
గట్టెక్కిన అర్జెంటీనా
♦ కోపా అమెరికా కప్ సెమీస్‌లో మెస్సీ బృందం
♦ షూటౌట్‌లో కొలంబియాపై గెలుపు
వినా డెల్ మార్ (చిలీ) : నాలుగేళ్ల క్రితం సొంతగడ్డపై ఎదురైన చేదు ఫలితాన్ని మరచిపోయేలా అర్జెంటీనా జట్టు కోపా అమెరికా కప్‌లో సెమీఫైనల్లోకి ప్రవేశించింది. కొలంబియాతో శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో అర్జెంటీనా ‘పెనాల్టీ షూటౌట్’లో 5-4 గోల్స్ తేడాతో విజయం సాధించి ఊపిరి పీల్చుకుంది. 2011 టోర్నీలో ఉరుగ్వేతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో అర్జెంటీనా ‘షూటౌట్’లో ఓడిపోయింది. నాటి షూటౌట్‌లో గురి తప్పి అర్జెంటీనా ఓటమికి కారణమైన కార్లోస్ టెవెజ్ ఈసారి మాత్రం ఆ పొరపాటు చేయలేదు. షూటౌట్‌లో కీలకమైన స్పాట్ కిక్‌ను గోల్‌గా మలిచిన టెవెజ్ ఈసారి అర్జెంటీనా తరఫున హీరో అయ్యాడు.
అంతకుముందు నిర్ణీత 90 నిమిషాలు, ఆ తర్వాత అదనపు సమయంలోనూ రెండు జట్లు గోల్స్ చేయడంలో విఫలం కావడంతో విజేతను నిర్ణయించడానికి షూటౌట్ అనివార్యమైంది. షూటౌట్‌లో అర్జెంటీనా తరఫున మెస్సీ, గారె, బనెగా, లావెజి, టెవెజ్ గోల్స్ చేయగా... బిగ్లియా, రోజో విఫలమయ్యారు. కొలంబియా జట్టు నుంచి జేమ్స్, ఫల్కావో, కుడ్రాడో, కార్డోనా గోల్స్ సాధించగా... మురియెల్, జునిగా, మురిలో గురి తప్పారు.