంబరాలు చేసుకుంటానో... ఇదివరకే ఓ వీడియోను విడుదల చేశానని, త్వరలోనే మరో వీడియో విడుదల చేస్తానని ప్రకటించింది. -
వివాదాలలోనూ మేటి
విశ్వవ్యాప్తంగా క్రీడాభిమానులందరినీ ఉర్రూతలూగించే ప్రపంచకప్ ఫుట్‌బాల్‌లో అందరి మదినీ దోచిన అద్భుత విజయాలెన్నో. ఆటగాళ్ల కళ్లు చెదిరే గోల్స్‌తో పాటు, గోల్ కీపర్ల విన్యాసాలనెన్నో ఈ మెగా టోర్నీలలో చూశాం. మున్ముందూ చూస్తాం. కానీ ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. రెండోవైపు ఈ టోర్నీ వివాదాలకు అతీతంకాదు. ఎన్నో మ్యాచ్‌లు వివాదాస్పదమయ్యాయి. ఆటగాళ్లు ఫైటర్స్‌గా మారిన సందర్భాలు ఉన్నాయి. రిఫరీలు చక్రం తిప్పిన సంఘటనలున్నాయి. క్రీడాస్ఫూర్తికి తూట్లు పొడిచిన వారూ ఉన్నారు. మొత్తానికి 84 ఏళ్ల ప్రపంచకప్ ఫుట్‌బాల్ చరిత్రలో టాప్-5గా పరిగణించే అత్యంత వివాదాస్పద సంఘటనల వివరాలు ఇలా ఉన్నాయి. - సాక్షి క్రీడావిభాగం ‘గోల్ కాని గోల్’తో ప్రపంచకప్ (ఇంగ్లండ్ * పశ్చిమ జర్మనీ, 1966) ఫుట్‌బాల్ ప్రపంచకప్ చరిత్రలో అత్యంత వివాదాస్పద సంఘటన ఈ ఫైనల్లో నెలకొంది. నిర్ణీత సమయంలో మ్యాచ్ 2-2 గోల్స్‌తో సమం కాగా, అదనపు సమయానికి అనుమతించారు. 12వ నిమిషంలో ఇంగ్లండ్ ఆటగాడు హర్స్ట్ షాట్ కొట్టగా... బంతి నేరుగా గోల్ పోస్ట్ క్రాస్ బార్ లోపలి వైపు తగిలి లైన్ బయటపడింది. అయితే ఆ బంతి లైన్ క్రాస్ అయిందీ.. లేనిదీ రిఫరీకి అంతుపట్టలేదు. స్పష్టత కోసం రష్యాకు చెందిన లైన్స్మ్యాన్ తోఫిక్ను సంప్రదించగా దాన్ని ఆయన గోల్‌గా ప్రకటించారు. దీంతో జర్మనీ ఆటగాళ్లు షాక్‌కు గురయ్యారు. ఈ నిర్ణయంతో ఇంగ్లండ్ జట్టు 3-2తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత మరో గోల్‌తో విజయాన్ని ఖాయం చేసుకొని తొలిసారిగా ప్రపంచకప్‌ను అందుకుంది. ఆ బంతి లైన్ క్రాస్ అయిన విషయంపై తోఫిక్ను చివరి దశలో అడిగినప్పుడు ఆయన ‘స్టాలిన్ గ్రాడ్’ అని బదులివ్వడం మరింత చర్చనీయాంశమైంది. ఎందుకంటే అక్కడ జర్మనీకి చెందిన నాజీల చేతిలో 75 వేల మంది రష్యన్లు ఊచకోతకు గురయ్యారు. జర్మనీ పట్ల వ్యతిరేకతతోనే అతను అలా వ్యవహరించాడని ఆ తర్వాత ప్రచారం జరిగింది. సాంటియాగో యుద్ధం (ఇటలీ * చిలీ, 1962) 1962 ప్రపంచకప్‌లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ను అత్యంత హింసాత్మక మ్యాచ్‌ల్లో ఒకటిగా పేర్కొంటారు. ప్రారంభమైన 12వ సెకన్లలోనే తొలి ఫౌల్... 12వ నిమిషంలో ఇటలీ మిడ్ ఫీల్డర్ ఫెర్రినీకి రెడ్ కార్డు... ఒకరి ముఖాలపై మరొకరు పంచ్‌లు... మధ్యలో పోలీసుల రంగప్రవేశం... ఇలా ఒకటి రెండు సార్లుకాదు మ్యాచ్ జరిగిన 90 నిమిషాలూ ఇదే తంతు. ఓ రకంగా మైదానంలో ఫుట్‌బాల్ ఆడుతున్న ఆటగాళ్లుగా కాకుండా వీరంతా తమ మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాన్ని ప్రేక్షకులకు ప్రదర్శిస్తున్నట్టు కనిపించింది. జిదాన్ ‘కుమ్ము’లాట (ఫ్రాన్స్ * ఇటలీ, 2006) ఈ ప్రపంచకప్‌లో ఫ్రాన్స్ స్ట్రయికర్ జినెదిన్ జిదాన్ మెరుపులు అసామాన్యం. కేవలం అతని ఆటతీరుతోనే ఫ్రాన్స్ ఫైనల్ వరకు వచ్చింది. తుది పోరులోనూ ఇటలీపై కళ్లుచెదిరే గోల్‌తో జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు. ఇక ఎక్స్ట్రా టైమ్‌లోనూ దాదాపు రెండో గోల్ చే స్తాడనుకున్న సమయంలో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. ఇటలీకి చెందిన మార్కో మాటెరాజ్జీ ఛాతీపై జిదాన్ తన తలతో గట్టిగా కుమ్మాడు. దీంతో రెడ్ కార్డుకు గురై మైదానం వీడడంతో చివరి పది నిమిషాలు ఫ్రాన్స్ జట్టు పది మంది ఆటగాళ్లతోనే ఆడాల్సి వచ్చింది. ఆ తర్వాత పెనాల్టీ షూట్అవుట్లోనూ జిదాన్‌కు అవకాశం రాకపోవడంతో ఫ్రాన్స్ 3-5తో ఇటలీ చేతిలో ఓడింది. అప్పటిదాకా హీరోగా ఉన్న జిదాన్ ఈ ఒక్క మ్యాచ్‌తో జీరోగా మారిపోయాడు. తన తల్లి, సోదరిలను మాటెరాజ్జీ అసభ్యపదజాలంతో దూషించినందుకే అలా ప్రవర్తించాల్సి వచ్చిందని ఆ తర్వాత జిదాన్ పేర్కొన్నాడు. మారడోనా ‘దైవహస్తం’ గోల్ (అర్జెంటీనా * ఇంగ్లండ్, 1986) ఫుట్‌బాల్ చరిత్రలో అత్యద్భుత ఆటగాడే కాకుండా అత్యంత వివాదాస్పదుడిగానూ అర్జెంటీనా దిగ్గజం డీగో మారడోనా పేరు తెచ్చుకున్నాడు. మెక్సికోలో జరిగిన ఈ టోర్నీ క్వార్టర్ ఫైనల్స్‌లో ఇంగ్లండ్‌తో అర్జెంటీనా ఆడింది. ద్వితీయార ్ధం ఆరో నిమిషంలో బంతి ఇంగ్లండ్ గోల్ కీపర్ షిల్టన్, మారడోనా మధ్య దోబూచులాడింది. షిల్టన్ కన్నా ఎనిమిది అంగుళాల తక్కువ ఎత్తు ఉన్న మారడోనా కొద్దిసేపు ‘ఆజానుబాహుడు’ అయ్యాడు. ఎందుకంటే పైకి లేచిన బంతిని ఏకంగా చేతితోనే గోల్ పోస్ట్‌లోకి నెట్టాడు. దీంతో అర్జెంటీనా 2-1తో ఈ మ్యాచ్‌ను గెలుచుకుంది. మ్యాచ్ అనంతరం ఆ గోల్ గురించి మారడోనాను అడిగితే ‘కొంచెం మారడోనా తల, మరికొంచెం దేవుడి చేయి కలిసి చేసిన గోల్ అది’ అని జవాబిచ్చాడు. అయితే ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’ గోల్‌కు సంబంధించిన ఫొటోలు పరిశీలిస్తే మారడోనా తల చేసిందేమీ లేదని స్పష్టంగా కనిపిస్తుంటుంది. ఈ విజయం ద్వారా ఫైనల్‌కు చేరిన అర్జెంటీనా అంతిమ సమరంలో పశ్చిమ జర్మనీని ఓడించి కప్ దక్కించుకుంది. కొరియా నాకౌట్‌కు రిఫరీ సహాయం (దక్షిణ కొరియా * ఇటలీ, 2002) తమ ప్రపంచకప్ చరిత్రలో ఈ టోర్నీలో దక్షిణ కొరియా తమ ‘సూపర్’ ఆటతీరుతో దూసుకుపోయింది. తొలిసారిగా సెమీస్‌కు చేరి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే వీరి ఈ దూకుడు వెనుక రిఫరీల సహాయం కూడా ఉంది. ఇటలీతో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్ నాకౌట్ మ్యాచ్ ఎక్స్ట్రా సమయంలో తమ కచ్చితమైన గోల్‌ను రిఫరీ బైరన్ మోరెనో ఆఫ్‌సైడ్ గోల్‌గా ప్రకటించి కొరియాకు మేలు చేశారు. అలాగే డైవింగ్ కారణంగా ఇటలీ స్టార్ ఆటగాడు ఫ్రాన్సెస్కో టొట్టిని బయటకు పంపడం వివాదమైంది. ఈ మ్యాచ్‌ను కొరియా 2-1తో నెగ్గి క్వార్టర్స్‌లో ప్రవేశించింది. ఇక్కడ కూడా వీరికి అదృష్టం కలిసి వచ్చింది. స్పెయిన్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లోనూ రెండు గోల్స్‌ను ఆఫ్‌సైడ్ కారణంతో రిఫరీ గమాల్ తోసిపుచ్చాడు. చివరికి ‘పెనాల్టీ షూట్అవుట్’లో కొరియా 5-3 స్కోరుతో నెగ్గి సెమీస్‌కు చేరి సంబరాలు చేసుకుంది. కానీ ‘ఫిఫా’ ఒత్తిడి చేయడంతో ఆ ఇద్దరు రిఫరీలు రిటైర్మెంట్ ప్రకటించారు. మోరెనో మీద ఫిక్సింగ్ ఆరోపణలు రాగా గమాల్కు కొత్త కారు బహుమానంగా లభించింది. -
షకీరా x జెన్నిఫర్ లోపెజ్
పోటాపోటీగా ప్రపంచకప్ పాటలు లండన్: ప్రపంచకప్ ఫుట్‌బాల్ కోసం అభిమానులు ఎంత ఎదురు చూస్తారో... ఆ టోర్నీ సందర్భంగా తయారయ్యే పాట కోసం కూడా అంతే ఆసక్తిగా చూస్తారు. గత ప్రపంచకప్ సందర్భంగా షకీరా ‘వాకా వాకా’ పాట ఇప్పటికీ ప్రపంచం మొత్తం హోరెత్తుతూనే ఉంది. 2006లోనూ షకీరానే ఫిఫా కోసం ప్రత్యేక గీతం తయారు చేశారు. అయితే ఈసారి షకీరాను పక్కనబెట్టిన ఫిఫా జెన్నిఫర్ లోపెజ్‌ను రంగంలోకి దించింది. ఆమెతో పాటు పిట్‌బుల్, క్లాడియా (బ్రెజిల్ పాప్ సింగర్) కలిసి ఓ ‘వియ్ ఆర్ వన్ ఓలె ఓలా’ అంటూ ప్రత్యేక పాటను రూపొందించారు. ప్రపంచకప్ ప్రారంభోత్సవంలో కూడా దీనిని ప్రదర్శిస్తారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఈసారి తనకు అవకాశం ఇవ్వలేదని హర్ట్ అయిందో లేక ఆటపై అభిమానాన్ని చాటాలనుకుందో... షకీరా కూడా ‘లా లాలలా...’ అంటూ ఓ వీడియో సాంగ్‌ను చిత్రీకరించింది. కొలంబియా సింగర్ షకీరా రూపొందించిన ఈ పాట భారీ హిట్ అయింది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఈ పాటను హోరెత్తిస్తున్నారు. కేవలం ఐదు రోజుల్లో యూ ట్యూబ్‌లో 5 లక్షల మంది ఈ పాటను చూశారు. మరో వైపు జెన్నిఫర్ అండ్ కో రూపొందించిన అధికారిక పాట మాత్రం యావరేజ్‌గా మిగిలింది. ఇందులో బ్రెజిల్ సంసృ్కతి, సంప్రదాయాలు కనిపించడం లేద నే విమర్శలు వచ్చాయి. -
జర్మనీకే నా ఓటు
ప్రపంచకప్ ఫుట్‌బాల్‌పై కోహ్లి బెంగళూరు: ప్రస్తుతం దేశమంతా ఐపీఎల్ క్రికెట్ ఫీవర్‌లో ఉన్నప్పటికీ విశ్వ వ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానుల దృష్టి మాత్రం వచ్చే నెలలో జరిగే ప్రపంచకప్ ఫుట్‌బాల్‌పైనే ఉంది. ఈ మెగా సాకర్ టోర్నీ ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని సగటు అభిమానులతో పాటు క్రికెటర్లు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి వారిలో స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి కూడా ఉన్నాడు. ఈసారి ప్రపంచకప్ ఫుట్‌బాల్‌లో జర్మనీ సూపర్‌గా ఆడుతుందనే విశ్వాసాన్ని వ్యక ్తం చేస్తున్నాడు. ‘అత్యంత ప్రమాదకర ఆటగాళ్లతో జర్మనీ పటిష్టంగా కనిపిస్తోంది. నా మద్దతు ఆ జట్టుకే. కచ్చితంగా ఈ ఏడాది జర్మనీదే అవుతుంది. ఫిలిప్ లామ్ ఆటంటే నాకు ఇష్టం. తన ఆటతీరుతో జర్మనీకి టైటిల్ దక్కుతుందనుకుంటున్నాను. రొనాల్డో, మెస్సీ నా అభిమాన ఆటగాళ్లు’ అని ఫిఫా ఫ్లాగ్ బేరర్ కార్యక్రమంలో పాల్గొన్న కోహ్లి తెలిపాడు. భారత క్రికెట్ జట్టులో రవీంద్ర జడేజా చాలా సరదాగా ఫుట్‌బాల్ ఆడతాడని పేర్కొన్నాడు. అతడు తనకు తాను రొనాల్డోలా ఫీలై గోల్స్ చేసేందుకు యత్నించడం నవ్వు తెప్పిస్తుందని చెప్పాడు. ధోని చాలా బాగా ఆడతాడని కితాబిచ్చాడు. నిజానికి భారత క్రికెట్ జట్టు మొత్తం ఫుట్‌బాల్ మ్యాచ్‌లను చాలా ఆసక్తిగా గమనిస్తుందని అన్నాడు.