మన మిస్టర్ యూనివర్స్ కు 103ఏళ్లు
మిస్టర్ యూనివర్స్ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడు ఎవరు? మనోహర్ ఎయిచ్ పేరు ఎప్పుడైనా విన్నారా..? పోనీ తొలి మిస్టర్ యూనివర్స్ టైటిల్ తొలిసారి ఎప్పుడు గెలుచుకుందో తెలుసా..? కౌన్ బనేగా కరోడ్ పతీ ప్రశ్నలేంటనుకుంటున్నారా..? వీటికి సమాధానాలు తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే..
ఈ ఫోటోలో ఉన్న 103ఏళ్ల పెద్దాయన పేరు మనోహర్ ఎయిచ్. మిస్టర్ యూనివర్స్ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడు. 1952లో మిస్టర్ యూనివర్స్ టైటిల్ గెలుచుకున్నాడు. అంతేకాదు.. ఇప్పటికీ అంతే ఫిట్ గా ఉన్నాడు.
సన్నిహితులు పాకెట్ హెర్కులస్ అని ముద్దుగా పిలుచుకునే మనోహర్ బెంగాల్ లోని చిన్నటౌన్ కొమిల్లాలో పుట్టాడు. చిన్నప్పటి నుంచే ఫిట్ సెస్ మీద ఇంట్రెస్ట్ ఉన్న మనోహర్ మొదట రెజ్లింగ్ చేసే వాడు. 1942లో అప్పటి బ్రిటీష్ రాయల్ ఎయిర్ ఫోర్స్ల్ లో చేరాక.. బాడీ బిల్డింగ్ పై మక్కువ పెంచుకోవడానికి బ్రిటీష్ ఆఫీసర్ రెబ్ మార్టీన్ కారణం. ఆయనే మనోహర్ కు వెయిట్ ట్రెయినింగ్ ఇచ్చారు. అయితే స్వాతంత్ర పోరాట కాలంలో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పనిచేడంతో మనోహర్ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. జైలుకు వెళ్లడం తన జీవితాన్ని మలుపు తిప్పిందంటాడు మనోహర్. జైల్లో ఉన్నకాలంలో తాను బాడీ బిల్డింగ్ ను చాలా సిరియస్ గా తీసుకున్నానని వివరించాడీ నాలుగు అడుగుల 11 అంగుళాల బాడీ బిల్డర్. జైల్లో స్వంతంగా రోజుకు 12 గంటల పాటు కసరత్తులు చేసే వాడినని గుర్తు చేసుకున్నాడు. మనోహర్ పట్టుదల చూసి జైలు అధికారులు అబ్బురపడి.. తనకు ప్రత్యేక ఆహారాన్ని అందించారని చెప్పుకొచ్చాడు.
1950లో మిస్టర్ హెర్కులస్ టైటిల్ గెలిచాక.. మిస్టర్ యూనివర్స్ పోటీలపై నమ్మకం కలిగింది. తర్వాత ఏడాదే లండన్ లో జరిగిన మిస్టర్ యూనివర్స్ పోటీల్లో పాల్గొన్నాడు. అక్కడ రన్నరప్ స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తర్వాత ఏడాది మరింత పట్టుదలతో సాధన చేశాడు. దీంతో మిస్టర్ యూనివర్స్ గ్రూప్ 3 ఛాంపియన్ షిప్ టైటిల్ 'మన హెర్కులస్' వశమైంది. ఇక ఆసియా క్రీడల్లో 1951(ఢిల్లీ), 1954(మనీలా), 1958(టోక్యో)ల్లో వరసగా బంగారు పతకాలు సాధించాడు.
ఇప్పటికీ తన 13ఏళ్ల క్రితం కసరత్తులు చేయడం మానేసినా.. కుమారులు ఏర్పాటు చేసిన జిమ్ లో యువకులకు మెలకువలు నేర్పిస్తూ చురుగ్గా ఉన్నాడు. ధూమ పానం, మద్యపానం దూరంగా ఉంచడమే తన ఆరోగ్య రహస్యం అంటాడీ బోసినవ్వుల మిస్టర్ యూనివర్స్.