‘సెట్టింగ్’ చేయడం నా వల్ల కాలేదు!
►అందుకే కోచ్ పదవి దక్కలేదు
►సెహ్వాగ్ తీవ్ర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు కోచ్ పదవికి తాను ఎంపిక కాకపోవడానికి బీసీసీఐలోని పెద్దల మద్దతు లేకపోవడమే కారణమని మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు. కోచ్‌గా దరఖాస్తు చేయాలని తాను అనుకోలేదని, రవిశాస్త్రి బరిలో ఉన్నాడని తెలిస్తే తాను అసలు ముందుకు రాకపోయేవాడినని అతను అన్నాడు. చాంపియన్స్ ట్రోఫీ తర్వాత భారత కోచ్ ఎంపిక కోసం బీసీసీఐకి దరఖాస్తులు చేసిన వారిలో వీరూ కూడా ఉన్నాడు. అయితే క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) ఇంటర్వ్యూ అనంతరం చివరకు రవిశాస్త్రి కోచ్‌గా ఎంపికయ్యారు. ‘భారత కోచ్‌ను ఎంపిక చేసే అధికారం ఉన్న పెద్దలతో నాకేమీ లోపాయికారీ ఒప్పందం లేదు. నేను అలా చేయలేకపోయాను. నేను ఎంపిక కాకపోవడానికి అదే కారణం’ అని సెహ్వాగ్ కుండ బద్దలు కొట్టినట్లు చెప్పాడు.
భారత జట్టుకు కోచింగ్ ఇవ్వాలని తానెప్పుడూ అనుకోలేదని... అయితే బోర్డు కార్యదర్శి అమితాబ్ చౌదరి, జనరల్ మేనేజర్ ఎంవీ శ్రీధర్ తన వద్దకు వచ్చి దీనిపై ఆలోచించమంటూ విజ్ఞప్తి చేసిన తర్వాతే ముందుకు వెళ్లినట్లు వీరూ వెల్లడించాడు. ‘నిజానికి నాకు దీనిపై ఆసక్తి లేదు. ఆ తర్వాత నేను కోహ్లితో కూడా మాట్లాడాను. అతను కూడా దరఖాస్తు చేయమని చెప్పాడు. దాంతో నమ్మకం పెరిగింది. జట్టుకు నేను ఉపయోగపడగలనని భావించాను. భవిష్యత్తులో ఇంకెప్పుడూ ఆ ప్రయత్నం చేయను’ అని ఈ మాజీ ఓపెనర్ తన మనసులో మాటను చెప్పాడు. ‘చాంపియన్స్ ట్రోఫీ జరిగే సమయంలో గత ఏడాది చేసిన తప్పును పునరావృతం చేయనంటూ రవిశాస్త్రి కోచింగ్ పదవిపై అనాసక్తిని ప్రదర్శించారు. అందువల్ల నేను బరిలో నిలిచాను. రవిశాస్త్రి గనక దరఖాస్తు చేస్తున్నట్లు తెలిస్తే నేను అసలు అటువైపు వెళ్లకపోయేవాడిని’ అని సెహ్వాగ్ నాటి ఘటనను గుర్తు చేసుకున్నాడు.