మెస్సీకి జైలు శిక్ష
♦ పన్ను ఎగవేత కేసులో 21 నెలలు విధించిన బార్సిలోనా కోర్టు
♦ ఉన్నత న్యాయస్థానం రద్దు చేసే అవకాశం!
బార్సిలోనా : పన్ను ఎగవేత కేసులో అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనల్ మెస్సీ, అతని తండ్రి జార్జ్ హోరాసియో మెస్సీని బార్సిలోనా కోర్టు దోషులుగా తేల్చింది. దీంతో ఇద్దరికి 21 నెలల జైలు శిక్షతో పాటు మెస్సీకి 2.09 మిలియన్ యూరోలు (రూ. 15 కోట్లు), జార్జ్‌కు 1.6 మిలియన్ యూరోలు (రూ. 12 కోట్లు) జరిమానా విధించింది. అయితే స్పెయిన్‌లో అహింస నేరాలకు సంబంధించిన కేసులో రెండేళ్ల కంటే తక్కువ శిక్ష పడితే వాటిని ఉన్నత న్యాయస్థానాలు రద్దు చేయడం సర్వసాధారణం. బార్సిలోనా కోర్టు విధించిన శిక్షను కూడా స్పెయిన్ సుప్రీంకోర్టులో మెస్సీ, జార్జ్‌లు అప్పీలు చేయనున్నారు.
2007-09 వరకు ఇమేజ్ రైట్స్ (చిత్రం వాడుకున్నందుకు) వల్ల తనకు వచ్చిన ఆదాయం 4.16 మిలియన్ యూరో (రూ. 31 కోట్లు)లకు పన్ను చెల్లించలేదని కోర్టు తెల్చింది. బెలిజ్, బ్రిటన్, స్విట్జర్లాండ్, ఉరుగ్వేలోని పలు కంపెనీలను ఉపయోగించి తండ్రీకొడుకులు ఈ పన్ను ఎగవేతకు పాల్పడినట్లు గుర్తించింది. ఇమేజ్ రైట్స్‌తో పాటు డానోన్, అడిడాస్, పెప్సీ కోలా, ప్రోక్టర్ అండ్ గాంబ్లీ (కువైట్ ఫుడ్ కంపెనీ) వంటి కంపెనీలతో ఉన్న ఒప్పందాలను కూడా మెస్సీ దాచిపెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే నాలుగు రోజుల విచారణలో మెస్సీపై మూడు అభియోగాలు నమోదు చేశారు.
చిన్నప్పట్నించి తన ఆర్థిక లావాదేవీలను తండ్రి జార్జ్ చూస్తున్నారని, ఆయనపై నమ్మకంతోనే ఏదీ పట్టించుకోలేదని మెస్సీ కోర్టుకు తెలిపాడు. ఇదే విషయాన్ని మెస్సీ తరఫు న్యాయవాదులు కూడా వినిపించారు. ఆదాయ వ్యయాల్లో మెస్సీ కలుగజేసుకున్నట్లు ఎక్కడా ఆధారాలు కూడా లేవని స్పష్టం చేశారు. అయితే జరుగుతున్న పరిణామాలన్నీ మెస్సీకి తెలుసని, ఉద్దేశపూర్వకంగా పన్ను ఎగవేతకు పాల్పడ్డారని స్టేట్ అటార్నీ (ట్యాక్స్) మరియో మాజా వాదించారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు జైలుశిక్ష, జరిమానా విధించింది. 2013 ఆగస్టులో కూడా ఓ పన్ను ఎగవేత ఆరోపణలు ఎదుర్కొన్న మెస్సీ, జార్జ్... దర్యాప్తు తర్వాత స్వచ్ఛందంగా 5 మిలియన్ యూరోలు చెల్లించారు.