గుర్గావ్: అంతర్జాతీయ గ్రాండ్‌మాస్టర్స్ చెస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ ఆటగాళ్లు సీఆర్‌జీ కృష్ణ, ఎస్.రవితేజ సత్తాచాటారు. ఇక్కడి సన్‌సిటీ వరల్డ్ స్కూల్‌లో జరుగుతున్న ఈ పోటీల్లో ఇద్దరూ మూడున్నర పాయింట్లతో ఉమ్మడిగా రెండో స్థానంలో కొనసాగుతున్నారు. శుక్రవారం జరిగిన నాలుగో రౌండ్ పోటీల్లో కృష్ణ (3.5)... భారత్‌కే చెందిన అంతర్జాతీయ మాస్టర్ ప్రసన్న రఘురామ్ (3.5)తో డ్రా చేసుకోగా, రవితేజ (3.5)... విక్రమ్‌జిత్ సింగ్ (3.5)తో గేమ్‌ను డ్రాగా ముగించాడు.
మిగతా ఏపీ క్రీడాకారుల్లో చొల్లేటి సహజశ్రీ (2.5)... ఓమ్ బాత్రా (1.5)పై విజయం సాధించగా, తొషాలి (2)...శంతను (3) చేతిలో పరాజయం చవిచూసింది. మట్ట వినయ్ కుమార్ (2.5)... రాజేశ్ (3.5) చేతిలో, రామకృష్ణ (2)... గగునశ్వి మెరాబ్ (జార్జియా, 3) చేతిలో ఓటమి పాలయ్యారు. అభిలాష్ రెడ్డి (3)... పొంక్షే సారంగ్ (2)పై, దీప్తాంశ్‌రెడ్డి (3)... మోత పంకిత్ (2)పై, కార్తీక్ (3)... సిద్ధార్థ్ (2)పై విజయం సాధించారు.
రాహుల్ శ్రీవాస్తవ్ (2)కు అరాధ్య గార్గ్ (3) చేతిలో పరాజయం ఎదురైంది. ఈ టోర్నీలో ఢిల్లీ ఆటగాడు సహజ్ గ్రోవర్ (4) నాలుగు విజయాలతో ఐదుగురితో కలిసి ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. తర్వాతి స్థానంలో ఏపీ ఆటగాళ్లు కృష్ణ, రవితేజ మూడున్నర పాయింట్లతో మరో 17 మందితో కలిసి రెండో స్థానంలో ఉన్నారు. ఈ టోర్నీలో ఇంకా ఆరు రౌండ్లు మిగిలున్నాయి.
సత్తాచాటిన కృష్ణ, రవితేజ
Published Sat, Jan 4 2014 12:09 AM | Last Updated on Sat, Sep 2 2017 2:15 AM
Advertisement
Advertisement