Lahore lions
-
లాహోర్ లయన్స్ కు హైదరాబాదీ బిర్యానీ!
టెన్నిస్ స్టార్ సానియా మీర్జాతో వివాహం తర్వాత క్రికెటర్ షోయబ్ మాలిక్ హైదరాబాద్ లో తొలిసారి అడుగుపెట్టాడు. అయితే టోక్యో ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ లో ఆడేందుకు సానియా వెళ్లడంతో షోయబ్ కొంత నిరాశ పడినట్టు వార్తలు వెలువడ్డాయి. అయితే సానియా కెరీర్ గ్రాఫ్ ఊపందుకున్న తరుణంలో షోయబ్, ఆమె కుటుంబానికి ఇవేమి నిరాశ కలిగించే అంశంగా కనిపించడంలేదు. సానియా లేకున్నా ఆమె కుటుంబ సభ్యులు షోయబ్, పాకిస్థాన్ జట్టు లాహోర్ లయన్స్ జట్టుకు ఘనంగా ఆతిధ్యమిచ్చారు. సానియా నివాసంలో లాహోర్ లయన్స్ జట్టు కెప్టెన్ మహ్మద్ హఫీజ్ తోపాటు ఇతర ఆటగాళ్లకు హైదరాబాదీ బిర్యానిని మీర్జా కుటుంబం రుచి చూపించారు. సానియా లేకున్నా పాక్ జట్టుకు ఘనంగా విందును ఏర్పాటు చేశారు. సానియా నివాసంలో జరిగిన విందు హాజరైన తన సహచర క్రికెటర్లకు ఏలోటు రాకుండా ఈ హైదరాబాదీ అల్లుడు షోయబ్ ఏర్పాట్లను చూసుకున్నారట. -
గౌతీ మెరుపులు.. నరైన్ మ్యాజిక్
హైదరాబాద్: చాంపియన్స్ లీగ్‌లో భాగంగా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ నాలుగు వికెట్లతో లాహోర్ లయన్స్‌పై ఘనవిజయం సాధించింది. 152 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన కోల్‌కతా ఆరు వికెట్ల నష్టానికి మరో మూడు బంతులు మిగిలుండగా విజయతీరాలకు చేరింది. ఓపెనర్లు గంభీర్ (60), రాబిన్ ఊతప్ప (46) చెలరేగి వంద పరుగుల భాగస్వామ్యంతో శుభారంభం అందించి జట్టు విజయానికి బాటలు వేశారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన లాహోర్ లయన్స్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లెకు 151 పరుగులు చేసింది. షెజాద్ (59) హాఫ్ సెంచరీతో పాటు ఉమర్ అక్మల్ (40) రాణించాడు. కోల్‌కతా స్పిన్నర్ సునీల్ నరైన్ (3/9) అద్భుతంగా బౌలింగ్ చేశాడు. -
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్ కతా
హైదరాబాద్: ఛాంపియన్స్ లీగ్ ట్వెంటీ20 టోర్నమెంట్ లో భాగంగా హైదరాబాద్ రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియంలో లాహోర్ లయన్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. గాయం కారణంగా మనీష్ పాండే తప్పుకోగా రాబిన్ ఉతప్ప జట్టులోకి వచ్చాడు. ఈ మ్యాచ్ లో ఎడమ చేతి స్పిన్నర్ కులదీప్ యాదవ్ తొలిసారి అంతర్జాతీయ మ్యాచ్ ఆడున్నున్నారు. లాహోర్ లయన్స్ జట్టులో ఇమ్రాన్ ఆలీ స్థానంలో ముస్తాఫా ఇక్బాల్ జట్టులోకి వచ్చాడు. -
లయన్స్ గర్జన
రాయ్‌పూర్: బ్యాటింగ్‌లో మహ్మద్ హఫీజ్ (40 బంతుల్లో 67; 5 ఫోర్లు, 4 సిక్సర్లు)... బౌలింగ్‌లో పేసర్ అజీజ్ చీమా (3/15) దుమ్మురేపడంతో చాంపియన్స్ లీగ్ టి20 క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో లాహోర్ లయన్స్ అదరగొట్టింది. సదరన్ ఎక్స్‌ప్రెస్ జట్టును తక్కువ స్కోరుకే కట్టడి చేస్తూ 55 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మరోవైపు నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ చేతిలో ముంబై ఇండియన్స్ ఓడిపోవడంతో... రెండు విజయాలు సాధించి 8 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచిన లాహోర్ లయన్స్ ప్రధాన టోర్నమెంట్‌కు అర్హత సాధించింది. సదరన్ ఎక్స్‌ప్రెస్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన లాహోర్ లయన్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 164 పరుగులు చేసింది. కెప్టెన్ హఫీజ్, సయీద్ నజీమ్ (25 బంతుల్లో 31; 3 ఫోర్లు), షెహజాద్ (21 బంతుల్లో 29; 4 ఫోర్లు) రాణించారు. 52 పరుగులకు 3 వికెట్లు కోల్పోయిన దశలో హఫీజ్, నజీమ్ సమయోచితంగా ఆడారు. నాలుగో వికెట్‌కు 54 బంతుల్లో 75 పరుగులు జోడించారు. చివరి 5 ఓవర్లలో 75 పరుగులు చేయడంతో లాహోర్ మంచి స్కోరును సాధించింది. మహరూఫ్ 3 వికెట్లు తీశాడు. అనంతరం సదరన్ ఎక్స్‌ప్రెస్ 18 ఓవర్లలో 109 పరుగులకు ఆలౌటైంది. ముబారక్ (26 బంతుల్లో 35; 4 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్. సంపత్ (18 బంతుల్లో 18; 3 ఫోర్లు), పెరీరా (16), జయరత్నే (16) మోస్తరుగా ఆడారు. 36 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన సదరన్ ఆ తర్వాత కోలుకోలేకపోయింది. చీమా 3, రియాజ్, రసూల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. హఫీజ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. -
‘నార్తర్న్ మరో విజయం
రాయ్‌పూర్: చాంపియన్స్ లీగ్ టి20 టోర్నీలో ప్రధాన పోటీలకు అర్హత సాధించేందుకు న్యూజిలాండ్ జట్టు నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ చేరువైంది. ఆదివారం ఇక్కడ జరిగిన లీగ్ మ్యాచ్‌లో 72 పరుగులతో లాహోర్ లయన్స్‌ను చిత్తు చేసి వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. తొలి మ్యాచ్‌లో స్ఫూర్తిదాయక ఆటతీరుతో ముంబైపై ఘన విజయం సాధించిన పాక్ టీమ్ రెండో మ్యాచ్‌లో పూర్తిగా చేతులెత్తేసింది. నార్తర్న్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు 170 పరుగులు చేయగా... లాహోర్ లయన్స్ 18 ఓవర్లలో 98 పరుగులకే కుప్పకూలింది. టిమ్ సౌతీకి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారం లభించింది. భారీ భాగస్వామ్యం... టాస్ ఓడిన డిస్ట్రిక్ట్స్ ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు డేవ్‌సిక్ (9), విలియమ్స్ (14) విఫలం కాగా, హారిస్ (13 బంతుల్లో 20; 1 ఫోర్, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. నార్తర్న్ స్కోరు 36/3 వద్ద ఉన్న దశలో జత కలిసిన ఫ్లిన్ (30 బంతుల్లో 53; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), వాట్లింగ్ (37 బంతుల్లో 53; 7 ఫోర్లు, 1 సిక్స్) భారీ భాగస్వామ్యంతో జట్టును నడిపించారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 9.3 ఓవర్లలోనే 90 పరుగులు జోడించడం విశేషం. ప్రత్యర్థిని కట్టడి చేయడంలో పాక్ బౌలర్లంతా విఫలమయ్యారు. చీమాకు 3 వికెట్లు దక్కాయి. నసీమ్ ఒంటరి పోరాటం... లక్ష్యఛేదనలో లయన్స్ బ్యాట్స్‌మెన్ ఏ మాత్రం నిలబడలేకపోయారు. తొలి ఓవర్ మినహా తర్వాతి ఐదు ఓవర్లలో ఆ జట్టు వరుసగా ఐదు వికెట్లు కోల్పోవడంతో జట్టు స్కోరు 19/5 వద్ద నిలిచింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ టిమ్ సౌతీ (3/22)తో పాటు బౌల్ట్ (2/12), సోధి (2/30) లయన్స్‌ను దెబ్బ తీశారు. సహచరులంతా వెనుదిరిగినా... సాద్ నసీమ్ (40 బంతుల్లో 58; 4 ఫోర్లు, 1 సిక్స్) ఒక్కడే పోరాడాడు. అతను మినహా ఇతర ఆటగాళ్లంతా ఒక అంకె స్కోరుకే పరిమితం కావడం విశేషం. ఆఖరి వికెట్‌గా రనౌట్ రూపంలో సాద్ అవుట్ కావడంతో లాహోర్ ఇన్నింగ్స్ ముగిసింది. స్కోరు వివరాలు నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ ఇన్నింగ్స్: డేవ్‌సిక్ (సి) రియాజ్ (బి) రజా 9; విలియమ్సన్ (సి) అక్మల్ (బి) చీమా 14; హారిస్ (సి) అండ్ (బి) హఫీజ్ 20; ఫ్లిన్ (స్టంప్డ్) అక్మల్ (బి) రసూల్ 53; వాట్లింగ్ (సి) షెహజాద్ (బి) చీమా 53; స్టైరిస్ (సి) షెహజాద్ (బి) చీమా 14; మిచెల్ (నాటౌట్) 1; కుగ్లెన్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 170 వికెట్ల పతనం: 1-15; 2-36; 3-60; 4-150; 5-167; 6-167. బౌలింగ్: రజా 3-0-14-1; హఫీజ్ 4-0-35-1; చీమా 4-0-35-3; రసూల్ 3-0-29-1; రియాజ్ 4-0-33-0; అలీ 2-0-22-0. లాహోర్ లయన్స్ ఇన్నింగ్స్: జంషెద్ (బి) సౌతీ 5; షెహజాద్ (సి) వాట్లింగ్ (బి) బౌల్ట్ 2; హఫీజ్ (సి) వాట్లింగ్ (బి) సౌతీ 5; సిద్దిఖ్ (ఎల్బీ) (బి) సౌతీ 3; అక్మల్ (బి) బౌల్ట్ 1; నసీమ్ రనౌట్ 58; రజా (సి) మిచెల్ (బి) స్టైరిస్ 5; రియాజ్ (ఎల్బీ) (బి) సోధి 2; అలీ (సి) విలియమ్సన్ (బి) సోధి 8; రసూల్ (రనౌట్) 4; చీమా (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (18 ఓవర్లలో ఆలౌట్) 98 వికెట్ల పతనం: 1-5; 2-12; 3-16; 4-17; 5-19; 6-34; 7-37; 8-67; 9-80; 10-98. బౌలింగ్: బౌల్ట్ 4-0-12-2; సౌతీ 4-0-22-3; కుగ్లెన్ 3-1-13-0; స్టైరిస్ 3-0-20-1; సోధి 4-0-30-2. -
ముంబైపై లయన్స్ పంజా
ఐపీఎల్-7ను పరాజయంతో మొదలుపెట్టిన ముంబై ఇండియన్స్... చాంపియన్స్ లీగ్ టి20లో కూడా అదే అనవాయితీని కొనసాగించింది. పేలవమైన బ్యాటింగ్, నిలకడలేని బౌలింగ్‌తో క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో మూల్యం చెల్లించుకుంది. మరోవైపు ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకున్న లాహోర్ లయన్స్ సమష్టి విజయంతో ప్రధాన టోర్నీకి అర్హత సాధించే అవకాశాలు మెరుగుపర్చుకుంది. రాయ్‌పూర్: డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగినా... ఆ స్థాయికి తగ్గట్టు ఆటతీరును కనబరచకపోవడంతో చాంపియన్స్ లీగ్ టి20 క్వాలిఫయింగ్ టోర్నీలో ముంబై ఇండియన్స్ నిరాశపర్చింది. కాగితంపై బలంగా కనిపించినా... మైదానంలో దూకుడు చూపకపోవడంతో ఓటమిని తప్పించుకోలేకపోయింది. దీంతో శనివారం జరిగిన క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో లాహోర్ లయన్స్ జట్టు 6 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌పై గెలిచింది. షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... లాహోర్ లయన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 135 పరుగులు చేసింది. ఆదిత్య తారే (36 బంతుల్లో 37; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), మైక్ హస్సీ (26 బంతుల్లో 28; 2 ఫోర్లు, 1 సిక్స్)లకు తోడుగా చివర్లో ప్రవీణ్ కుమార్ (14 బంతుల్లో 20 నాటౌట్; 3 ఫోర్లు), హర్భజన్ (10 బంతుల్లో 18; 1 ఫోర్, 2 సిక్సర్లు) వేగంగా ఆడారు. ఆరంభంలో లయన్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ముంబై ఏడు బంతుల వ్యవధిలో సిమ్మన్స్ (7), జలజ్ (0), రాయుడు (3) వికెట్లను కోల్పోయింది. అయితే మరో ఓపెనర్ హస్సీ నిలకడగా ఆడి తారేతో కలిసి నాలుగో వికెట్‌కు 44 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను కుదుటపర్చాడు. భారీ షాట్లతో విరుచుకుపడతాడని భావించిన పొలార్డ్ (6) నిరాశపర్చినా... ప్రవీణ్, హర్భజన్లు ధాటిగా ఆడి 13 బంతుల్లో 20 పరుగులు జోడించారు. దీంతో ముంబైకి ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. చీమా, రియాజ్ చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన లాహోర్ లయన్స్ 18.4 ఓవర్లలో 4 వికెట్లకు 139 పరుగులు చేసింది. ఉమర్ అక్మల్ (18 బంతుల్లో 38 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగి ఆడాడు. షెహజాద్ (33 బంతుల్లో 34; 5 ఫోర్లు, 1 సిక్స్), జంషేద్ (24 బంతుల్లో 26; 3 ఫోర్లు) రాణించారు. ఓపెనర్లు జంషేద్, షెహజాద్‌లు తొలి వికెట్‌కు 51 పరుగులు జోడించి శుభారంభాన్నివ్వగా, మధ్యలో కెప్టెన్ హఫీజ్ (18) కాస్త నిరాశపర్చాడు. అయితే మిడిలార్డర్లో వచ్చిన ఉమర్ అక్మల్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఆసిఫ్ రజా (14 నాటౌట్)తో కలిసి ఐదో వికెట్‌కు కేవలం 16 బంతుల్లో 39 పరుగులు జోడించి జట్టుకు విజయాన్ని అందించాడు. ఓజాకు రెండు వికెట్లు దక్కాయి. ఉమర్ అక్మల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: సిమ్మన్స్ (సి) రియాజ్ (బి) చీమా 7; మైక్ హస్సీ (సి) ఉమర్ అక్మల్ (బి) రియాజ్ 28; జలజ్ (సి) జంషేద్ (బి) చీమా 0; రాయుడు (సి) ఉమర్ అక్మల్ (బి) రజా 3; తారే (సి) రసూల్ (బి) రియాజ్ 37; పొలార్డ్ (బి) ఇమ్రాన్ అలీ 6; హర్భజన్ రనౌట్ 18; ప్రవీణ్ నాటౌట్ 20; మలింగ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 135 వికెట్ల పతనం: 1-20; 2-20; 3-23; 4-67; 5-94; 6-107; 7-127 బౌలింగ్: ఆసిఫ్ రజా 3-0-18-1; అజీజ్ చీమా 4-0-22-2; హఫీజ్ 3-0-17-0; ఇమ్రాన్ అలీ 3-0-22-1; రియాజ్ 4-0-31-2; రసూల్ 3-0-13-0. లాహోర్ లయన్స్ ఇన్నింగ్స్: జంషేద్ (స్టంప్డ్) తారే (బి) హర్భజన్ 26; షెహజాద్ (సి) పొలార్డ్ (బి) ఓజా 34; హఫీజ్ (సి) హస్సీ (బి) పొలార్డ్ 18; సయీద్ నజీమ్ (సి) జలజ్ (బి) ఓజా 6; ఉమర్ అక్మల్ నాటౌట్ 38; ఆసిఫ్ రజా నాటౌట్ 14; ఎక్స్‌ట్రాలు: 3; మొత్తం: (18.4 ఓవర్లలో 4 వికెట్లకు) 139 వికెట్ల పతనం: 1-51; 2-66; 3-81; 4-100 బౌలింగ్: ప్రవీణ్ 3-0-15-0; బుమ్రా 3.4-0-35-0; మలింగ 3-0-30-0; హర్భజన్ 4-0-26-1; ఓజా 4-0-18-2; పొలార్డ్ 1-0-13-1. -
లాహోర్ లయన్స్‌కు లైన్ క్లియర్
కరాచీ: భారత్‌లో జరిగే చాంపియన్స్ లీగ్ టి20లో పాకిస్థాన్ జట్టు లాహోర్ లయన్స్ ఆడేందుకు అనుమతి లభిస్తుందా? లేదా? అనే సస్పెన్స్‌కు తెర పడింది. జట్టుకు వీసా లభించిందని, టోర్నీలో ఆడేందుకు ఎలాంటి అడ్డంకి లేదని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. ‘భారత హైకమిషన్ వీసాలు జారీ చేసింది. నేటి (మంగళవారం) ప్రయాణానికి భారత్ వెళ్లేందుకు టిక్కెట్లను అందుకున్నాం. ఇది శుభపరిణామం.. ఇదే ఉత్సాహంతో పాక్ ఆటగాళ్లను ఐపీఎల్లో ఆడించేలా కూడా ప్రయత్నిస్తాం’ అని పీసీబీ అధికారి తెలిపారు. హఫీజ్ నేతృత్వంలోని లాహోర్ జట్టుకు సీఎల్ టి20 ప్రధాన రౌండ్లో చోటు దక్కాలంటే ముందుగా అర్హత మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. -
సీఎల్టీ20కి లాహోర్ లయన్స్
కరాచీ: పాకిస్థాన్ దేశవాళీ జట్టు లాహోర్ లయన్స్... చాంపియన్స్ లీగ్ టి20 టోర్నీలో పాల్గొననుంది. జాతీయ టి20 చాంపియన్ కాకుండా లయన్స్ జట్టును బీసీసీఐ ఆహ్వానించిందని పీసీబీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుభాన్ అహ్మద్ తెలిపారు. స్టార్ ఆటగాళ్లతో కూడిన ఈ జట్టుకు మహ్మద్ హఫీజ్ నాయకత్వం వహిస్తున్నాడు. ఉమర్, కమ్రాన్ అక్మల్, రియాజ్, అజీజ్ చిమా, జంషేద్, షెహజాద్ వంటి ఆటగాళ్లు ఈ జట్టులో ఉన్నారు. గతంలో సియాల్కోట్ స్టాలిన్స్, ఫైసలాబాద్ వోల్వ్స్ చాంపియన్స్ లీగ్‌లో పాల్గొన్నా... టోర్నీలో పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.