అయ్యో... ఇటలీ! | former champions to not qualify for the football World Cup | Sakshi
Sakshi News home page

అయ్యో... ఇటలీ!

Published Wed, Nov 15 2017 12:29 AM | Last Updated on Wed, Nov 15 2017 2:27 AM

 former champions to not  qualify for the football World Cup - Sakshi

మిలాన్‌ (ఇటలీ): ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌ అంటే ముందుగా గుర్తొచ్చే దేశాల పేర్లలో ఇటలీ ముందుంటుంది. అయితే వచ్చే ఏడాది ఈ మేటి జట్టు లేకుండానే ప్రపంచకప్‌ జరగనుంది. రష్యాలో వచ్చే సంవత్సరం జరిగే ప్రపంచకప్‌కు అర్హత పొందాలంటే స్వీడన్‌పై తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఇటలీ జట్టు 0–0 ‘డ్రా’తో సరిపెట్టుకుంది. ఈనెల 10న స్టాక్‌హోమ్‌లో జరిగిన తొలి దశ ప్లే ఆఫ్‌ మ్యాచ్‌లో స్వీడన్‌ 1–0తో గెలిచింది. దాంతో అర్హత అవకాశాలు సజీవంగా ఉండాలంటే రెండో ప్లే ఆఫ్‌ మ్యాచ్‌లో ఇటలీకి విజయం తప్పనిసరైంది. కానీ ఇటలీ జట్టు ‘డ్రా’తో సరిపెట్టుకోవడంతో ఓవరాల్‌గా స్వీడన్‌ 1–0తో ప్రపంచకప్‌ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. సొంతగడ్డపై 74 వేల మంది ప్రేక్షకుల సమక్షంలో ఇటలీ జట్టు అవమానభారంతో నిష్క్రమించింది. 1958 తర్వాత ఇటలీ జట్టు ప్రపంచకప్‌కు అర్హత పొందకపోవడం ఇదే తొలిసారి. 1930లో జరిగిన తొలి ప్రపంచకప్‌కు దూరంగా ఉన్న ఇటలీ 1958 టోర్నీ అర్హత సాధించడంలో విఫలమైంది. ఈ రెండు ప్రపంచకప్‌లు మినహా మిగతా అన్ని ప్రపంచకప్‌లలో ఇటలీ పోటీపడింది.  1934, 1938, 1982, 2006 ప్రపంచకప్‌లలో విజేతగా నిలిచిన ఇటలీ జట్టు 1970లో, 1994లో రన్నరప్‌గా నిలిచింది. 1990లో మూడో స్థానం, 1978లో నాలుగో స్థానం సంపాదించింది.  

గోల్‌కీపర్‌ బఫన్‌ వీడ్కోలు
ప్రపంచకప్‌కు ఇటలీ అర్హత సాధించకపోవడంతో ఆ జట్టు స్టార్‌ గోల్‌కీపర్‌ గియాన్లుగి బఫన్‌ తన 20 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. 39 ఏళ్ల బఫన్‌ ఇటలీ తరఫున 175 మ్యాచ్‌లు ఆడాడు. 1998 నుంచి 2014 వరకు వరుసగా ఐదు ప్రపంచకప్‌లలో అతను పాల్గొన్నాడు. 2006లో ఇటలీ విశ్వవిజేతగా నిలువడంలో బఫన్‌ కీలకపాత్ర పోషించాడు. బఫన్‌తోపాటు 36 ఏళ్ల డిఫెండర్‌ ఆండ్రియా బర్జాగ్లి, 34 ఏళ్ల మిడ్‌ఫీల్డర్‌ డానియల్‌ డి రోసీ కూడా తమ అంతర్జాతీయ కెరీర్‌కు స్వస్తి పలికారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement