నాకౌట్‌కు పోర్చుగల్ | Knockout to Portugal | Sakshi
Sakshi News home page

నాకౌట్‌కు పోర్చుగల్

Published Thu, Jun 23 2016 12:53 AM | Last Updated on Mon, Sep 4 2017 3:08 AM

నాకౌట్‌కు పోర్చుగల్

నాకౌట్‌కు పోర్చుగల్

నాకౌట్ రేసులో నిలవాలంటే కనీసం ‘డ్రా’ చేసుకోవాల్సిన మ్యాచ్‌లో పోర్చుగల్ అదే పని చేసింది. హంగేరితో జరిగిన గ్రూప్ ‘ఎఫ్’ లీగ్ మ్యాచ్‌ను పోర్చుగల్ 3-3 గోల్స్‌తో ‘డ్రా’గా ముగించింది. పోర్చుగల్ తరఫున కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో (50వ, 62వ నిమిషాల్లో) కళ్లు చెదిరేరీతిలో రెండు గోల్స్ చేశాడు. మరో గోల్‌ను నాని (42వ నిమిషంలో) సాధించాడు. హంగేరి తరఫున గెరా (19వ నిమిషంలో) ఒక గోల్ చేయగా... జుద్‌జాక్ (47వ, 55వ నిమిషాల్లో) రెండు గోల్స్ సాధించాడు.

ఇదే గ్రూప్‌లోని మరో మ్యాచ్‌లో ఐస్‌లాండ్ 2-1తో ఆస్ట్రియాను ఓడించింది. ఫలితంగా హంగేరి, ఐస్‌లాండ్ ఐదు పాయింట్లతో సమఉజ్జీగా నిలిచినా... మెరుగైన గోల్స్ సగటు ఆధారంగా హంగేరి గ్రూప్ టాపర్‌గా నిలిచింది. ఐస్‌లాండ్‌కు రెండో స్థానం దక్కింది. మూడు పాయింట్లతో పోర్చుగల్ మూడో స్థానంలో నిలిచింది. అయితే మూడో స్థానంలో నిలిచిన నాలుగు ఉత్తమ జట్ల జాబితా నుంచి పోర్చుగల్‌కు నాకౌట్ బెర్త్ ఖాయమైంది. హంగేరి మ్యాచ్‌తో రొనాల్డో రెండు రికార్డులు నెలకొల్పాడు. వరుసగా నాలుగు యూరో టోర్నీలలో గోల్ చేసిన తొలి ప్లేయర్‌గా... యూరో టోర్నీ చరిత్రలో అత్యధికంగా 17 మ్యాచ్‌లు ఆడిన క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు.

యూరోలో నేడు, రేపు  విశ్రాంతి.  శనివారం నుంచి నాకౌట్ మ్యాచ్‌లు.

 

Advertisement
Advertisement