Indian cricket team coach
-
భారత కోచ్‌ను కావాలనుకున్నాను!
కోల్‌కతా: ఒకప్పుడు తాను భారత క్రికెట్ జట్టుకు కోచ్‌గా మారాలని ఎంతో కోరుకున్నానని...అయితే విధి తనను పరిపాలనా వ్యవహారాల వైపు తీసుకెళ్లిందని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ వ్యాఖ్యానించాడు. ‘మనం ఏం చేయగలమో దాని గురించే ఆలోచించాలి. జీవితం మనల్ని ఎటువైపు తీసుకెళుతుందో ఎవరూ చెప్పలేరు. 1999లో నేను సచిన్ నాయకత్వంలో ఆస్ట్రేలియాకు వెళ్లినప్పుడు కనీసం వైస్ కెప్టెన్‌ను కూడా కాదు. కానీ మూడు నెలలకే నేను భారత కెప్టెన్ అయ్యాను. ఆటనుంచి తప్పుకున్నాక భారత జట్టు కోచ్ కావాలని గట్టిగా అనుకున్నాను. అయితే దాల్మియా మరణంతో నాకు క్యాబ్ అధ్యక్ష పదవి లభించింది. కొంత మంది ఈ స్థాయికి చేరేందుకు కనీసం 20 ఏళ్లు పడుతుంది’ అని సౌరవ్ నాటి రోజులు గుర్తు చేసుకున్నాడు. 1995–2006 మధ్య కాలంలో తన కెరీర్ అద్భుతంగా సాగిందని, ప్రపంచం తన పాదాల కింద ఉన్నట్లు అనిపించిందన్న దాదా...చాపెల్ రాకతో ఆ తర్వాత అంతా మారిపోయిందన్నాడు. వ్యక్తిగతంగా తాను కూడా నెమ్మదైన స్వభావం ఉన్నవాడినే అయినా కెప్టెనయ్యాక జట్టు కోసం కఠినంగా మారాల్సి వచ్చిందని సౌరవ్ చెప్పాడు. -
‘సెట్టింగ్’ చేయడం నా వల్ల కాలేదు!
►అందుకే కోచ్ పదవి దక్కలేదు ►సెహ్వాగ్ తీవ్ర వ్యాఖ్యలు న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు కోచ్ పదవికి తాను ఎంపిక కాకపోవడానికి బీసీసీఐలోని పెద్దల మద్దతు లేకపోవడమే కారణమని మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు. కోచ్‌గా దరఖాస్తు చేయాలని తాను అనుకోలేదని, రవిశాస్త్రి బరిలో ఉన్నాడని తెలిస్తే తాను అసలు ముందుకు రాకపోయేవాడినని అతను అన్నాడు. చాంపియన్స్ ట్రోఫీ తర్వాత భారత కోచ్ ఎంపిక కోసం బీసీసీఐకి దరఖాస్తులు చేసిన వారిలో వీరూ కూడా ఉన్నాడు. అయితే క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) ఇంటర్వ్యూ అనంతరం చివరకు రవిశాస్త్రి కోచ్‌గా ఎంపికయ్యారు. ‘భారత కోచ్‌ను ఎంపిక చేసే అధికారం ఉన్న పెద్దలతో నాకేమీ లోపాయికారీ ఒప్పందం లేదు. నేను అలా చేయలేకపోయాను. నేను ఎంపిక కాకపోవడానికి అదే కారణం’ అని సెహ్వాగ్ కుండ బద్దలు కొట్టినట్లు చెప్పాడు. భారత జట్టుకు కోచింగ్ ఇవ్వాలని తానెప్పుడూ అనుకోలేదని... అయితే బోర్డు కార్యదర్శి అమితాబ్ చౌదరి, జనరల్ మేనేజర్ ఎంవీ శ్రీధర్ తన వద్దకు వచ్చి దీనిపై ఆలోచించమంటూ విజ్ఞప్తి చేసిన తర్వాతే ముందుకు వెళ్లినట్లు వీరూ వెల్లడించాడు. ‘నిజానికి నాకు దీనిపై ఆసక్తి లేదు. ఆ తర్వాత నేను కోహ్లితో కూడా మాట్లాడాను. అతను కూడా దరఖాస్తు చేయమని చెప్పాడు. దాంతో నమ్మకం పెరిగింది. జట్టుకు నేను ఉపయోగపడగలనని భావించాను. భవిష్యత్తులో ఇంకెప్పుడూ ఆ ప్రయత్నం చేయను’ అని ఈ మాజీ ఓపెనర్ తన మనసులో మాటను చెప్పాడు. ‘చాంపియన్స్ ట్రోఫీ జరిగే సమయంలో గత ఏడాది చేసిన తప్పును పునరావృతం చేయనంటూ రవిశాస్త్రి కోచింగ్ పదవిపై అనాసక్తిని ప్రదర్శించారు. అందువల్ల నేను బరిలో నిలిచాను. రవిశాస్త్రి గనక దరఖాస్తు చేస్తున్నట్లు తెలిస్తే నేను అసలు అటువైపు వెళ్లకపోయేవాడిని’ అని సెహ్వాగ్ నాటి ఘటనను గుర్తు చేసుకున్నాడు. -
ఆరుగురిలో ఒకరు!
భారత క్రికెట్ జట్టు కోచ్ ఎంపిక కోసం నేడు ఇంటర్వ్యూలు రవిశాస్త్రికి మెరుగైన అవకాశాలు ముంబై: భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌ను ఎంపిక చేసేందుకు రంగం సిద్ధమైంది. అనిల్ కుంబ్లే అనూహ్య రాజీనామాతో ఏర్పడ్డ ఈ కీలక పదవిని భర్తీ చేయడం కోసం అభ్యర్థులకు నేడు ఇంటర్వ్యూలు జరుగనున్నాయి. సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ సభ్యులుగా ఉన్న క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) ఈ ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకోమంటూ బీసీసీఐ ఇచ్చిన ప్రకటనకు అనుగుణంగా మొత్తం పది మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రాథమిక వడబోత అనంతరం ఆరుగురు బరిలో నిలిచారు. ఈ ఆరుగురికి మాత్రమే ఇంటర్వ్యూలు జరుగుతాయి. దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ లాన్స్ క్లూస్నర్, భారత జట్టు మాజీ పేసర్ దొడ్డ గణేశ్, ఒమన్ జట్టుకు కోచ్‌గా ఉన్న రంజీ ట్రోఫీ మాజీ ఆటగాడు రాకేశ్ శర్మలతో పాటు ఎలాంటి క్రికెట్ నేపథ్యం లేని ఇంజినీర్ ఉపేంద్రనాథ్ బ్రహ్మచారి దరఖాస్తులను మాత్రం సీఏసీ ముందుగానే తిరస్కరించినట్లు సమాచారం. నేడు జరిగే ఇంటర్వ్యూలలో ఈ నలుగురిని పిలిచే అవకాశాలు దాదాపుగా లేవని బోర్డు ప్రతినిధి ఒకరు వెల్లడించారు. సెహ్వాగ్‌పై నమ్మకముందా! జగమెరిగిన భారత మాజీ ఆటగాడు రవి శాస్త్రి కుంబ్లేకు ముందు టీమ్ డైరెక్టర్‌గా మంచి ఫలితాలు రాబట్టారు. అన్నింటికి మించి ఇప్పుడు పెద్ద అర్హతగా కనిపిస్తున్న ‘కెప్టెన్‌తో సత్సంబంధాలు’ విషయంలో ఆయన అందరికంటే ముందున్నారు. కోహ్లితో సాన్నిహిత్యమే శాస్త్రికి కలిసొచ్చే అంశం. కోచ్ పదవి కోసం ముందుగా దరఖాస్తు చేయని ఆయన, తేదీ పొడిగించిన తర్వాత బరిలోకి వచ్చారు. గత ఏడాది కోచ్ ఇంటర్వ్యూల సమయంలో సీఏసీ సభ్యుడు గంగూలీతో బహిరంగంగా గొడవకు దిగినా... ఈసారి సచిన్ సూచనతోనే ముందుకు వచ్చానని చెబుతున్నారు కాబట్టి అది ఇప్పుడు సమస్య కాకపోవచ్చు. విధ్వంసకర బ్యాట్స్‌మన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్న వీరేంద్ర సెహ్వాగ్ కూడా ప్రధానంగా పోటీలో ఉన్నారు. సీఏసీ సభ్యులతో ఉన్న స్నేహం వీరూకు అదనపు అర్హతలా కనిపిస్తోంది. అయితే ఐపీఎల్లో మెంటార్‌గా పని చేయడం మినహా ప్రధాన కోచింగ్‌లో వీరూకు ఎలాంటి అనుభవం లేదు. అంతర్జాతీయ, దేశవాళీల్లో కోచ్‌గా చాలా మంచి రికార్డు ఉన్న టామ్ మూడీ (ఆస్ట్రేలియా), గతంలో అఫ్ఘానిస్తాన్, ఐర్లాండ్‌లకు కోచ్‌గా వ్యవహరించిన ఫిల్ సిమన్స్ (విండీస్), గతంలో పాక్, బంగ్లాదేశ్‌లకు కోచ్‌గా వ్యవహరించిన రిచర్డ్ పైబస్ (దక్షిణాఫ్రికా) కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 2007 టి20 ప్రపంచ కప్ గెలిచిన సమయంలో జట్టు మేనేజర్‌గా వ్యవహరించి, ఆ తర్వాత అఫ్ఘాన్ టీమ్‌తో మంచి ఫలితాలు రాబట్టిన లాల్‌చంద్ రాజ్‌పుత్ కూడా బరిలో నిలిచారు. నేరుగా కోచ్ పేరు ప్రకటన? మరోవైపు సరిగ్గా ఇంటర్వ్యూకు ముందు మరో కొత్త అంశం బోర్డులో చర్చకు వచ్చింది. అభ్యర్థులు అంతా తమ బయోడేటాలతో పాటు తమ ప్రణాళికలు కూడా స్పష్టంగా దరఖాస్తులోనే పంపించారు కాబట్టి మళ్లీ ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు చేయాల్సిన అవసరం లేదని, సీఏసీ సభ్యులు, బీసీసీఐతో చర్చించి నేరుగా కోచ్ పేరు ప్రకటించాలనే చర్చ తెరపైకి వచ్చింది. గత ఏడాది గంగూలీ, శాస్త్రి మధ్య జరిగిన రచ్చను దీనికి కారణంగా కొందరు చూపిస్తున్నారు. అయితే చివరి నిమిషంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కష్టం కాబట్టి షెడ్యూ ల్ ప్రకారం ఇంటర్వ్యూలు కొనసాగుతాయని బోర్డు ప్రతినిధి ఒకరు వెల్లడించారు. -
రవిశాస్త్రికే అవకాశాలు ఎక్కువ!
ముంబై: భారత క్రికెట్ జట్టు కోచ్‌గా ఎంపికయ్యే అవకాశాలు తన మాజీ సహచరుడు రవిశాస్త్రికే ఎక్కువగా ఉన్నాయని సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డారు. గతంలో టీమ్ డైరెక్టర్‌గా పని చేసిన సమయంలో శాస్త్రి పనితీరు కోచ్ పదవికి అదనపు అర్హత అని ఆయన అన్నారు. ‘2014లో భారత జట్టు ఇంగ్లండ్ చేతుల్లో చిత్తుగా ఓడిన తర్వాత టీమ్ డైరెక్టర్‌గా శాస్త్రి బాధ్యతలు చేపట్టాడు. అతని రాకతో ఒక్కసారిగా జట్టు రాత కూడా మారింది. అది జట్టుకు కీలక మలుపు. అతను ఇప్పుడు అధికారికంగా దరఖాస్తు చేశాడు కాబట్టి కచ్చితంగా శాస్త్రినే ఎంపిక కావచ్చు’ అని గావస్కర్ వ్యాఖ్యానించారు. కోచ్ పదవికి రవిశాస్త్రితో పాటు సెహ్వాగ్, టామ్ మూడీ, సిమన్స్, రాజ్‌పుత్, పైబస్, దొడ్డ గణేశ్, వెంకటేశ్ ప్రసాద్ కూడా పోటీలో ఉన్నారు. -
టీమిండియా కోచ్ ఎవరు?
రేపే కీలక ఇంటర్వ్యూ కోల్‌కతా: భారత్ క్రికెట్ జట్టు కోచ్ ఎంపిక కోసం కీలకమైన ఇంటర్వ్యూలు మంగళవారం కోల్‌కతాలో జరుగనున్నాయి. ప్రతిష్టాత్మకమైన ఈ పదవి కోసం భారత క్రికెట్ దిగ్గజాలు అనిల్ కుంబ్లే, రవిశాస్త్రి, సందిప్ పాటిల్‌తోపాటు పలువురు పోటీపడుతున్న సంగతి తెలిసిందే. మంగళవారం జరగనున్న ఇంటర్వ్యూకు కుంబ్లే, రవిశాస్త్రి, పాటిల్ హాజరు కానున్నారు. సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్‌తో కూడిన బీసీసీఐ సలహా కమిటీ ఈ ఇంటర్వ్యూలను నిర్వహించనున్నది. షార్ట్‌లిస్ట్ చేసిన 21 మంది అభ్యర్థులు కోచ్ పదవి కోసం ఇంటర్వ్యూకు హాజరుకానున్నారు. ప్రస్తుతం లండన్‌లో ఉన్న సచిన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ ఇంటర్వ్యూలో పాల్గొంటారు. -
తెరమీదకు లాంగర్ పేరు
న్యూఢిల్లీ : భారత క్రికెట్ జట్టు కోచ్ పదవికి ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ జస్టిన్ లాంగర్ పేరు తెరపైకి వచ్చింది. ఫ్లెచర్ వారసుడిగా అతను పగ్గాలు స్వీకరించే అవకాశాలున్నాయని ఓ కథనం చక్కర్లు కొడుతోంది. గతంలో ఆసీస్ జాతీయ జట్టుకు బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా పని చేసిన లాంగర్.. ప్రస్తుతం వెస్ట్రన్ ఆస్ట్రేలియా జట్టుకు ఛీప్ కోచ్‌గా పని చేస్తున్నారు. ఆసీస్ తరఫున 105 టెస్టుల్లో 7696 పరుగులు చేసిన లాంగర్‌కు మంచి వ్యూహకర్తగా పేరుంది. మరోవైపు జింబాబ్వే మాజీ ప్లేయర్ ఆండీ ఫ్లవర్ పేరు కూడా వినబడుతోంది. ఈ ఇద్దరి గురించి బీసీసీఐలోని ఉన్నతస్థాయి వ్యక్తులు చర్చించినట్లు సమాచారం. -
ద్రవిడ్ మనసులో ఏముంది?
► కోచ్ పదవిపై తర్జనభర్జన ► వస్తే చూద్దాం... అంటూ మెలిక ముంబై : గత పదిహేనేళ్లుగా భారత క్రికెట్ జట్టు కోచ్‌గా విదేశీయులే ఉన్నారు. ఇప్పుడు భారతీయుడే కోచ్‌గా రావాలని డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అందరి దృష్టి రాహుల్ ద్రవిడ్‌పైనే ఉంది. బ్యాటింగ్ దిగ్గజం, క్రికెట్ మేధావి, సౌమ్యుడు, అందరూ గౌరవించే వ్యక్తి... ఈ అర్హతలన్నీ అతనికి సరిగ్గా సరిపోతాయి. అయితే అసలు ద్రవిడ్ ఆలోచనలు ఎలా ఉన్నాయో మాత్రం ఎవరికీ అంతుపట్టడం లేదు. ఏడాది క్రితం ‘కోచ్ పదవి అంటే చాలా బాధ్యతతో కూడుకున్నది. ఏడాదిలో కనీసం 11 నెలలు ఆటకు అంకితం కావాలి. నాకంత సమయం లేదు’ అంటూ అతను దీనికి దూరంగా ఉన్నాడు. అయితే ఆ తర్వాతైనా కామెంటరీతోనో, ఐపీఎల్‌తోనే అతను క్రికెట్‌తో అనుబంధం కొనసాగిస్తూనే ఉన్నాడు. కాబట్టి ఇకపై సమయం అన్నది సమస్య కాకపోవచ్చు. హోదాతో పాటు చెల్లింపులపరంగా చూసినా పైవాటితో పోలిస్తే భారత కోచ్ పదవి ఎంతో కీలకమైంది. ఇప్పుడు అతని తాజా వ్యాఖ్య ఈ పదవిపై ద్రవిడ్ ఆసక్తిని సూచిస్తోంది. ‘ఇప్పుడే భారత కోచ్ పదవి గురించి ఆలోచించడం లేదు. అయితే నా దాకా వస్తే ఆలోచిద్దాం. ఎందుకంటే వంతెన దగ్గరకు వెళ్లాకే ఎలా దాటాలో ఆలోచించడం నా నైజం’ అని తన ఇష్టాన్ని చూచాయగా చెప్పాడు. మరో వైపు భారత క్రికెట్ సలహాదారులుగా ఉండాలంటూ బోర్డు ద్రవిడ్‌తో పాటు సచిన్, గంగూలీలకు కూడా విజ్ఞప్తి చేసింది. కోచ్‌ను ఎంపిక చేసే కమిటీలో కూడా వీరున్నారు. అయితే బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ నోటిమాటగా చెప్పడం తప్ప దీనిపై ఇంకా అధికారిక ఉత్తర్వులు లేవు. ద్రవిడ్ కూడా ఇదే విషయాన్ని చెప్పాడు. కాబట్టి ‘సలహాదారు’ ఆలోచననుంచి బయటికి వచ్చి పూర్తి స్థాయి కోచ్ కావడాన్నే అతను ఇష్టపడుతున్నట్లు సమాచారం. ఈ నెలాఖరులోగా కోచ్‌ను ఎంపిక చేయాల్సి ఉంది. -
ఎవరికిస్తారు పగ్గాలు?
♦ భారత క్రికెట్ జట్టు కోచ్ రేసులో గంగూలీ, ద్రవిడ్ ♦ డెరైక్టర్‌గా కొనసాగాలనుకుంటున్న శాస్త్రి ♦ ఆసక్తికరంగా కొత్త కోచ్ ఎంపిక ముంబై : భారత క్రికెట్ కోచ్ పగ్గాలు చేపట్టబోయేది ఎవరు? ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ ఇది. డంకన్ ఫ్లెచర్ పదవీకాలం ముగియడంతో రాబోయే సీజన్‌కు కొత్త కోచ్‌ను నియమించాలి. ఈ పదవి కోసం అందరికంటే ఎక్కువగా గంగూలీ ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. అయితే ద్రవిడ్‌ను కోచ్‌ను చేయాలని బీసీసీఐలోని పెద్దలు కొందరు భావిస్తున్నారు. ఇలాంటి పెద్ద క్రికెటర్లు కాకుండా బంగర్ లేదా ప్రవీణ్ ఆమ్రేలాంటి లో ప్రొఫైల్ కోచ్ ను నియమించి టీమ్ డెరైక్టర్‌గా రవిశాస్త్రిని కొనసాగించాలనేది మరో ప్రతిపాదన. ► భారత జట్టు కోచ్ కోసం తొలుత బీసీసీఐ ప్రకటన చేయాలి. ఆసక్తి ఉన్న వాళ్లంతా ఈ పదవి కోసం అప్లికేషన్ పెట్టాలి. ఆ తర్వాత కోచ్‌గా తమ పనితీరు ఎలా ఉండబోతోందనే ప్రజెంటేషన్ ఇవ్వాలి. దీని తర్వాత బీసీసీఐ అధికారులు, మాజీ కెప్టెన్లు కలిసి చేసే ఇంటర్వ్యూలో పాసవ్వాలి. కాబట్టి కోచ్ ఎంపిక పెద్ద తతంగం. ► కోచ్ పదవి కోసం మాజీ కెప్టెన్ గంగూలీ అమితాసక్తి కనబరుస్తున్నట్లు తెలిసింది. బీసీసీఐ కొత్త అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియాను కలిసి బెంగాల్ టైగర్ ఇప్పటికే దీని గురించి చర్చించాడు. అయితే దాల్మియా నుంచి ప్రస్తుతానికి దాదాకు ఎలాంటి హామీ రాలేదు. అయితే తనకు క్రికెట్ రాజకీయాలపై ఆసక్తి ఉందని, కోచ్ పదవిపై ఆసక్తిలేదని గంగూలీ చెప్పినట్లు కూడా కథనాలు వినిపిస్తున్నాయి. ► రాజస్తాన్ రాయల్స్ మెంటార్‌గా అద్భుతమైన విజయాలతో ద్రవిడ్ కోచ్ పదవికి సరిపోతానని ఇప్పటికే నిరూపించుకున్నాడు. ఎలాంటి వివాదాలు లేని వ్యక్తిగా ద్రవిడ్ భారత జట్టు కోచ్‌కు అసలైన అర్హుడంటూ బీసీసీఐలోని కొందరు పెద్దలు అంటున్నారు. ద్రవిడ్‌తో మాట్లాడి కోచ్ పదవికి అప్లికేషన్ ఇప్పించాలని వీళ్ల ఆలోచన. ► ద్రవిడ్, గంగూలీలలో ఎవరు కోచ్‌గా వచ్చినా ప్రస్తుతం ఉన్న వ్యవస్థ మారుతుంది. ప్రస్తుతం జట్టుకు డెరైక్టర్‌గా రవిశాస్త్రి ఉన్నారు. పెత్తనం అంతా ఆయనదే. ఈ ఇద్దరిలో ఎవరు కోచ్ అయినా దీనికి ఒప్పుకోరు. కాబట్టి అప్పుడు డెరైక్టర్ పదవిని రద్దు చేయాలి. ► రవిశాస్త్రి కూడా డెరైక్టర్ పదవిలో కొనసాగాలనే ఆసక్తితో ఉన్నట్లు సమాచారం. సంజయ్ బంగర్ లేదా ప్రవీణ్ ఆమ్రేలలో ఒకరిని కోచ్‌గా చేసి రవిశాస్త్రి టీమ్ డెరైక్టర్‌గా కొనసాగడం ఓ ప్రత్యామ్నాయం. ► ప్రస్తుతం అందరూ ఐపీఎల్‌తో బిజీగా ఉన్నారు. అయితే ఈ టోర్నీ ముగిశా క కూడా భారత జట్టుకు రెండు నెలల పాటు టోర్నీలు లేవు. కాబట్టి కోచ్ ఎంపికపై తొందరపాటు లేకుండా బీసీసీఐ ఆచితూచి వ్యవహరించే అవకాశం ఉంది.