
కోల్‌కతా: అతను కోల్‌కతాకు చెందిన చాయ్‌వాలా. పేరు శివశంకర్ పాత్రా. ఉండేది నార్త్ 24 పరగణాస్. తనకు అక్కడ మూడంతస్తుల ఇల్లుంది. గ్రౌండ్ ఫ్లోర్‌లో టీ కొట్టు నిర్వహిస్తాడు. కోల్‌కతాలో చాలామందిలాగే అతనూ సాకర్ ప్రియుడు. కానీ మెస్సీ అంటే విపరీతమైన ఇష్టం. అందుకే తన ఇంటి మొత్తానికి అర్జెంటీనా జెర్సీ రంగేసుకున్నాడు. ప్రపంచకప్ జరిగే ప్రతీసారి అతను చేసే పనే ఇది. ఈసారి రష్యాకు వెళ్లి ప్రత్యక్షంగా చూడాలనుకున్నా... ఆర్థికస్థోమత లేక ఆగిపోయాడు. అయితే అర్జెంటీనా అభిమాని అయిన శివశంకర్ తన ఇంటినే అర్జెంటీనాలా మార్చేశాడు. గదుల్లో మెస్సీ ఫ్లెక్సీలను అంటించాడు. మొత్తానికి తన ఒంటికి సాకర్ ఫీవర్‌ను, ఇంటికి అర్జెంటీనా ఫ్లేవర్‌ను అద్దేశాడు. అదేమంటే మెస్సీ అంటే పిచ్చి అభిమానం.
2012 నుంచి మెస్సీ పుట్టినరోజు అతని ఇంట్లో పండగ రోజు. ఇంటిని చక్కగా అలంకరించి, కేక్ కట్ చేసి మెస్సీ బర్త్‌డేని ఘనంగా జరుపుతాడు. ఆ రోజు కస్టమర్లకు టీ, స్నాక్స్‌ను ఉచితంగా అందిస్తాడు. దీనిపై అతను మాట్లాడుతూ ‘నేనెవర్నీ పైసా అడగను. అలాగని ఆర్థికలోటు ఉండదు. ఆ టైమ్‌కు అన్నీ సమకూరుతాయి. సాకర్ ప్రియులు కొంత స్పాన్సర్ చేస్తారు’ అని అన్నాడు. అర్జెంటీనా మ్యాచ్‌లు జరిగే రోజు తన టీ కొట్టులో వీక్షించేవారికి చాయ్‌తో పాటు సమోసాలు ఉచితంగా పంపిణీ చేస్తాడు. ఆంజనేయస్వామిని ఆరాధించే శివశంకర్ మ్యాచ్ రోజు మెస్సీ జట్టు గెలవాలని ప్రార్థన చేస్తాడు. ఈసారి అర్జెంటీనాకు మెస్సీ కప్‌ను అందిస్తాడని శివశంకర్ తెగ నమ్మకం పెట్టుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment