
జకర్తా: ఆసియా క్రీడల్లో రెండో రోజు భారత్ మరో పతకం ఖాతాలో వేసుకుంది. సోమవారం జరిగిన పురుషుల ట్రాప్ ఈవెంట్‌లో లక్షయ్ షెరాన్ రజతం సాధించాడు. ట్రాప్ ఫైనల్లో 48 టార్గెట్‌లకు గాను లక్షయ్ 39 టార్గెట్లను పూర్తి చేసి రజతం గెలుపొందాడు. దీంతో ఇప్పటివరకు భారత్ ఖాతాలో స్వర్ణం, కాంస్యం, రెండు రజత పతకాలు చేరాయి.
ఇదే ఈవెంట్‌లో మరో భారత షూటర్ మనవ్‌జిత్ సింగ్ సంధూ నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. మరోవైపు సోమవారం ఉదయం జరిగిన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ పురుషుల ఈవెంట్‌లో దీపక్ కుమార్ పతకాన్ని సాధించాడు. ఆసియా క్రీడల్లో తొలి రోజు ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ ఈవెంట్‌లో రవి–అపూర్వీ జంటకు కాంస్యం, యువ రెజ్లర్ బజరంగ్ పూనియా పసిడి సాధించిన విషయం తెలిసిందే.