పూవమ్మ, లిక్సీలకు రజతాలు
ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్
వుహాన్: ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో గురువారం రెండో రోజు భారత్‌కు రెండు రజతాలు, రెండు కాంస్యాలు లభించాయి. మహిళల 400మీ. ఫైనల్లో ఎంఆర్ పూవమ్మ, హెప్టాథ్లాన్‌లో లిక్సీ జోసెఫ్ రజతాలు సాధించారు. 2013 ఈవెంట్‌లోనూ రజతం సాధించిన పూవమ్మ 53.07సె. టైమింగ్‌తో రెండో స్థానంలో నిలిచింది. 800మీ. రేసులో 2:13.44 సె.లలో గమ్యం చేరిన జోసెఫ్ 5,554 పాయింట్లతో రజతాన్ని ఖాయం చేసుకుంది. సహచరురాలు పూర్ణిమ హేమ్‌బ్రామ్ 5,511 పాయింట్లతో కాంస్యం పొందింది. ఇక పురుషుల 5వేల మీ. రేసులో 13:36.62సె.తో వ్యక్తిగత అత్యుత్తమ సమయాన్ని నమోదు చేసి జి.లక్ష్మణన్ కాంస్యం పొందాడు. మహిళల స్ప్రింట్ రిలేలో దుతీ చంద్, శ్రబని నందా, పద్మిణి, సిని సహదేవన్ బృందం నాలుగో స్థానంలో నిలిచి పతకాన్ని కోల్పోయింది. పురుషుల 4ఁ100మీ. రిలే జట్టు ఆరో స్థానం పొందింది.
ఆసియా స్కూల్ చెస్‌లో రాజా రిత్విక్‌కు రజతం
సాక్షి, హైదరాబాద్: ఆసియా స్కూల్ చెస్ చాంపియన్‌షిప్‌లో నగరానికి చెందిన ఆర్. రాజా రిత్విక్ రజతంతో మెరిశాడు. సింగపూర్‌లో జరుగుతున్న ఈ పోటీల అండర్-11 బ్లిట్జ్ విభాగంలో రిత్విక్ రెండో స్థానంలో నిలిచాడు. 7 రౌండ్లకుగాను రిత్విక్ మొత్తం 5.5 పాయింట్లు సాధించాడు. మంగోలియా ఆటగాడు టెంగిస్ ఓచిర్‌తో జరిగిన చివరి రౌండ్ గేమ్ ‘డ్రా’గా ముగియడంతో రిత్విక్‌కు రజతం ఖరారైంది. ప్రస్తుతం 1743 ఎలో రేటింగ్‌తో రిత్విక్ ‘క్యాండిడేట్ మాస్టర్’గా ఉన్నాడు. 100కు పైగా క్రీడాకారులు పాల్గొంటున్న ఈ టోర్నీ క్లాసిక్ విభాగంలో కూడా రాజా పోటీ పడుతున్నాడు. ఆసియా స్థాయిలో రజతం గెలుచుకున్న రిత్విక్‌ను చెస్ సంఘం, ఆర్చిడ్స్ స్కూల్ యాజమాన్యంతో పాటు ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ విజయానంద్, తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకరరావు తదితరులు అభినందించారు.