ఐపీఎల్‌-12: గెలిచి నిలిచేదెవరో? | KXIP, SRH square off in a fourth spot jostle | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌-12: గెలిచి నిలిచేదెవరో?

Published Mon, Apr 29 2019 7:45 PM | Last Updated on Mon, Apr 29 2019 8:02 PM

KXIP, SRH square off in a fourth spot jostle - Sakshi

హైదరాబాద్‌: ఐపీఎల్‌లో భాగంగా స్థానిక రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో కింగ్స్‌ పంజాబ్‌ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన కింగ్స్‌ పంజాబ్‌  ఫీల్డింగ్‌ తీసుకుంది. టాస్‌ గెలిచిన కింగ్స్‌ కెప్టెన్‌ అశ్విన్‌.. ముందుగా సన్‌రైజర్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఇప్పటివరకూ సన్‌రైజర్స్‌11 మ్యాచ్‌లు ఆడి ఐదింట గెలుపొందగా, కింగ్స్‌ పంజాబ్‌ సైతం 11 మ్యాచ్‌లకు గాను ఐదు మాత్రమే విజయాలు నమోదు చేసింది. అయితే మెరుగైన రన్‌రేట్‌ కారణంగా సన్‌రైజర్స్‌ నాల్గో స్థానంలో కొనసాగుతోంది. దీన్ని కాపాడుకోవాలంటే సన్‌రైజర్స్‌ గెలుపు ఎంతో అవసరం. మరొకవైపు కింగ్స్‌ పంజాబ్‌ పది పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. దాంతో తమ స్థానాన్ని మరింత మెరుగుపరుచుకుని నాల్గో స్థానానికి ఎగబాకాలంటే కింగ్స్‌ పంజాబ్‌ కూడా విజయం అంతే అవసరం. ఇది ఇరు జట్లకు కీలక మ్యాచ్‌ కావడంతో హోరాహోరీ తప్పదు. అంతకుముందు ఇరు జట్ల మధ్య జరిగిన తొలి లీగ్‌ మ్యాచ్‌లో కింగ్ప్‌ పంజాబ్‌ ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది.

సన్‌రైజర్స్‌ ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో వార్నర్, బెయిర్‌స్టో జంట అద్భుత ఓపెనింగ్‌ భాగస్వామ్యమే ఐదు మ్యాచ్‌ల్లో విజయాలను అందించింది. ఇప్పటికే బెయిర్‌స్టో జట్టు నుంచి వైదొలగగా... వార్నర్‌కు ఈ మ్యాచే ఈ సీజన్‌లో చివరిది కానుంది. ఆస్ట్రేలియా ప్రపంచకప్‌ జట్టుకు ఎంపికైన వార్నర్‌ తమ జాతీయ జట్టుతో కలిసేందుకు ఆస్ట్రేలియా వెళ్లనున్నాడు. ఈ సీజన్‌లో సెంచరీతో సహా 7 అర్ధసెంచరీలు నమోదు చేయడం వార్నర్‌ విలువను చూపిస్తోంది. అత్యధిక పరుగుల జాబితాలో తొలి రెండు స్థానాల్లో ఉన్న వార్నర్‌ (611), బెయిర్‌స్టో (445) కీలక సమయంలో జట్టుకు దూరమవడంతో ప్లే ఆఫ్స్‌ ముందర రైజర్స్‌పై ఒత్తిడి అధికమైంది. రైజర్స్‌ ఓడిన ఏడు మ్యాచ్‌ల్లోనూ మిడిలార్డర్‌ వైఫల్యం... డెత్‌ ఓవర్లలో బౌలింగ్‌ తడబాటు స్పష్టంగా కనబడుతోంది. వార్నర్‌ స్థానంలో ఓపెనింగ్‌ చేస్తోన్న కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ ఇప్పటివరకు తన స్థాయిని ప్రదర్శించలేదు. విజయ్‌ శంకర్, దీపక్‌ హుడా బ్యాట్‌ ఝళిపించలేకపోతున్నారు. కానీ గత రెండు మ్యాచ్‌ల్లో అద్భుత ఇన్నింగ్స్‌తో మిడిలార్డర్‌లో ఆల్‌రౌండర్‌ మనీశ్‌ పాండే ఆకట్టుకున్నాడు. ఇది రైజర్స్‌కు కాస్త ఊరటనిచ్చే అంశం.

సన్‌రైజర్స్‌ తరహాలోనే పంజాబ్‌ కింగ్స్‌ ఎలెవన్‌ జట్టులో కూడా టాపార్డరే ఎక్కువగా రాణిస్తోంది.  విధ్వంసక ఆటగాడు క్రిస్‌ గేల్‌ (444 పరుగులు), కేఎల్‌ రాహుల్‌ (441 పరుగులు) ఆ జట్టుకు పరుగులు సాధించి పెడుతున్నారు. వీరిద్దరూ బ్యాట్‌తో చెలరేగితే హైదరాబాద్‌కు కష్టాలు తప్పవు. మయాంక్‌ అగర్వాల్‌ (262) పరవాలేదనిపిస్తుండగా... డేవిడ్‌ మిల్లర్‌ (9 మ్యాచ్‌ల్లో 202 పరుగులు) ఆశించిన స్థాయిలో రాణించలేదు. అయితే ఆర్సీబీతో జరిగిన గత మ్యాచ్‌లో యువ ఆటగాడు నికోలస్‌ పూరన్‌ ప్రదర్శన జట్టు గెలుపుపై ఆశలు రేకెత్తిస్తోంది. సన్‌రైజర్స్‌ మిడిలార్డర్‌ బలహీనతపై దెబ్బకొట్టాలని భావిస్తోన్న కెప్టెన్‌ రవిచంద్రన్‌ అశ్విన్, పేసర్‌ మొహమ్మద్‌ షమీ అందుకు సిద్ధమై మ్యాచ్‌ బరిలో దిగనున్నారు. మరి ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లేఆఫ్‌ రేసులో నిలిచేదెవరో చూడాలి. ఇక్కడ ఏ జట్టు ఓటమి చెందినా అది వారి నాకౌట్‌ అవకాశాలను దెబ్బ తీయడం ఖాయం.

సన్‌రైజర్స్‌
కేన్‌ విలియమ్సన్‌(కెప్టెన్‌), డేవిడ్‌ వార‍్నర్‌, మనీష్‌ పాండే, విజయ్‌ శంకర్‌, మహ్మద్‌ నబీ, సాహా, అభిషేక్‌ శర్మ, రషీద్‌ ఖాన్‌, భువనేశ్వర్‌ కుమార్‌, సందీప్‌ శర్మ, ఖలీల్‌ అహ్మద్‌

కింగ్స్‌ పంజాబ్‌
రవిచంద్రన్‌ అశ్విన్‌(కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, క్రిస్‌ గేల్‌, మయాంక్‌ అగర్వాల్‌, డేవిడ్‌ మిల్లర్‌, నికోలస్‌ పూరన్‌, సిమ్రాన్‌ సింగ్‌, మురుగన్‌ అశ్విన్‌,  అర్షదీప్‌ సింగ్‌, షమీ,ముజిబ్‌ ఉర్‌ రహ్మాన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement