ముంబైపై లయన్స్ పంజా
ముంబైపై లయన్స్ పంజా
Published Sun, Sep 14 2014 12:58 AM | Last Updated on Sat, Sep 2 2017 1:19 PM
ఐపీఎల్-7ను పరాజయంతో మొదలుపెట్టిన ముంబై ఇండియన్స్... చాంపియన్స్ లీగ్ టి20లో కూడా అదే అనవాయితీని కొనసాగించింది. పేలవమైన బ్యాటింగ్, నిలకడలేని బౌలింగ్‌తో క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో మూల్యం చెల్లించుకుంది. మరోవైపు ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకున్న లాహోర్ లయన్స్ సమష్టి విజయంతో ప్రధాన టోర్నీకి అర్హత సాధించే అవకాశాలు మెరుగుపర్చుకుంది.
రాయ్‌పూర్: డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగినా... ఆ స్థాయికి తగ్గట్టు ఆటతీరును కనబరచకపోవడంతో చాంపియన్స్ లీగ్ టి20 క్వాలిఫయింగ్ టోర్నీలో ముంబై ఇండియన్స్ నిరాశపర్చింది. కాగితంపై బలంగా కనిపించినా... మైదానంలో దూకుడు చూపకపోవడంతో ఓటమిని తప్పించుకోలేకపోయింది. దీంతో శనివారం జరిగిన క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో లాహోర్ లయన్స్ జట్టు 6 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌పై గెలిచింది. షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... లాహోర్ లయన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 135 పరుగులు చేసింది. ఆదిత్య తారే (36 బంతుల్లో 37; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), మైక్ హస్సీ (26 బంతుల్లో 28; 2 ఫోర్లు, 1 సిక్స్)లకు తోడుగా చివర్లో ప్రవీణ్ కుమార్ (14 బంతుల్లో 20 నాటౌట్; 3 ఫోర్లు), హర్భజన్ (10 బంతుల్లో 18; 1 ఫోర్, 2 సిక్సర్లు) వేగంగా ఆడారు. ఆరంభంలో లయన్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ముంబై ఏడు బంతుల వ్యవధిలో సిమ్మన్స్ (7), జలజ్ (0), రాయుడు (3) వికెట్లను కోల్పోయింది. అయితే మరో ఓపెనర్ హస్సీ నిలకడగా ఆడి తారేతో కలిసి నాలుగో వికెట్‌కు 44 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను కుదుటపర్చాడు. భారీ షాట్లతో విరుచుకుపడతాడని భావించిన పొలార్డ్ (6) నిరాశపర్చినా... ప్రవీణ్, హర్భజన్‌లు ధాటిగా ఆడి 13 బంతుల్లో 20 పరుగులు జోడించారు. దీంతో ముంబైకి ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. చీమా, రియాజ్ చెరో రెండు వికెట్లు తీశారు.
తర్వాత బ్యాటింగ్‌కు దిగిన లాహోర్ లయన్స్ 18.4 ఓవర్లలో 4 వికెట్లకు 139 పరుగులు చేసింది. ఉమర్ అక్మల్ (18 బంతుల్లో 38 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగి ఆడాడు. షెహజాద్ (33 బంతుల్లో 34; 5 ఫోర్లు, 1 సిక్స్), జంషేద్ (24 బంతుల్లో 26; 3 ఫోర్లు) రాణించారు. ఓపెనర్లు జంషేద్, షెహజాద్‌లు తొలి వికెట్‌కు 51 పరుగులు జోడించి శుభారంభాన్నివ్వగా, మధ్యలో కెప్టెన్ హఫీజ్ (18) కాస్త నిరాశపర్చాడు. అయితే మిడిలార్డర్‌లో వచ్చిన ఉమర్ అక్మల్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఆసిఫ్ రజా (14 నాటౌట్)తో కలిసి ఐదో వికెట్‌కు కేవలం 16 బంతుల్లో 39 పరుగులు జోడించి జట్టుకు విజయాన్ని అందించాడు. ఓజాకు రెండు వికెట్లు దక్కాయి. ఉమర్ అక్మల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
స్కోరు వివరాలు
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: సిమ్మన్స్ (సి) రియాజ్ (బి) చీమా 7; మైక్ హస్సీ (సి) ఉమర్ అక్మల్ (బి) రియాజ్ 28; జలజ్ (సి) జంషేద్ (బి) చీమా 0; రాయుడు (సి) ఉమర్ అక్మల్ (బి) రజా 3; తారే (సి) రసూల్ (బి) రియాజ్ 37; పొలార్డ్ (బి) ఇమ్రాన్ అలీ 6; హర్భజన్ రనౌట్ 18; ప్రవీణ్ నాటౌట్ 20; మలింగ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 135
వికెట్ల పతనం: 1-20; 2-20; 3-23; 4-67; 5-94; 6-107; 7-127
బౌలింగ్: ఆసిఫ్ రజా 3-0-18-1; అజీజ్ చీమా 4-0-22-2; హఫీజ్ 3-0-17-0; ఇమ్రాన్ అలీ 3-0-22-1; రియాజ్ 4-0-31-2; రసూల్ 3-0-13-0.
లాహోర్ లయన్స్ ఇన్నింగ్స్: జంషేద్ (స్టంప్డ్) తారే (బి) హర్భజన్ 26; షెహజాద్ (సి) పొలార్డ్ (బి) ఓజా 34; హఫీజ్ (సి) హస్సీ (బి) పొలార్డ్ 18; సయీద్ నజీమ్ (సి) జలజ్ (బి) ఓజా 6; ఉమర్ అక్మల్ నాటౌట్ 38; ఆసిఫ్ రజా నాటౌట్ 14; ఎక్స్‌ట్రాలు: 3; మొత్తం: (18.4 ఓవర్లలో 4 వికెట్లకు) 139
వికెట్ల పతనం: 1-51; 2-66; 3-81; 4-100
బౌలింగ్: ప్రవీణ్ 3-0-15-0; బుమ్రా 3.4-0-35-0; మలింగ 3-0-30-0; హర్భజన్ 4-0-26-1; ఓజా 4-0-18-2; పొలార్డ్ 1-0-13-1.
Advertisement
Advertisement