
సౌమ్య స్వామినాథన్ (ఫైల్ ఫోటో)
హైదరాబాద్ : ఇరాన్‌లో నిర్వహించబోయే ‘ఏషియన్ టీమ్ చెస్ చాంపియన్‌షిప్’లో పాల్గొనడంలేదని మాజీ వరల్డ్ జూనియర్ గర్ల్స్ చాంపియన్, ఉమెన్ గ్రాండ్ మాస్టర్ సౌమ్య స్వామినాథన్ ప్రకటించారు. జులై 26 నుంచి ఆగస్టు 6 వరకూ ఇరాన్‌లోని హమదాన్‌లో నిర్వహించబోయే ఈ టోర్నీ నుంచి తాను తప్పుకుంటున్నట్లు తెలిపారు. ఇరాన్ దేశంలో ఉన్న ‘తలకు తప్పనిసరిగా స్కార్ఫ్ ధరించాల’నే నిబంధన వల్ల తాను ఈ టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు ఆమె ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు.
‘ఇరానీ చట్టాలలో మహిళలు తప్పనిసరిగా తలపై స్కార్ఫ్ లేదా బురఖా ధరించాలనే నియమం ఉంది. కానీ ఇలా బలవంతంగా స్కార్ఫ్ లేదా బురఖా ధరించడం అంటే నా స్వేచ్ఛకు ఆటంకం కల్గించడమే అవుతుంది. ఇలా చేస్తే నా హక్కులకు, నా మతానికి గౌరవం ఇవ్వనట్లే అవుతుంది. అందుకే నేను ఇరాన్ వెళ్లకూడదని నిర్ణయించుకున్నాను. టోర్నీలో భాగంగా మమ్మల్ని నేషనల్ టీం డ్రస్ కానీ, ఫార్మల్స్ కానీ, లేదా మరేదైనా స్పోర్ట్ డ్రెస్ వేసుకోమని కోరితే మేము సంతోషంగా ఒప్పుకునేవాళ్లము. అంతేకాని ఇలా మతపరమైన నియమాలను ఆటగాళ్ల మీద బలవంతంగా రుద్దడం సరైంది కాదు.
ఇలాంటి అధికారిక చాంపియన్‌షిప్స్‌ను నిర్వహించేటప్పుడు క్రీడాకారుల మనోభావాలను, హక్కులను పట్టించుకోకపోవడం విచారకరం. భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం నాకు ఎప్పటికి గర్వ కారణమే. క్రీడాకారులు వారి ఆట కోసం చాలా విషయాల్లో సర్దుకుపోతుంటారు. కానీ కొన్ని విషయాల్లో మాత్రం అలా చేయలేమని’ సౌమ్య తన పోస్టులో పేర్కొన్నారు. అథ్లెట్లు ఇలా టోర్నీ నుంచి తప్పుకోవడం ఇదే ప్రథమం కాదు. గతంలో ఇండియా ‘టాప్ షూటర్’ హీనా సింధూ కూడా ఇలానే 2016లో ఇరాన్‌లో నిర్వహించిన ‘ఏషియన్ ఎయిర్‌గన్ మీట్’ నుంచి తప్పుకున్నారు. అయితే అప్పుడు కూడా తలపై స్కార్ఫ్ ధరించాలనే నియమమే ఇందుకు కారణం.
Comments
Please login to add a commentAdd a comment