‘ మిస్టర్ యూనివర్స్’ మనోహర్ కన్నుమూత | Manohar Aich, India's first Mr Universe dies at 102 | Sakshi
Sakshi News home page

‘ మిస్టర్ యూనివర్స్’ మనోహర్ కన్నుమూత

Published Mon, Jun 6 2016 12:27 AM | Last Updated on Mon, Sep 4 2017 1:45 AM

‘ మిస్టర్ యూనివర్స్’   మనోహర్ కన్నుమూత

‘ మిస్టర్ యూనివర్స్’ మనోహర్ కన్నుమూత

1952లో టైటిల్ సొంతం రెండో భారత బిల్డర్‌గా రికార్డు
 
కోల్‌కతా: ఎత్తు చూస్తే 4 అడుగుల 11 అంగుళాలు... కానీ కండలు చూస్తే కొండల్ని మించిపోయేవి. బాడీ సైజ్ బాహుబలిని తలదన్నే స్థాయి. భారత్‌లో బాడీ బిల్డింగ్‌కు పెద్దగా ప్రాముఖ్యం లేని పాత రోజుల్లోనే అంతర్జాతీయ యవనికపై సంచలనాలు సృష్టించిన ‘పాకెట్ సైజ్‌డ్’ మిస్టర్ యూనివర్స్ మనోహర్ ఐచ్ (104) ఆదివారం మధ్యాహ్నం కన్నుమూశారు. వృద్ధాప్యం కారణంగా తలెత్తిన అనారోగ్య సమస్యలతో బగుయాటిలోని స్వగృహంలో ఆయన తుది శ్వాస విడిచారు. మనోహర్‌కు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఒక కుమారుడు జిమ్, ఫిట్‌నెస్ సెంటర్‌ను నడుపుతూ తండ్రి కలను సాకారం చేస్తున్నాడు.

1950లో 36 ఏళ్ల వయసులో మనోహర్ తొలిసారి ‘మిస్టర్ హెర్క్యులస్’ పోటీల్లో విజేతగా నిలిచారు. 1951లో ఏకంగా ‘మిస్టర్ యూనివర్స్’ పోటీల్లో పాల్గొన్నా... రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు. కానీ లండన్‌లోనే మకాంపెట్టి పట్టువదలని విక్రమార్కుడిలా ప్రాక్టీస్ చేసి ప్రో షాట్ డివిజన్ పోటీల్లో పాల్గొన్నారు. ఈ సమయంలో ఆర్థిక సమస్యలు తలెత్తడంతో కొన్ని రోజులు బస్ కండక్టర్‌గా మారారు. సర్కస్‌ల్లో కూడా పని చేశారు. చివరకు 1952లో ‘జాతీయ అమెచ్యూర్ బాడీ బిల్డర్స్ అసోసియేషన్ యూనివర్స్ చాంపియన్‌షిప్ టైటిల్’ను సాధించి భారత్ తరఫున రెండో ‘మిస్టర్ యూనివర్స్’గా రికార్డులకెక్కారు.

దీంతో అతని సైజ్‌ను బట్టి ‘పాకెట్ హెర్క్యులస్’గా నామకరణం చేశారు. తొలిసారి 1951లో మాంటోష్ రాయ్ (భారత్) మిస్టర్ యూనివర్స్ టైటిల్‌ను గెలిచారు. కొమిల్లా (ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉంది) జిల్లాలో జన్మించిన మనోహర్... 1942లో రాయల్ ఎయిర్ ఫోర్స్‌లో చేరారు. ఆ తర్వాత బ్రిటిష్ అధికారి రెబూ మార్టిన్ ప్రోత్సాహం మేరకు బాడీ బిల్డింగ్‌ను కెరీర్‌గా ఎంచుకుని అంచలంచెలుగా ఎదిగారు. చనిపోవడానికి కొన్ని రోజుల ముందు వరకు మనోహర్ క్రమం తప్పకుండా ఎక్సర్‌సైజ్ చేశారు. 1991లో డమ్ డమ్ నియోజకవర్గ అభ్యర్థిగా బీజేపీ తరఫున లోక్‌సభకు పోటీ చేసిన ఆయన లక్షా 63 వేల ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు.

అధిక బరువులు ఎత్తడంతో 2011లో స్వల్పంగా గుండెపోటు వచ్చినా తట్టుకొని నిలబడ్డారు. ప్రతి రోజు తన శిష్యుల పురోగతిని చూస్తూ గడిపేవారు. ఫిట్‌నెస్ అంటే విపరీతమైన మక్కువ చూపే మనోహర్... ఉన్నన్ని రోజులు ‘ఎలాంటి ఆందోళనలు లేకుండా క్రమశిక్షణతో, నిజాయితీగా సింపుల్‌గా జీవించు. బ్రతకడం కోసం తిను... తినడం కోసం బ్రతకకు’ అనే ఓ సిద్ధాంతంతో జీవించారు. మనోహర్ మృతికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, క్రీడా శాఖ మంత్రి లక్ష్మీ రతన్ శుక్లా ఘనంగా నివాళులు అర్పించారు.

Advertisement
Advertisement