మెస్సీ మ్యాజిక్
* క్వార్టర్స్‌లో అర్జెంటీనా
* బొలీవియాపై చిలీ గెలుపు
* కోపా అమెరికా కప్
షికాగో: వెన్ను నొప్పి కారణంగా తొలి మ్యాచ్‌కు దూరంగా ఉన్న స్టార్ ఫార్వర్డ్ లియోనల్ మెస్సీ... బరిలోకి దిగిన మొదటి మ్యాచ్‌లోనే తన మ్యాజిక్‌ను చూపెట్టాడు. కేవలం 19 నిమిషాల్లోనే ‘హ్యాట్రిక్’ గోల్స్ చేసి అర్జెంటీనాను నాకౌట్ దశకు తీసుకెళ్లాడు. కోపా అమెరికా కప్ టోర్నీలో భాగంగా శుక్రవారం అర్ధరాత్రి జరిగిన గ్రూప్-డి లీగ్ మ్యాచ్‌లో అర్జెంటీనా 5-0తో పనామాపై నెగ్గింది.
దీంతో ఆరు పాయింట్లతో క్వార్టర్స్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. నికోలస్ ఒటమెండి (7వ ని.), మెస్సీ (68, 78, 87వ ని.), సెర్గియో అగురో (90వ ని.) అర్జెంటీనాకు గోల్స్ అందించారు. నొప్పి నుంచి నెమ్మదిగా కోలుకుంటుండటంతో అర్జెంటీనా కోచ్ గెరార్డో మార్టినో ఊహించని రీతిలో మెస్సీని సబ్‌స్టిట్యూట్‌గా ఎంపిక చేశాడు. దీంతో 61వ నిమిషంలో అగుస్టో ఫెర్నాండేజ్ స్థానంలో మైదానంలో అడుగుపెట్టిన ఈ బార్సిలోనా సూపర్ స్టార్ సమయాన్ని ఏమాత్రం వృథా చేయలేదు.
ఏడు నిమిషాల్లోనే గోంజాలో హిగుయాన్ కొట్టిన బౌన్స్ బంతిని తనదైన శైలిలో నెట్‌లోకి పంపి తొలి గోల్ నమోదు చేశాడు. మరో పది నిమిషాల తర్వాత బంతిని కర్లింగ్ చేస్తూ కొట్టిన ఫ్రీ కిక్ బార్ టాప్ కార్నర్ నుంచి లక్ష్యాన్ని చేరడంతో రెండో గోల్ వచ్చింది. తనను లక్ష్యంగా చేసుకొని ఆడుతున్న పనామా ఆటగాళ్లను ఓ తొమ్మిది నిమిషాల పాటు తిప్పలుపెట్టి పెనాల్టీ ఏరియా నుంచి పంపిన బలమైన షాట్ నేరుగా గోల్‌పోస్ట్‌లోకి దూసుకుపోవడంతో ‘హ్యాట్రిక్’ పూర్తయింది. అర్జెంటీనా ఐదో గోల్‌లోనూ మెస్సీ కీలక పాత్ర పోషించాడు. లెఫ్ట్ ఫ్లాంక్ నుంచి పనామా డిఫెన్స్‌ను ఛేదిస్తూ అందించిన అద్భుతమైన పాస్‌ను అగురో గోల్‌గా మలిచాడు.
చిలీ ఆశలు సజీవం
మరో మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ చిలీ 2-1తో బొలీవియాపై నెగ్గి నాకౌట్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. ఆర్థురో విడాల్ (46, 100వ ని.) చిలీ తరఫున రెండు గోల్స్ చేయగా, జాస్మాని కాంపోస్ (61వ ని.) బొలీవియాకు ఏకైక గోల్ అందించాడు. ఇంజ్యూరీ టైమ్‌లో విడాల్ కొట్టిన పెనాల్టీ కార్నర్ వివాదాస్పదమైంది.