ఇస్లామాబాద్ : ‘కోచ్‌గా పాకిస్తాన్ జట్టును నా భుజస్కంధాలపై మోశాను. కష్టకాలంలో ఆటగాళ్లలో మనోధైర్యాన్ని నింపాను. పాకిస్తాన్ క్రికెట్ జట్టులో సమూల మార్పులు తీసుకొచ్చాను. విజయాల బాట పట్టించాను. యువ ఆటగాళ్లకు అండగా నిలిచాను. అయితే నా కోచ్ కాంట్రాక్టు ముగుస్తుండటంతో మరో రెండేళ్లు పొడగించమని కోరాను. కానీ వాళ్లు ప్రపంచకప్ ఓటమికి బాధ్యుడిని చేస్తూ నన్ను బలిపశువును చేశారు. నన్ను తప్పించడం తీవ్ర నిరాశ, బాధను కలిగించాయి. అయితే ఒక్కటి మాత్రమ గర్వంగా చెప్పగలను. కోచ్‌గా పాక్ జట్టును అత్యున్నత స్థాయికి తీసుకొనిపోయాను’అంటూ పాక్ తాజా మాజీ కోచ్ మికీ అర్థర్ తన ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రధాన కోచ్ మికీ అర్థర్‌కు ఉద్వాసన పలికింది. దీంతో పైవిధంగా ఆర్థర్ స్పందించాడు. అతడితో పాటు సపోర్టు స్టాఫ్ కాంట్రాక్టులను కూడా పొడిగించేందుకు పీసీబీ సుముఖంగా లేదని తెలిసింది.
ప్రపంచకప్‌లో ఘోర ఓటమి అనంతరం పీసీబీ దిద్దుబాటు చర్యలకు దిగింది. ఓటమిపై నివేదిక కోరుతూ వసీం ఆక్రమ్, మిస్బావుల్ హక్‌లతో కూడిన ఓ కమిటీని నియమించింది. రెండ్రోజుల క్రితం అర్థర్‌తో భేటి అయిన ఈ కమిటీ కోచ్ ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందలేదు. ఇక ఇదే భేటిలో సర్ఫరాజ్ అహ్మద్‌ను సారథ్య బాధ్యతల నుంచి తొలగించాలని కమిటీకి అర్థర్ సూచించారు. గత రెండేళ్లుగా సర్ఫరాజ్ సారథిగా విఫలమవుతున్నాడని, జట్టును ఏకతాటిపై నడిపించడంలో విఫలమయ్యాడని వారికి వివరించారు. అయితే కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం కోచింగ్ బృందం కాంట్రాక్టును పొడగించకూడదని భావిస్తున్నట్లు పీసీబీ అధికారికంగా తెలిపింది. దీంతో ఆర్థర్ దక్షిణాఫ్రికాకు పయనమయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment