ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీ చరిత్రలో అత్యధికంగా 109 మ్యాచ్‌లు ఆడిన జట్టుగా బ్రెజిల్‌తో సమానంగా జర్మనీ నిలిచింది. బ్రెజిల్ ఐదుసార్లు విశ్వవిజేతగా నిలిస్తే, జర్మనీ నాలుగుసార్లు ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. అయితే 2014లో నాలుగోసారి ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన తర్వాత జర్మనీ ఆటలో తిరోగమనం కనిపిస్తోంది.
2018 ప్రపంచకప్‌లో జర్మనీ గ్రూప్ దశలోనే నిష్క్రమించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అనంతరం యూరో టోర్నీలోనూ జర్మనీ ప్రిక్వార్టర్ ఫైనల్‌ను దాటలేకపోయింది. ఈ నేపథ్యంలో ‘ఖతర్’లో జర్మనీ ప్రయాణం ఎంతవరకు సాగుతుందో చెప్పలేని స్థితి.
–సాక్షి క్రీడా విభాగం
జర్మనీ
మాజీ చాంపియన్ స్పెయిన్‌తో మ్యాచ్‌ను మినహాయిస్తే... గ్రూప్ ‘ఇ’లోని ఇతర జట్లయిన కోస్టారికా, జపాన్‌లపై జర్మనీ విజయం సాధిస్తే తదుపరి దశకు అర్హత పొందడం ఖాయమనుకోవాలి. గుండోగన్, జమాల్ ముసియాలా, కాయ్ హవెర్ట్, లెరాయ్, మార్కో రెయిస్ కీలక ఆటగాళ్లు.
ప్రపంచకప్‌లో ఉత్తమ ప్రదర్శన: నాలుగుసార్లు చాంపియన్ (1954, 1974, 1990, 2014). ‘ఫిఫా’ ర్యాంక్: 11. అర్హత ఎలా: యూరోప్ క్వాలిఫయింగ్ లో గ్రూప్ ‘జె’ విజేత.
స్పెయిన్
సమన్వయంతో ఆడటంలో స్పెయిన్ ఆటగాళ్లు సిద్ధహస్తులు. గత ఆరేళ్లలో ఆ జట్టు ఆడిన మ్యాచ్‌ల్లో రెండు గోల్స్ తేడాతో ఓడిపోయిన ఒక్క మ్యాచ్ కూడా లేదు. ఈ ప్రపంచకప్‌లో తమ గ్రూప్‌లో జర్మనీతో మ్యాచ్ ఆ జట్టుకు కీలకం కానుంది. పెద్రీ, ఫెరాన్ టోరెస్, మొరాటా, సిమోన్ కీలక ఆటగాళ్లు.
ప్రపంచకప్‌లో ఉత్తమ ప్రదర్శన: చాంపియన్ (2010). ‘ఫిఫా’ ర్యాంక్: 7. అర్హత ఎలా: యూరోప్ క్వాలిఫయింగ్‌లో గ్రూప్ ‘బి’ విజేత.
జపాన్
వరుసగా ఏడో ప్రపంచకప్‌లో ఆడుతున్న జపాన్ మూడుసార్లు గ్రూప్ దశలో నిష్క్రమించగా, మూడుసార్లు ప్రిక్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగింది. ఆసియా క్వాలిఫయింగ్ రెండో రౌండ్‌లో జపాన్ ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లోనూ గెలిచింది. మంగోలియాపై 14–0తో, మయన్మార్‌పై 10–0తో నెగ్గిన జపాన్ రెండో రౌండ్‌లో ఏకంగా 46 గోల్స్ కొట్టి కేవలం రెండు గోల్స్ సమర్పించుకుంది. మూడో రౌండ్‌లో రెండో స్థానంలో నిలిచి ప్రపంచకప్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. దైచి కమాడా కీలక ఆటగాడు. జర్మనీ, స్పెయిన్‌లతో మ్యాచ్ ఫలితాలే ఈసారి జపాన్ ప్రస్థానాన్ని నిర్ణయిస్తాయి.
ప్రపంచకప్‌లో ఉత్తమ ప్రదర్శన: ప్రిక్వార్టర్ ఫైనల్ (2002, 2010, 2018). ‘ఫిఫా’ ర్యాంక్: 24. అర్హత ఎలా: ఆసియా క్వాలిఫయింగ్‌లో మూడో రౌండ్ గ్రూప్ ‘బి’ రన్నరప్.
కోస్టారికా
ఆరోసారి ప్రపంచకప్‌లో ఆడుతున్న కోస్టారికా అద్భుతంగా రాణిస్తే తప్ప ఈసారి గ్రూప్ దశను దాటే అవకాశాలు కనిపించడంలేదు. జర్మనీ, స్పెయిన్‌లలో ఒక జట్టును ఓడిస్తే తప్ప కోస్టారికా ముందుకు వెళ్లడం కష్టమే. అర్సెనల్ జట్టుకు ఆడే జోయల్ క్యాంప్‌బెల్ కీలక ఆటగాడు.
ప్రపంచకప్‌లో ఉత్తమ ప్రదర్శన: క్వార్టర్ ఫైనల్ (2014). ‘ఫిఫా’ ర్యాంక్: 31. అర్హత ఎలా: ఉత్తర, మధ్య అమెరికా, కరీబియన్–ఓసియానియా క్వాలిఫయింగ్ ప్లే ఆఫ్ మ్యాచ్ విజేత.
Comments
Please login to add a commentAdd a comment