ద్రవిడ్ మనసులో ఏముంది?
► కోచ్ పదవిపై తర్జనభర్జన
► వస్తే చూద్దాం... అంటూ మెలిక
ముంబై : గత పదిహేనేళ్లుగా భారత క్రికెట్ జట్టు కోచ్‌గా విదేశీయులే ఉన్నారు. ఇప్పుడు భారతీయుడే కోచ్‌గా రావాలని డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అందరి దృష్టి రాహుల్ ద్రవిడ్‌పైనే ఉంది. బ్యాటింగ్ దిగ్గజం, క్రికెట్ మేధావి, సౌమ్యుడు, అందరూ గౌరవించే వ్యక్తి... ఈ అర్హతలన్నీ అతనికి సరిగ్గా సరిపోతాయి. అయితే అసలు ద్రవిడ్ ఆలోచనలు ఎలా ఉన్నాయో మాత్రం ఎవరికీ అంతుపట్టడం లేదు. ఏడాది క్రితం ‘కోచ్ పదవి అంటే చాలా బాధ్యతతో కూడుకున్నది.
ఏడాదిలో కనీసం 11 నెలలు ఆటకు అంకితం కావాలి. నాకంత సమయం లేదు’ అంటూ అతను దీనికి దూరంగా ఉన్నాడు. అయితే ఆ తర్వాతైనా కామెంటరీతోనో, ఐపీఎల్‌తోనే అతను క్రికెట్‌తో అనుబంధం కొనసాగిస్తూనే ఉన్నాడు. కాబట్టి ఇకపై సమయం అన్నది సమస్య కాకపోవచ్చు. హోదాతో పాటు చెల్లింపులపరంగా చూసినా పైవాటితో పోలిస్తే భారత కోచ్ పదవి ఎంతో కీలకమైంది. ఇప్పుడు అతని తాజా వ్యాఖ్య ఈ పదవిపై ద్రవిడ్ ఆసక్తిని సూచిస్తోంది. ‘ఇప్పుడే భారత కోచ్ పదవి గురించి ఆలోచించడం లేదు. అయితే నా దాకా వస్తే ఆలోచిద్దాం.
ఎందుకంటే వంతెన దగ్గరకు వెళ్లాకే ఎలా దాటాలో ఆలోచించడం నా నైజం’ అని తన ఇష్టాన్ని చూచాయగా చెప్పాడు. మరో వైపు భారత క్రికెట్ సలహాదారులుగా ఉండాలంటూ బోర్డు ద్రవిడ్‌తో పాటు సచిన్, గంగూలీలకు కూడా విజ్ఞప్తి చేసింది. కోచ్‌ను ఎంపిక చేసే కమిటీలో కూడా వీరున్నారు. అయితే బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ నోటిమాటగా చెప్పడం తప్ప దీనిపై ఇంకా అధికారిక ఉత్తర్వులు లేవు. ద్రవిడ్ కూడా ఇదే విషయాన్ని చెప్పాడు. కాబట్టి ‘సలహాదారు’ ఆలోచననుంచి బయటికి వచ్చి పూర్తి స్థాయి కోచ్ కావడాన్నే అతను ఇష్టపడుతున్నట్లు సమాచారం. ఈ నెలాఖరులోగా కోచ్‌ను ఎంపిక చేయాల్సి ఉంది.