ఆరుగురిలో ఒకరు!
భారత క్రికెట్ జట్టు కోచ్ ఎంపిక
కోసం నేడు ఇంటర్వ్యూలు
రవిశాస్త్రికి మెరుగైన అవకాశాలు
ముంబై: భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌ను ఎంపిక చేసేందుకు రంగం సిద్ధమైంది. అనిల్ కుంబ్లే అనూహ్య రాజీనామాతో ఏర్పడ్డ ఈ కీలక పదవిని భర్తీ చేయడం కోసం అభ్యర్థులకు నేడు ఇంటర్వ్యూలు జరుగనున్నాయి. సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ సభ్యులుగా ఉన్న క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) ఈ ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకోమంటూ బీసీసీఐ ఇచ్చిన ప్రకటనకు అనుగుణంగా మొత్తం పది మంది దరఖాస్తు చేసుకున్నారు.
అయితే ప్రాథమిక వడబోత అనంతరం ఆరుగురు బరిలో నిలిచారు. ఈ ఆరుగురికి మాత్రమే ఇంటర్వ్యూలు జరుగుతాయి. దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ లాన్స్ క్లూస్‌నర్, భారత జట్టు మాజీ పేసర్ దొడ్డ గణేశ్, ఒమన్ జట్టుకు కోచ్‌గా ఉన్న రంజీ ట్రోఫీ మాజీ ఆటగాడు రాకేశ్ శర్మలతో పాటు ఎలాంటి క్రికెట్ నేపథ్యం లేని ఇంజినీర్ ఉపేంద్రనాథ్ బ్రహ్మచారి దరఖాస్తులను మాత్రం సీఏసీ ముందుగానే తిరస్కరించినట్లు సమాచారం. నేడు జరిగే ఇంటర్వ్యూలలో ఈ నలుగురిని పిలిచే అవకాశాలు దాదాపుగా లేవని బోర్డు ప్రతినిధి ఒకరు వెల్లడించారు.
సెహ్వాగ్‌పై నమ్మకముందా!
జగమెరిగిన భారత మాజీ ఆటగాడు రవి శాస్త్రి కుంబ్లేకు ముందు టీమ్ డైరెక్టర్‌గా మంచి ఫలితాలు రాబట్టారు. అన్నింటికి మించి ఇప్పుడు పెద్ద అర్హతగా కనిపిస్తున్న ‘కెప్టెన్‌తో సత్సంబంధాలు’ విషయంలో ఆయన అందరికంటే ముందున్నారు. కోహ్లితో సాన్నిహిత్యమే శాస్త్రికి కలిసొచ్చే అంశం. కోచ్ పదవి కోసం ముందుగా దరఖాస్తు చేయని ఆయన, తేదీ పొడిగించిన తర్వాత బరిలోకి వచ్చారు. గత ఏడాది కోచ్ ఇంటర్వ్యూల సమయంలో సీఏసీ సభ్యుడు గంగూలీతో బహిరంగంగా గొడవకు దిగినా... ఈసారి సచిన్ సూచనతోనే ముందుకు వచ్చానని చెబుతున్నారు కాబట్టి అది ఇప్పుడు సమస్య కాకపోవచ్చు.
విధ్వంసకర బ్యాట్స్‌మన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్న వీరేంద్ర సెహ్వాగ్ కూడా ప్రధానంగా పోటీలో ఉన్నారు. సీఏసీ సభ్యులతో ఉన్న స్నేహం వీరూకు అదనపు అర్హతలా కనిపిస్తోంది. అయితే ఐపీఎల్‌లో మెంటార్‌గా పని చేయడం మినహా ప్రధాన కోచింగ్‌లో వీరూకు ఎలాంటి అనుభవం లేదు. అంతర్జాతీయ, దేశవాళీల్లో కోచ్‌గా చాలా మంచి రికార్డు ఉన్న టామ్ మూడీ (ఆస్ట్రేలియా), గతంలో అఫ్ఘానిస్తాన్, ఐర్లాండ్‌లకు కోచ్‌గా వ్యవహరించిన ఫిల్ సిమన్స్ (విండీస్), గతంలో పాక్, బంగ్లాదేశ్‌లకు కోచ్‌గా వ్యవహరించిన రిచర్డ్ పైబస్ (దక్షిణాఫ్రికా) కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 2007 టి20 ప్రపంచ కప్ గెలిచిన సమయంలో జట్టు మేనేజర్‌గా వ్యవహరించి, ఆ తర్వాత అఫ్ఘాన్ టీమ్‌తో మంచి ఫలితాలు రాబట్టిన లాల్‌చంద్ రాజ్‌పుత్ కూడా బరిలో నిలిచారు.
నేరుగా కోచ్ పేరు ప్రకటన?
మరోవైపు సరిగ్గా ఇంటర్వ్యూకు ముందు మరో కొత్త అంశం బోర్డులో చర్చకు వచ్చింది. అభ్యర్థులు అంతా తమ బయోడేటాలతో పాటు తమ ప్రణాళికలు కూడా స్పష్టంగా దరఖాస్తులోనే పంపించారు కాబట్టి మళ్లీ ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు చేయాల్సిన అవసరం లేదని, సీఏసీ సభ్యులు, బీసీసీఐతో చర్చించి నేరుగా కోచ్ పేరు ప్రకటించాలనే చర్చ తెరపైకి వచ్చింది. గత ఏడాది గంగూలీ, శాస్త్రి మధ్య జరిగిన రచ్చను దీనికి కారణంగా కొందరు చూపిస్తున్నారు. అయితే చివరి నిమిషంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కష్టం కాబట్టి షెడ్యూ ల్ ప్రకారం ఇంటర్వ్యూలు కొనసాగుతాయని బోర్డు ప్రతినిధి ఒకరు వెల్లడించారు.