‘మిథాలీ మేనియా’
►మహిళల వన్డే క్రికెట్‌లో అలుపెరుగని రన్ మెషిన్
►కెరీర్‌లో అత్యధిక పరుగులతో ప్రపంచ రికార్డు
చెన్నైలో జరిగే అఖిల భారత నృత్యోత్సవంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఒక బృందం పోటీ పడుతోంది. దాని కోసం డ్యాన్సర్ల ఎంపిక, రిహార్సల్స్ అన్నీ అయిపోయాయి. ఇంకో రెండు రోజుల్లో బయల్దేరాల్సి ఉంది. అంతకు కొద్ది రోజుల క్రితమే ఏపీ రాష్ట్ర బృందం ముఖ్యమంత్రి సమక్షంలో ప్రదర్శన కూడా ఇచ్చి తమ సన్నాహాలు అద్భుతంగా పూర్తి చేసింది. మరోవైపు సరిగ్గా అదే తేదీల్లో బెంగళూరులో అమ్మాయిల ఇంటర్ స్టేట్ క్రికెట్ చాంపియన్‌షిప్ జరుగుతోంది. దానికి కూడా ఏపీ టీమ్ సెలక్షన్ పూర్తయింది. ఈ రెండు రాష్ట్ర జట్లలోనూ టీనేజర్ మిథాలీ రాజ్ ఉంది. తనకు డ్యాన్స్ ఇష్టం. నాన్నకు క్రికెట్ అంటే ప్రాణం. ఆయన కోసమే ఆటను నేర్చుకుంది. ఇప్పుడు తన భవిష్యత్తు ఏమిటో తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. ఆ వయసులో మిథాలీ తీసుకున్న నిర్ణయం భారత మహిళల క్రికెట్‌కు ఒక అద్భుతాన్ని అందించింది. తర్వాతి రోజుల్లో ప్రత్యర్థి బౌలర్లు, ఫీల్డర్లతో భరత నాట్యం ఆడించింది.
సాక్షి క్రీడా విభాగం :‘నాకు మీ అమ్మాయి విషయంలో మీ తల్లిదండ్రులిద్దరి సంపూర్ణ మద్దతు కావాలి. సరిగ్గా చెప్పాలంటే నన్ను గుడ్డిగా నమ్మాలి. 14 ఏళ్ల వయసు వచ్చేసరికి నేను మిథాలీని భారత్ తరఫున ఆడేలా తీర్చిదిద్దగలను’... కోచ్ సంపత్ కుమార్ ఇచ్చిన హామీ ఇది. అయితే మిథాలీ కుటుంబ సభ్యులకు ఇది చాలా అతిగా అనిపించింది. తమ అమ్మాయిపై వారికి నమ్మకమున్నా... నాటి రోజుల్లో మనుగడే కష్టంగా ఉన్న మహిళల క్రికెట్‌లోకి పంపించడం అంటే పెద్ద సాహసం చేసినట్లే. ‘చాలా మంది సౌతిండియన్ తల్లిదండ్రుల్లా మేం కూడా అమ్మాయి బాగా చదువుకొని ఏ డాక్టరో, ఇంజినీరో కావాలనుకున్నాం’ అని మిథాలీ తల్లి లీలా నాటి రోజులను గుర్తు చేసుకున్నారు. చివరకు కోచ్ మాటే నెగ్గింది.
14 ఏళ్లు లక్ష్యంగా పెట్టుకుంటే కనీసం 16 ఏళ్లకైనా భారత్‌కు ఆడుతుందని సంపత్ కుమార్ నమ్మారు. దాని కోసం తానూ కష్టపడ్డారు, మిథాలీని కూడా కష్టపెడుతూ అన్ని అంశాల్లో ఆమెను తీర్చిదిద్దారు. అయితే క్రికెట్‌లో ఓనమాలు నేర్పించిన ఆ గురువు తన శిష్యురాలి పురోగతిని మాత్రం చూడలేకపోయారు. 1997లో మిథాలీ వరల్డ్ కప్ ప్రాబబుల్స్ టీమ్‌లోకి ఎంపికైన సమయంలో ఒక రోడ్డు ప్రమాదంలో ఆయన చనిపోయారు. దీని నుంచి కోలుకొని మళ్లీ ఆటపై దృష్టి పెట్టేందుకు మిథాలీకి చాలా సమయం పట్టింది. కోచ్ ఆశించినట్లుగానే 16 ఏళ్ల 205 రోజుల వయసులోనే భారత్ తరఫున తొలి వన్డే ఆడిన మిథాలీ సెంచరీతో చెలరేగింది. అతి పిన్న వయసులో సెంచరీ సాధించిన ఆ రికార్డు ఇప్పటికీ చెక్కు చెదరలేదు.
పరిమిత శిక్షణ అవకాశాలు, మ్యాచ్‌ల సంఖ్య చాలా తక్కువ, కనీసం రోజువారీ ఖర్చులకు కూడా డబ్బులు ఇవ్వని స్థితి మహిళా క్రికెట్‌ది. అయినా ఆడుతున్న వారిని అప్పుడు కొందరు పిచ్చివాళ్లలా చూశారు. మిథాలీ దీనిని సానుకూలంగానే తీసుకుంది. ‘నిజమే, మాకు క్రికెట్ అంటే పిచ్చి ప్రేమ ఉంది కాబట్టే ఆడుతున్నాం’ అని జవాబిచ్చింది. 2002లో మిథాలీ టాంటన్‌లో చారిత్రాత్మక డబుల్ సెంచరీ చేసిన సమయంలో కనీసం అక్కడ స్కోర్ బోర్డు కూడా అందుబాటులో లేదు. టీమ్‌మేట్ నౌషీన్ బౌండరీ బయట నుంచి చేసిన సైగలతోనే తాను ఎన్ని పరుగులు చేశానో తెలుసుకోవాల్సి వచ్చింది. అలాంటివి మిథాలీ కెరీర్‌లో చాలా ఉన్నాయి.
2005 వన్డే వరల్డ్ కప్‌లో మిథాలీ నాయకత్వంలో భారత జట్టు ఫైనల్ చేరడం మహిళల క్రికెట్ ముఖ చిత్రాన్ని మార్చింది. వేద కృష్ణమూర్తి, స్మృతి మంధన, హర్మన్‌ప్రీత్ కౌర్... ఒకరా, ఇద్దరా ఎంతో మంది క్రికెట్ వైపు చూసేందుకు ఆమె స్ఫూర్తిగా నిలిచింది. అయితే ఇప్పుడు వీరందరితో కలిసి ఆడుతున్న మిథాలీ రాజ్, దాదాపు పదేళ్ల క్రితమే 25 ఏళ్ల వయసులో వరుస గాయాలు, వైఫల్యాల కారణంగా క్రికెట్‌ను ముగించాలని భావించింది. ఒక దశలో మైదానంలో కంటే ఫిజియో వద్దనే ఆమె ఎక్కువగా కనిపించింది. వయసు ‘పెరిగిపోతోంది’ కాబట్టి పెళ్లి చేసుకోమంటూ ఒత్తిడి మొదలైంది. అయితే మానసికంగా దృఢంగా మారి మరింత పట్టుదలతో మిథాలీ పైకెగసింది. ఇప్పుడు రికార్డుల రారాణిగా గుర్తింపు తెచ్చుకుంది. ‘నేను ఆ సమయంలో పెళ్లి చేసుకోకపోవడం మంచిదైంది. అదే జరిగితే నేను ఇంత కాలం ఆడేదాన్ని కాదు. ఇన్ని ఘనతలు సాధించేదాన్ని కాదు. సరైన వ్యక్తి దొరికే వరకు పెళ్లి గురించి ఆలోచన లేదు. ఈ విషయంలో ఎవరికీ జవాబు చెప్పాల్సిన అవసరం లేదు’ అని మిథాలీ తన వ్యక్తిత్వాన్ని ప్రదర్శించింది. మరి కొంత కాలం తన క్రికెట్ నైపుణ్యాన్ని ప్రదర్శించాలని భావిస్తున్న మిథాలీ కెరీర్ అందరికీ మళ్లీ మళ్లీ చెప్పాల్సిన స్ఫూర్తిగాథ. భారత నీలి రంగు డ్రెస్సులో ఆమె ‘ఎవర్‌గ్రీన్’ స్టార్ అనడంలో సందేహం లేదు.
నో ఎగ్జామ్స్...
మిథాలీ రాజ్ ప్రస్తుతం ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీలో ఎంఏ (స్పోర్ట్స్ సైకాలజీ)లో చదువుతోంది. జూన్‌లో మొదటి ఏడాది పరీక్షలకు ఆమె హాజరు కావాల్సి ఉంది. అయితే వరల్డ్ కప్ కారణంగా ఆమె ఈ ఏడాది పరీక్షలకు దూరమైంది.
‘నాకు చాలా గర్వంగా ఉంది. నేనే రికార్డు సాధించినంతగా సంబరపడిపోతున్నాను. గాల్లో తేలిపోతున్నట్లుగా అనిపిస్తుంది. ఎన్ని సమస్యలు, ఇబ్బందులు... మిథాలీ ఆట మొదలు పెట్టిన రోజులు గుర్తు చేసుకుంటే ఒక కలలా అనిపిస్తోంది. ఇప్పుడు ఆమె ఈ స్థాయికి చేరిన తర్వాత ఈ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను. ఏ దశలోనూ మేం క్రికెట్‌లో డబ్బు లేదనే ఆలోచన అమ్మాయికి రానీయలేదు. నీకు నచ్చినంత వరకు ఆడమనే ప్రోత్సహించాం. అదే ఈ ఫలితాలు అందించింది’
– దొరైరాజ్, మిథాలీ తండ్రి