Womens One Day Cricket
-
మెగ్ లానింగ్ మళ్లీ నంబర్‌వన్
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా ప్రకటించిన మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ మెగ్ లానింగ్ మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. నాలుగు స్థానాలు ఎగబాకిన మెగ్ లానింగ్ 749 రేటింగ్ పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. న్యూజిలాండ్‌తో బుధవారం ముగిసిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో రాణించిన లానింగ్... సెంచరీతో సహా మొత్తం 163 పరుగులు చేసి సిరీస్‌ను ఆసీస్ కైవసం చేసుకోవడంలో ముఖ్యపాత్ర పోషించింది. నంబర్‌వన్ ర్యాంక్‌ను చేజిక్కించుకోవడం లానింగ్‌కు ఇది ఐదోసారి. అంతేకాకుండా ఆమె టాప్ ర్యాంకులో 902 రోజులను పూర్తి చేసుకోవడం విశేషం. లానింగ్ తొలిసారి 2014లో టాప్ ర్యాంక్‌కు చేరుకుంది. వెస్టిండీస్ ప్లేయర్ స్టెఫానీ టేలర్, అలీసా హీలీ వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (732 రేటింగ్ పాయింట్లు) నాలుగో స్థానంలో... సారథి మిథాలీ రాజ్ పదో స్థానంలో నిలిచారు. బౌలింగ్ విభాగంలో ఆసీస్ స్పిన్నర్ జెస్సికా తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. భారత బౌలర్లలో జులన్ గోస్వామి, పూనమ్ యాదవ్, శిఖా పాండే, దీప్తి శర్మలు వరుసగా ఐదు, ఆరు, ఏడు, పది స్థానాల్లో ఉన్నారు. టీమ్ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా తొలి స్థానంలో కొనసాగుతుంది. భారత్ రెండో స్థానంలో ఉంది. -
ఆంధ్రను గెలిపించిన జ్యోతి
సాక్షి, గుంటూరు వెస్ట్: బీసీసీఐ సీనియర్ మహిళల వన్డే క్రికెట్ టోర్నమెంట్లో ఆంధ్ర జట్టు జోరు కొనసాగుతోంది. చత్తీస్‌గఢ్‌తో సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర రెండు వికెట్ల తేడాతో నెగ్గి ఈ టోర్నీలో నాలుగో విజయం నమోదు చేసింది. కె. జ్యోతి ఆల్‌రౌండ్ ప్రదర్శన (3/25; 13 నాటౌట్)తో ఆంధ్ర జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన చత్తీస్‌గఢ్ 44.2 ఓవర్లలో 93 పరుగులకు ఆలౌటైంది. జ్యోతితోపాటు పుష్పలత (3/18) కూడా మూడు వికెట్లు పడగొట్టింది. అంజలి శర్వాణి, సీహెచ్ ఝాన్సీ లక్ష్మిలకు ఒక్కో వికెట్ దక్కింది. 94 పరుగుల విజయలక్ష్యాన్ని ఆంధ్ర 36.4 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి అధిగమించింది. 63 పరుగులకు 8 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆంధ్ర జట్టును హిమబిందు (15 నాటౌట్), కె.జ్యోతి (13 నాటౌట్) గట్టెక్కించారు. వీరిద్దరు తొమ్మిదో వికెట్‌కు అభేద్యంగా 31 పరుగులు జతచేసి ఆంధ్ర జట్టును గెలిపించారు. ఇతర మ్యాచ్‌ల్లో పంజాబ్‌పై రైల్వేస్ తొమ్మిది వికెట్ల తేడాతో... గోవా 12 పరుగుల తేడాతో మహారాష్ట్రపై విజయం సాధించాయి. -
ఆంధ్రకు మూడో గెలుపు
సాక్షి, గుంటూరు వెస్ట్: బ్యాటింగ్‌లో అనూష, స్నేహ... బౌలింగ్‌లో జ్యోతి (2/23) అద్భుత ప్రతిభ కారణంగా బీసీసీఐ సీనియర్ మహిళల వన్డే క్రికెట్ టోర్నమెంట్లో ఆంధ్ర జట్టు మూడో విజయం సాధించింది. హరియాణాతో శనివారం జరిగిన నాలుగో లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర ఆరు పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర జట్టు 50 ఓవర్లలో నాలుగు వికెట్లకు 219 పరుగులు చేసింది. ఓపెనర్ అనూష (72; 5 ఫోర్లు) రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగ్గా... స్నేహ (34 బంతుల్లో 45 నాటౌట్; 6 ఫోర్లు), సీహెచ్ ఝాన్సీ లక్ష్మి (42 బంతుల్లో 31; 5 ఫోర్లు) రాణించారు. అనంతరం 220 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హరియాణా 50 ఓవర్లలో ఐదు వికెట్లకు 213 పరుగులు చేసి ఓడిపోయింది. ఇన్నింగ్స్ చివరి ఓవర్ వేసిన జ్యోతి చివరి మూడు బంతులకు ఒక్క పరుగు ఇవ్వకుండా క్రీజులో నిలదొక్కుకున్న సోనియా (44 బంతుల్లో 35; 3 ఫోర్లు), శీతల్ (67 బంతుల్లో 59; 7 ఫోర్లు) లను ఔట్ చేసి ఆంధ్ర విజయాన్ని ఖాయం చేయడం విశేషం. హరియాణా 136 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయిన దశలో సోనియా, శీతల్ నాలుగో వికెట్‌కు 77 పరుగులు జతచేసి తమ జట్టును లక్ష్యం సమీపానికి తెచ్చారు. అయితే జ్యోతి అద్భుత బౌలింగ్‌తో హరియాణా లక్ష్యానికి చేరువై దూరమైపోయింది. ఇతర మ్యాచ్‌ల్లో మహారాష్ట్ర ఏడు వికెట్లతో సౌరాష్ట్రపై; విదర్భ 77 పరుగులతో గోవాపై గెలిచాయి. -
రైల్వేస్‌కు మూడో విజయం
సాక్షి, గుంటూరు వెస్ట్: బీసీసీఐ సీనియర్ మహిళల వన్డే క్రికెట్ టోర్నమెంట్లో రైల్వేస్ జట్టు వరుసగా మూడో విజయంతో ‘హ్యాట్రిక్’ నమోదు చేసింది. మహారాష్ట్రతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో రైల్వేస్ 52 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన రైల్వేస్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 231 పరుగులు చేసింది. వేద కృష్ణమూర్తి (80 బంతుల్లో 80; 8 ఫోర్లు, సిక్స్), హైదరాబాద్ అమ్మాయి అరుంధతి రెడ్డి (27 బంతుల్లో 48 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) దూకుడుగా ఆడారు. కెప్టెన్ మిథాలీ రాజ్ 29 బంతుల్లో 11 పరుగులు చేసింది. ఆరో వికెట్‌కు వేద, అరుంధతి కలిసి ఆరు ఓవర్లలో 61 పరుగులు జోడించడం విశేషం. 232 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మహారాష్ట్ర 50 ఓవర్లలో 7 వికెట్లకు 179 పరుగులు చేసి ఓడిపోయింది. రైల్వేస్ బౌలర్లలో పూనమ్ యాదవ్ 46 పరుగులిచ్చి 3 వికెట్లు... ఏక్తా బిష్త్ 28 పరుగులిచ్చి 2 వికెట్లు తీశారు. సౌరాష్ట్రతో జరిగిన మరో మ్యాచ్‌లో పంజాబ్ 91 పరుగుల తేడాతో... గోవాతో జరిగిన మ్యాచ్‌లో చత్తీస్‌గఢ్ 26 పరుగుల తేడాతో విజయం సాధించాయి. -
‘మిథాలీ మేనియా’
►మహిళల వన్డే క్రికెట్లో అలుపెరుగని రన్ మెషిన్ ►కెరీర్లో అత్యధిక పరుగులతో ప్రపంచ రికార్డు చెన్నైలో జరిగే అఖిల భారత నృత్యోత్సవంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఒక బృందం పోటీ పడుతోంది. దాని కోసం డ్యాన్సర్ల ఎంపిక, రిహార్సల్స్ అన్నీ అయిపోయాయి. ఇంకో రెండు రోజుల్లో బయల్దేరాల్సి ఉంది. అంతకు కొద్ది రోజుల క్రితమే ఏపీ రాష్ట్ర బృందం ముఖ్యమంత్రి సమక్షంలో ప్రదర్శన కూడా ఇచ్చి తమ సన్నాహాలు అద్భుతంగా పూర్తి చేసింది. మరోవైపు సరిగ్గా అదే తేదీల్లో బెంగళూరులో అమ్మాయిల ఇంటర్ స్టేట్ క్రికెట్ చాంపియన్‌షిప్ జరుగుతోంది. దానికి కూడా ఏపీ టీమ్ సెలక్షన్ పూర్తయింది. ఈ రెండు రాష్ట్ర జట్లలోనూ టీనేజర్ మిథాలీ రాజ్ ఉంది. తనకు డ్యాన్స్ ఇష్టం. నాన్నకు క్రికెట్ అంటే ప్రాణం. ఆయన కోసమే ఆటను నేర్చుకుంది. ఇప్పుడు తన భవిష్యత్తు ఏమిటో తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. ఆ వయసులో మిథాలీ తీసుకున్న నిర్ణయం భారత మహిళల క్రికెట్‌కు ఒక అద్భుతాన్ని అందించింది. తర్వాతి రోజుల్లో ప్రత్యర్థి బౌలర్లు, ఫీల్డర్లతో భరత నాట్యం ఆడించింది. సాక్షి క్రీడా విభాగం :‘నాకు మీ అమ్మాయి విషయంలో మీ తల్లిదండ్రులిద్దరి సంపూర్ణ మద్దతు కావాలి. సరిగ్గా చెప్పాలంటే నన్ను గుడ్డిగా నమ్మాలి. 14 ఏళ్ల వయసు వచ్చేసరికి నేను మిథాలీని భారత్ తరఫున ఆడేలా తీర్చిదిద్దగలను’... కోచ్ సంపత్ కుమార్ ఇచ్చిన హామీ ఇది. అయితే మిథాలీ కుటుంబ సభ్యులకు ఇది చాలా అతిగా అనిపించింది. తమ అమ్మాయిపై వారికి నమ్మకమున్నా... నాటి రోజుల్లో మనుగడే కష్టంగా ఉన్న మహిళల క్రికెట్లోకి పంపించడం అంటే పెద్ద సాహసం చేసినట్లే. ‘చాలా మంది సౌతిండియన్ తల్లిదండ్రుల్లా మేం కూడా అమ్మాయి బాగా చదువుకొని ఏ డాక్టరో, ఇంజినీరో కావాలనుకున్నాం’ అని మిథాలీ తల్లి లీలా నాటి రోజులను గుర్తు చేసుకున్నారు. చివరకు కోచ్ మాటే నెగ్గింది. 14 ఏళ్లు లక్ష్యంగా పెట్టుకుంటే కనీసం 16 ఏళ్లకైనా భారత్‌కు ఆడుతుందని సంపత్ కుమార్ నమ్మారు. దాని కోసం తానూ కష్టపడ్డారు, మిథాలీని కూడా కష్టపెడుతూ అన్ని అంశాల్లో ఆమెను తీర్చిదిద్దారు. అయితే క్రికెట్లో ఓనమాలు నేర్పించిన ఆ గురువు తన శిష్యురాలి పురోగతిని మాత్రం చూడలేకపోయారు. 1997లో మిథాలీ వరల్డ్ కప్ ప్రాబబుల్స్ టీమ్‌లోకి ఎంపికైన సమయంలో ఒక రోడ్డు ప్రమాదంలో ఆయన చనిపోయారు. దీని నుంచి కోలుకొని మళ్లీ ఆటపై దృష్టి పెట్టేందుకు మిథాలీకి చాలా సమయం పట్టింది. కోచ్ ఆశించినట్లుగానే 16 ఏళ్ల 205 రోజుల వయసులోనే భారత్ తరఫున తొలి వన్డే ఆడిన మిథాలీ సెంచరీతో చెలరేగింది. అతి పిన్న వయసులో సెంచరీ సాధించిన ఆ రికార్డు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. పరిమిత శిక్షణ అవకాశాలు, మ్యాచ్‌ల సంఖ్య చాలా తక్కువ, కనీసం రోజువారీ ఖర్చులకు కూడా డబ్బులు ఇవ్వని స్థితి మహిళా క్రికెట్‌ది. అయినా ఆడుతున్న వారిని అప్పుడు కొందరు పిచ్చివాళ్లలా చూశారు. మిథాలీ దీనిని సానుకూలంగానే తీసుకుంది. ‘నిజమే, మాకు క్రికెట్ అంటే పిచ్చి ప్రేమ ఉంది కాబట్టే ఆడుతున్నాం’ అని జవాబిచ్చింది. 2002లో మిథాలీ టాంటన్‌లో చారిత్రాత్మక డబుల్ సెంచరీ చేసిన సమయంలో కనీసం అక్కడ స్కోర్ బోర్డు కూడా అందుబాటులో లేదు. టీమ్మేట్ నౌషీన్ బౌండరీ బయట నుంచి చేసిన సైగలతోనే తాను ఎన్ని పరుగులు చేశానో తెలుసుకోవాల్సి వచ్చింది. అలాంటివి మిథాలీ కెరీర్లో చాలా ఉన్నాయి. 2005 వన్డే వరల్డ్ కప్‌లో మిథాలీ నాయకత్వంలో భారత జట్టు ఫైనల్ చేరడం మహిళల క్రికెట్ ముఖ చిత్రాన్ని మార్చింది. వేద కృష్ణమూర్తి, స్మృతి మంధన, హర్మన్‌ప్రీత్ కౌర్... ఒకరా, ఇద్దరా ఎంతో మంది క్రికెట్ వైపు చూసేందుకు ఆమె స్ఫూర్తిగా నిలిచింది. అయితే ఇప్పుడు వీరందరితో కలిసి ఆడుతున్న మిథాలీ రాజ్, దాదాపు పదేళ్ల క్రితమే 25 ఏళ్ల వయసులో వరుస గాయాలు, వైఫల్యాల కారణంగా క్రికెట్‌ను ముగించాలని భావించింది. ఒక దశలో మైదానంలో కంటే ఫిజియో వద్దనే ఆమె ఎక్కువగా కనిపించింది. వయసు ‘పెరిగిపోతోంది’ కాబట్టి పెళ్లి చేసుకోమంటూ ఒత్తిడి మొదలైంది. అయితే మానసికంగా దృఢంగా మారి మరింత పట్టుదలతో మిథాలీ పైకెగసింది. ఇప్పుడు రికార్డుల రారాణిగా గుర్తింపు తెచ్చుకుంది. ‘నేను ఆ సమయంలో పెళ్లి చేసుకోకపోవడం మంచిదైంది. అదే జరిగితే నేను ఇంత కాలం ఆడేదాన్ని కాదు. ఇన్ని ఘనతలు సాధించేదాన్ని కాదు. సరైన వ్యక్తి దొరికే వరకు పెళ్లి గురించి ఆలోచన లేదు. ఈ విషయంలో ఎవరికీ జవాబు చెప్పాల్సిన అవసరం లేదు’ అని మిథాలీ తన వ్యక్తిత్వాన్ని ప్రదర్శించింది. మరి కొంత కాలం తన క్రికెట్ నైపుణ్యాన్ని ప్రదర్శించాలని భావిస్తున్న మిథాలీ కెరీర్ అందరికీ మళ్లీ మళ్లీ చెప్పాల్సిన స్ఫూర్తిగాథ. భారత నీలి రంగు డ్రెస్సులో ఆమె ‘ఎవర్గ్రీన్’ స్టార్ అనడంలో సందేహం లేదు. నో ఎగ్జామ్స్... మిథాలీ రాజ్ ప్రస్తుతం ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీలో ఎంఏ (స్పోర్ట్స్ సైకాలజీ)లో చదువుతోంది. జూన్‌లో మొదటి ఏడాది పరీక్షలకు ఆమె హాజరు కావాల్సి ఉంది. అయితే వరల్డ్ కప్ కారణంగా ఆమె ఈ ఏడాది పరీక్షలకు దూరమైంది. ‘నాకు చాలా గర్వంగా ఉంది. నేనే రికార్డు సాధించినంతగా సంబరపడిపోతున్నాను. గాల్లో తేలిపోతున్నట్లుగా అనిపిస్తుంది. ఎన్ని సమస్యలు, ఇబ్బందులు... మిథాలీ ఆట మొదలు పెట్టిన రోజులు గుర్తు చేసుకుంటే ఒక కలలా అనిపిస్తోంది. ఇప్పుడు ఆమె ఈ స్థాయికి చేరిన తర్వాత ఈ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను. ఏ దశలోనూ మేం క్రికెట్లో డబ్బు లేదనే ఆలోచన అమ్మాయికి రానీయలేదు. నీకు నచ్చినంత వరకు ఆడమనే ప్రోత్సహించాం. అదే ఈ ఫలితాలు అందించింది’ – దొరైరాజ్, మిథాలీ తండ్రి -
టైటిల్ పోరుకు భారత్
►చివరి లీగ్ మ్యాచ్‌లో జింబాబ్వేపై 10 వికెట్లతో గెలుపు ►రాణించిన పూనమ్, దీప్తి, వేద పోట్చెఫ్స్ట్రూమ్ (దక్షిణాఫ్రికా): ప్రపంచ కప్‌కు సన్నాహకంగా దక్షిణాఫ్రికాలో జరుగుతున్న నాలుగు దేశాల మహిళల వన్డే క్రికెట్ టోర్నమెంట్లో భారత జట్టు టైటిల్ పోరుకు అర్హత సాధించింది. జింబాబ్వేతో శుక్రవారం జరిగిన చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌లో టీమిండియా పది వికెట్ల తేడాతో ఘనవిజయం నమోదు చేసింది. తొలుత బౌలర్లు, ఆ తర్వాత ఓపెనర్లు రాణించడంతో భారత్ ఖాతాలో ఐదో విజయం చేరింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న జింబాబ్వే 42.3 ఓవర్లలో కేవలం 98 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో పూనమ్ యాదవ్ (4/11), దీప్తి శర్మ (4/17) నాలుగేసి వికెట్లు తీసి జింబాబ్వేను దెబ్బతీశారు. 99 పరుగుల లక్ష్యాన్ని భారత్ 16 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా అధిగమించింది. ఓపెనర్లు వేద కృష్ణమూర్తి (51 బంతుల్లో 50 నాటౌట్; 9 ఫోర్లు), హర్మన్‌ప్రీత్ కౌర్ (46 బంతుల్లో 39 నాటౌట్; 6 ఫోర్లు, ఒక సిక్స్) అజేయంగా నిలిచారు. దీప్తి శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారం లభించింది. నాలుగు జట్ల మధ్య డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరుగుతున్న ఈ టోర్నీలో లీగ్ దశ ముగిశాక భారత్, దక్షిణాఫ్రికా జట్లు తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. ఈ రెండు జట్ల మధ్య ఆదివారం ఫైనల్ జరుగుతుంది. మూడు, నాలుగు స్థానాల కోసం జరిగే ప్లే ఆఫ్ మ్యాచ్‌లో జింబాబ్వేతో ఐర్లాండ్ తలపడుతుంది.