కోల్‌కతా కుమ్ముడు
►ఢిల్లీపై అద్భుత విజయం
►నాలుగో విజయంతో అగ్రస్థానానికి గంభీర్‌సేన
►మెరిసిన మనీశ్, యూసుఫ్
న్యూఢిల్లీ: ఐపీఎల్ పదో సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ దూకుడు కొనసాగుతోంది. 169 పరుగుల లక్ష్యం కోసం బరిలోకి దిగిన ఈ జట్టు 21 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో మనీష్ పాండే (49 బంతుల్లో 69 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), యూసుఫ్ పఠాన్ (39 బంతుల్లో 59; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) వీరోచిత ఇన్నింగ్స్‌తో హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. ఫిరోజ్ షా కోట్ల మైదానంలో సోమవారం ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్‌లో కేకేఆర్ మరో బంతి మిగిలి ఉండగా నాలుగు వికెట్లతో నెగ్గింది.
పఠాన్, పాండే మధ్య నాలుగో వికెట్‌కు 110 పరుగులు జత చేరాయి. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 168 పరుగులు చేసింది. సంజూ సామ్సన్ (25 బంతుల్లో 39; 7 ఫోర్లు), రిషబ్ పంత్ (16 బంతుల్లో 38; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించారు. కౌల్టర్ నైల్‌కు మూడు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత లక్ష్యం కోసం బరిలోకి దిగిన కోల్‌కతా 19.5 ఓవర్లలో 6 వికెట్లకు 169 పరుగులు చేసి నెగ్గింది. జహీర్, కమిన్స్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మనీష్ పాండేకు దక్కింది.
మనీష్, యూసుఫ్ సమయోచిత బ్యాటింగ్..
భారీ స్కోరు కాకపోయినా ఆరంభంలోనే కోల్‌కతా తొలి మూడు ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయినా మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ మనీష్ పాండే, యూసుఫ్ అద్భుతంగా ఆదుకున్నారు. ఈసారి ఓపెనర్‌గా నరైన్ స్థానంలో వచ్చిన హ్యాండ్స్‌కోంబ్ (1) ఐదో బంతికే అవుటయ్యాడు. ఆ తర్వాత ఫామ్‌లో ఉన్న రాబిన్ ఉతప్ప (4), కెప్టెన్ గంభీర్ (12 బంతుల్లో 14; 2 ఫోర్లు) కూడా వెనుదిరగడంతో కేకేఆర్ కష్టాల్లో పడింది. రెండు వికెట్లు తీసిన జహీర్ పవర్‌ప్లేలో 50 వికెట్లు తీసిన తొలి ఐపీఎల్ బౌలర్ అయ్యాడు. అయితే జట్టు ఇన్నింగ్స్‌ను యూసుఫ్, మనీష్ పట్టాలెక్కించే ప్రయత్నం చేశారు. ప్రణాళికాబద్ధంగా ఆడుతూ ఢిల్లీ బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించారు. చెత్త బంతులను సిక్సర్లు, బౌండరీలుగా మలుస్తూ జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ క్రమంలో 34 బంతుల్లో పఠాన్ ఓ భారీ సిక్సర్‌తో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. 15వ ఓవర్‌లో తనను మోరిస్ రిటర్న్ క్యాచ్‌తో అవుట్ చేశాడు. అయితే అప్పటికే నాలుగో వికెట్‌కు 110 పరుగులు చేరాయి. అటు మనీష్ కూడా 37 బంతుల్లో అర్ధ సెంచరీ చేశాడు. కానీ చివరి ఓవర్‌లో 9 పరుగులు కావాల్సిన దశలో తొలి రెండు బంతులు పరుగులేమీ లేకుండా వికెట్ పడడంతో కాస్త ఉత్కంఠ నెలకొన్నా పాండే ఓ సిక్సర్‌తో ఒత్తిడి తగ్గించి విజయం అందించాడు.
సంజూ, రిషబ్ జోరు
టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ జట్టులోకి షాబాజ్ నదీమ్ స్థానంలో షమీ, అండర్సన్ స్థానంలో ఏంజెలో మాథ్యూస్ వచ్చారు. తొలి ఓవర్‌లోనే సంజూ వరుసగా రెండు ఫోర్లతో తన ఉనికి చాటుకోగా మూడో ఓవర్లో మూడు ఫోర్లతో రెచ్చిపోయాడు. దీంతో పవర్‌ప్లేలో వికెట్ నష్టపోకుండా ఢిల్లీ 53 పరుగులు సాధించింది. అయితే ఆ తర్వాత వరుస ఓవర్లలో మరో ఓపెనర్ బిల్లింగ్స్ (17 బంతుల్లో 21; 2 ఫోర్లు)తో పాటు సామ్సన్ కూడా పెవిలియన్ చేరారు. కొద్దిసేపు శ్రేయస్ (17 బంతుల్లో 26; 4 ఫోర్లు), కరుణ్‌నాయర్ (27 బంతుల్లో 21; 1 ఫోర్) ఫర్వాలేదనిపించగా ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రిషబ్ తన బ్యాట్‌కు పనిచెప్పాడు. ఉమేశ్ యాదవ్ వేసిన 17వ ఓవర్‌లో తొలి బంతిని మినహాయించి వరుసగా 6,4,6,6,4తో విరుచుకుపడడంతో జట్టుకు 26 పరుగులు వచ్చాయి. 19వ ఓవర్‌లో కౌల్టర్‌నైల్ అతడిని బౌల్డ్ చేయగా అదే ఓవర్‌లో మోరిస్ (9 బంతుల్లో 16; 3 ఫోర్లు) ఇచ్చిన రెండు క్యాచ్‌లను కోల్‌కతా ఫీల్డర్లు పట్టలేకపోయారు.
► 25 పరుగుల్లోపే మూడు వికెట్లు కోల్పోయి నాలుగో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం చేయడం ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి.