వివాదాలలోనూ మేటి
విశ్వవ్యాప్తంగా క్రీడాభిమానులందరినీ ఉర్రూతలూగించే ప్రపంచకప్ ఫుట్‌బాల్‌లో అందరి మదినీ దోచిన అద్భుత విజయాలెన్నో. ఆటగాళ్ల కళ్లు చెదిరే గోల్స్‌తో పాటు, గోల్ కీపర్ల విన్యాసాలనెన్నో ఈ మెగా టోర్నీలలో చూశాం. మున్ముందూ చూస్తాం. కానీ ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. రెండోవైపు ఈ టోర్నీ వివాదాలకు అతీతంకాదు. ఎన్నో మ్యాచ్‌లు వివాదాస్పదమయ్యాయి. ఆటగాళ్లు ఫైటర్స్‌గా మారిన సందర్భాలు ఉన్నాయి. రిఫరీలు చక్రం తిప్పిన సంఘటనలున్నాయి. క్రీడాస్ఫూర్తికి తూట్లు పొడిచిన వారూ ఉన్నారు. మొత్తానికి 84 ఏళ్ల ప్రపంచకప్ ఫుట్‌బాల్ చరిత్రలో టాప్-5గా పరిగణించే అత్యంత వివాదాస్పద సంఘటనల వివరాలు ఇలా ఉన్నాయి. - సాక్షి క్రీడావిభాగం
‘గోల్ కాని గోల్’తో ప్రపంచకప్ (ఇంగ్లండ్ * పశ్చిమ జర్మనీ, 1966)
ఫుట్‌బాల్ ప్రపంచకప్ చరిత్రలో అత్యంత వివాదాస్పద సంఘటన ఈ ఫైనల్లో నెలకొంది. నిర్ణీత సమయంలో మ్యాచ్ 2-2 గోల్స్‌తో సమం కాగా, అదనపు సమయానికి అనుమతించారు. 12వ నిమిషంలో ఇంగ్లండ్ ఆటగాడు హర్స్‌ట్ షాట్ కొట్టగా... బంతి నేరుగా గోల్ పోస్ట్ క్రాస్ బార్ లోపలి వైపు తగిలి లైన్ బయటపడింది. అయితే ఆ బంతి లైన్ క్రాస్ అయిందీ.. లేనిదీ రిఫరీకి అంతుపట్టలేదు. స్పష్టత కోసం రష్యాకు చెందిన లైన్స్‌మ్యాన్ తోఫిక్‌ను సంప్రదించగా దాన్ని ఆయన గోల్‌గా ప్రకటించారు. దీంతో జర్మనీ ఆటగాళ్లు షాక్‌కు గురయ్యారు. ఈ నిర్ణయంతో ఇంగ్లండ్ జట్టు 3-2తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత మరో గోల్‌తో విజయాన్ని ఖాయం చేసుకొని తొలిసారిగా ప్రపంచకప్‌ను అందుకుంది. ఆ బంతి లైన్ క్రాస్ అయిన విషయంపై తోఫిక్‌ను చివరి దశలో అడిగినప్పుడు ఆయన ‘స్టాలిన్ గ్రాడ్’ అని బదులివ్వడం మరింత చర్చనీయాంశమైంది. ఎందుకంటే అక్కడ జర్మనీకి చెందిన నాజీల చేతిలో 75 వేల మంది రష్యన్లు ఊచకోతకు గురయ్యారు. జర్మనీ పట్ల వ్యతిరేకతతోనే అతను అలా వ్యవహరించాడని ఆ తర్వాత ప్రచారం జరిగింది.
సాంటియాగో యుద్ధం (ఇటలీ * చిలీ, 1962)
1962 ప్రపంచకప్‌లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ను అత్యంత హింసాత్మక మ్యాచ్‌ల్లో ఒకటిగా పేర్కొంటారు. ప్రారంభమైన 12వ సెకన్లలోనే తొలి ఫౌల్... 12వ నిమిషంలో ఇటలీ మిడ్ ఫీల్డర్ ఫెర్రినీకి రెడ్ కార్డు... ఒకరి ముఖాలపై మరొకరు పంచ్‌లు... మధ్యలో పోలీసుల రంగప్రవేశం... ఇలా ఒకటి రెండు సార్లుకాదు మ్యాచ్ జరిగిన 90 నిమిషాలూ ఇదే తంతు. ఓ రకంగా మైదానంలో ఫుట్‌బాల్ ఆడుతున్న ఆటగాళ్లుగా కాకుండా వీరంతా తమ మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాన్ని ప్రేక్షకులకు ప్రదర్శిస్తున్నట్టు కనిపించింది.
జిదాన్ ‘కుమ్ము’లాట (ఫ్రాన్స్ * ఇటలీ, 2006)
ఈ ప్రపంచకప్‌లో ఫ్రాన్స్ స్ట్రయికర్ జినెదిన్ జిదాన్ మెరుపులు అసామాన్యం. కేవలం అతని ఆటతీరుతోనే ఫ్రాన్స్ ఫైనల్ వరకు వచ్చింది. తుది పోరులోనూ ఇటలీపై కళ్లుచెదిరే గోల్‌తో జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు. ఇక ఎక్స్‌ట్రా టైమ్‌లోనూ దాదాపు రెండో గోల్ చే స్తాడనుకున్న సమయంలో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. ఇటలీకి చెందిన మార్కో మాటెరాజ్జీ ఛాతీపై జిదాన్ తన తలతో గట్టిగా కుమ్మాడు. దీంతో రెడ్ కార్డుకు గురై మైదానం వీడడంతో చివరి పది నిమిషాలు ఫ్రాన్స్ జట్టు పది మంది ఆటగాళ్లతోనే ఆడాల్సి వచ్చింది. ఆ తర్వాత పెనాల్టీ షూట్‌అవుట్‌లోనూ జిదాన్‌కు అవకాశం రాకపోవడంతో ఫ్రాన్స్ 3-5తో ఇటలీ చేతిలో ఓడింది. అప్పటిదాకా హీరోగా ఉన్న జిదాన్ ఈ ఒక్క మ్యాచ్‌తో జీరోగా మారిపోయాడు. తన తల్లి, సోదరిలను మాటెరాజ్జీ అసభ్యపదజాలంతో దూషించినందుకే అలా ప్రవర్తించాల్సి వచ్చిందని ఆ తర్వాత జిదాన్ పేర్కొన్నాడు.
మారడోనా ‘దైవహస్తం’ గోల్ (అర్జెంటీనా * ఇంగ్లండ్, 1986)
ఫుట్‌బాల్ చరిత్రలో అత్యద్భుత ఆటగాడే కాకుండా అత్యంత వివాదాస్పదుడిగానూ అర్జెంటీనా దిగ్గజం డీగో మారడోనా పేరు తెచ్చుకున్నాడు. మెక్సికోలో జరిగిన ఈ టోర్నీ క్వార్టర్ ఫైనల్స్‌లో ఇంగ్లండ్‌తో అర్జెంటీనా ఆడింది. ద్వితీయార ్ధం ఆరో నిమిషంలో బంతి ఇంగ్లండ్ గోల్ కీపర్ షిల్టన్, మారడోనా మధ్య దోబూచులాడింది. షిల్టన్ కన్నా ఎనిమిది అంగుళాల తక్కువ ఎత్తు ఉన్న మారడోనా కొద్దిసేపు ‘ఆజానుబాహుడు’ అయ్యాడు. ఎందుకంటే పైకి లేచిన బంతిని ఏకంగా చేతితోనే గోల్ పోస్ట్‌లోకి నెట్టాడు. దీంతో అర్జెంటీనా 2-1తో ఈ మ్యాచ్‌ను గెలుచుకుంది. మ్యాచ్ అనంతరం ఆ గోల్ గురించి మారడోనాను అడిగితే ‘కొంచెం మారడోనా తల, మరికొంచెం దేవుడి చేయి కలిసి చేసిన గోల్ అది’ అని జవాబిచ్చాడు. అయితే ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’ గోల్‌కు సంబంధించిన ఫొటోలు పరిశీలిస్తే మారడోనా తల చేసిందేమీ లేదని స్పష్టంగా కనిపిస్తుంటుంది. ఈ విజయం ద్వారా ఫైనల్‌కు చేరిన అర్జెంటీనా అంతిమ సమరంలో పశ్చిమ జర్మనీని ఓడించి కప్ దక్కించుకుంది.
కొరియా నాకౌట్‌కు రిఫరీ సహాయం (దక్షిణ కొరియా * ఇటలీ, 2002)
తమ ప్రపంచకప్ చరిత్రలో ఈ టోర్నీలో దక్షిణ కొరియా తమ ‘సూపర్’ ఆటతీరుతో దూసుకుపోయింది. తొలిసారిగా సెమీస్‌కు చేరి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే వీరి ఈ దూకుడు వెనుక రిఫరీల సహాయం కూడా ఉంది. ఇటలీతో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్ నాకౌట్ మ్యాచ్ ఎక్స్‌ట్రా సమయంలో తమ కచ్చితమైన గోల్‌ను రిఫరీ బైరన్ మోరెనో ఆఫ్‌సైడ్ గోల్‌గా ప్రకటించి కొరియాకు మేలు చేశారు. అలాగే డైవింగ్ కారణంగా ఇటలీ స్టార్ ఆటగాడు ఫ్రాన్సెస్కో టొట్టిని బయటకు పంపడం వివాదమైంది. ఈ మ్యాచ్‌ను కొరియా 2-1తో నెగ్గి క్వార్టర్స్‌లో ప్రవేశించింది. ఇక్కడ కూడా వీరికి అదృష్టం కలిసి వచ్చింది. స్పెయిన్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లోనూ రెండు గోల్స్‌ను ఆఫ్‌సైడ్ కారణంతో రిఫరీ గమాల్ తోసిపుచ్చాడు. చివరికి ‘పెనాల్టీ షూట్‌అవుట్’లో కొరియా 5-3 స్కోరుతో నెగ్గి సెమీస్‌కు చేరి సంబరాలు చేసుకుంది. కానీ ‘ఫిఫా’ ఒత్తిడి చేయడంతో ఆ ఇద్దరు రిఫరీలు రిటైర్మెంట్ ప్రకటించారు. మోరెనో మీద ఫిక్సింగ్ ఆరోపణలు రాగా గమాల్‌కు కొత్త కారు బహుమానంగా లభించింది.