సింగిల్స్ చాంప్స్ మొమొటా, ఒకుహారా
దుబాయ్: బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో జపాన్ క్రీడాకారులు కెంటో మొమొటా, నొజోమి ఒకుహారా మెరిశారు. పురుషుల సింగిల్స్‌తోపాటు మహిళల సింగిల్స్‌లోనూ టైటిల్స్‌ను సొంతం చేసుకొని సంచలనం సృష్టించారు. పురుషుల ఫైనల్లో కెంటో మొమొటా 21-15, 21-12తో విక్టర్ అక్సెల్‌సన్ (డెన్మార్క్)పై గెలుపొందగా... మహిళల సింగిల్స్ ఫైనల్లో ఒకుహారా 22-20, 21-18తో యిహాన్ వాంగ్ (చైనా)ను ఓడించింది.
ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో సింగిల్స్ విభాగంలో జపాన్ ఆటగాళ్లు టైటిల్ సాధించడం ఇదే తొలిసారి. ఒకుహారా ఈ టోర్నీలో అజేయంగా నిలువడం విశేషం. టైటిల్ గెలిచే క్రమంలో ఒకుహారా లీగ్ దశలో ప్రపంచ నంబర్‌వన్ కరోలినా మారిన్ (స్పెయిన్), రెండో ర్యాంకర్ సైనా నెహ్వాల్ (భారత్)లపై విజయం సాధించింది. విజేతగా నిలిచిన మొమొటా, ఒకుహారాలకు 42 వేల డాలర్ల (రూ. 28 లక్షల 20 వేలు) చొప్పున ప్రైజ్‌మనీ లభించింది. ఈ టోర్నీలో భారత్ తరఫున సైనా, శ్రీకాంత్ బరిలోకి దిగినప్పటికీ ఇద్దరూ లీగ్ దశలోనే నిష్ర్కమించారు.