కరాచీ: భారత్‌లో జరిగే చాంపియన్స్ లీగ్ టి20లో పాకిస్థాన్ జట్టు లాహోర్ లయన్స్ ఆడేందుకు అనుమతి లభిస్తుందా? లేదా? అనే సస్పెన్స్‌కు తెర పడింది. జట్టుకు వీసా లభించిందని, టోర్నీలో ఆడేందుకు ఎలాంటి అడ్డంకి లేదని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. ‘భారత హైకమిషన్ వీసాలు జారీ చేసింది. నేటి (మంగళవారం) ప్రయాణానికి భారత్ వెళ్లేందుకు టిక్కెట్లను అందుకున్నాం. ఇది శుభపరిణామం.. ఇదే ఉత్సాహంతో పాక్ ఆటగాళ్లను ఐపీఎల్‌లో ఆడించేలా కూడా ప్రయత్నిస్తాం’ అని పీసీబీ అధికారి తెలిపారు. హఫీజ్ నేతృత్వంలోని లాహోర్ జట్టుకు సీఎల్ టి20 ప్రధాన రౌండ్‌లో చోటు దక్కాలంటే ముందుగా అర్హత మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.