లయన్స్ గర్జన
లయన్స్ గర్జన
Published Wed, Sep 17 2014 12:58 AM | Last Updated on Sat, Sep 2 2017 1:28 PM
రాయ్‌పూర్: బ్యాటింగ్‌లో మహ్మద్ హఫీజ్ (40 బంతుల్లో 67; 5 ఫోర్లు, 4 సిక్సర్లు)... బౌలింగ్‌లో పేసర్ అజీజ్ చీమా (3/15) దుమ్మురేపడంతో చాంపియన్స్ లీగ్ టి20 క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో లాహోర్ లయన్స్ అదరగొట్టింది. సదరన్ ఎక్స్‌ప్రెస్ జట్టును తక్కువ స్కోరుకే కట్టడి చేస్తూ 55 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మరోవైపు నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ చేతిలో ముంబై ఇండియన్స్ ఓడిపోవడంతో... రెండు విజయాలు సాధించి 8 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచిన లాహోర్ లయన్స్ ప్రధాన టోర్నమెంట్‌కు అర్హత సాధించింది.
సదరన్ ఎక్స్‌ప్రెస్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన లాహోర్ లయన్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 164 పరుగులు చేసింది. కెప్టెన్ హఫీజ్, సయీద్ నజీమ్ (25 బంతుల్లో 31; 3 ఫోర్లు), షెహజాద్ (21 బంతుల్లో 29; 4 ఫోర్లు) రాణించారు. 52 పరుగులకు 3 వికెట్లు కోల్పోయిన దశలో హఫీజ్, నజీమ్ సమయోచితంగా ఆడారు. నాలుగో వికెట్‌కు 54 బంతుల్లో 75 పరుగులు జోడించారు. చివరి 5 ఓవర్లలో 75 పరుగులు చేయడంతో లాహోర్ మంచి స్కోరును సాధించింది. మహరూఫ్ 3 వికెట్లు తీశాడు. అనంతరం సదరన్ ఎక్స్‌ప్రెస్ 18 ఓవర్లలో 109 పరుగులకు ఆలౌటైంది. ముబారక్ (26 బంతుల్లో 35; 4 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్. సంపత్ (18 బంతుల్లో 18; 3 ఫోర్లు), పెరీరా (16), జయరత్నే (16) మోస్తరుగా ఆడారు. 36 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన సదరన్ ఆ తర్వాత కోలుకోలేకపోయింది. చీమా 3, రియాజ్, రసూల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. హఫీజ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
Advertisement
Advertisement