
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-11 టైటిల్‌ను చెన్నై సూపర్ కింగ్స్ కైవసం చేసుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన తుది పోరులో చెన్నై సూపర్ కింగ్స్ ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచి టైటిల్‌ను సాధించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన 179 పరుగుల లక్ష్యాన్ని చెన్నై 18.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. చెన్నై విజయంలో షేన్ వాట్సన్(117 నాటౌట్; 57 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్లు) కీలక పాత్ర పోషించాడు. ఈ ఐపీఎల్‌లో వాట్సన్‌కు ఇది రెండో సెంచరీ.
అతనికి జతగా సురేశ్ రైనా(32; 24 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 117 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో చెన్నై సునాయాసంగా గెలుపొందింది. ఇది చెన్నైకు మూడో ఐపీఎల్ టైటిల్. మరొకవైపు ఫైనల్ ఫైట్‌లో బౌలింగ్‌లో పూర్తిగా విఫలమైన సన్‌రైజర్స్ రన్నరప్‌గానే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సీఎస్‌కే 16 పరుగుల వద్ద డుప్లెసిస్(10) వికెట్‌ను కోల్పోయింది. ఆ తరుణంలో వాట్సన్-రైనాల జోడి ఇన్నింగ్స్‌ను పరుగులు పెట్టించింది. పవర్ ప్లే వరకూ ఆచితూచి ఆడిన వీరిద్దరూ అటు తర్వాత రెచ్చిపోయారు. ప్రధానంగా వాట్సన్ బౌండరీలే లక్ష్యంగా విరుచుకుపడ్డాడు. 33 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన వాట్సన్.. ఆపై మరో 18 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సందీప్ శర్మ వేసిన 13 ఓవర్‌లో మూడు సిక్సర్లు, రెండు ఫోర్లతో 27 పరుగుల్ని పిండుకున్నాడు. దాంతో చెన్నై స్కోరు బోర్డు పరుగులు తీసింది. ఇదే ఊపును కొనసాగించిన వాట్సన్ కడవరకూ క్రీజ్‌లో ఉండి జట్టును విజయతీరాలకు చేర్చాడు. విన్నింగ్ షాట్‌ను అంబటి రాయుడు(16 నాటౌట్; 19 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్సర్) బౌండరీతో ముగించడంతో చెన్నై శిబిరంలో ఆనందం వెల్లివిరిసింది.
అంతకుముందు సన్‌రైజర్స్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 178 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ ఆటగాళ్లలో కేన్ విలియమ్సన్(47; 36 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించగా, శిఖర్ ధావన్(26; 25 బంతుల్లో 2 ఫోర్లు, 1సిక్స్), షకిబుల్ హసన్(23; 15 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్) ఫర్వాలేదనిపించారు. చివర్లో యూసఫ్ పఠాన్(45 నాటౌట్; 25 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులకు తోడు, బ్రాత్‌వైట్(21;11 బంతుల్లో 3 సిక్సర్లు) బ్యాట్ ఝుళిపించడంతో గౌరవప్రదమైన స్కోరు సాధించింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్కోరు 13 పరుగుల వద్ద ఓపెనర్ శ్రీవాత్సవ్ గోస్వామి(5) తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఆ తరుణంలో ధావన్-విలియమ్సన్‌ల జోడి మరమ్మత్తులు చేపట్టింది. ఈ జోడి 51 పరుగుల భాగ్వాస‍్వామ్యాన్ని సాధించిన తర్వాత ధావన్ రెండో వికెట్‌గా నిష్క్రమించాడు. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన ధావన్ బౌల్డ్ అయ్యాడు. ఆపై విలియమ్సన్-షకిబుల్‌ల జోడి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లింది. వీరిద్దరూ 37 పరుగులు జత చేసిన తర్వాత విలియమ్సన్ మూడో వికెట్‌గా ఔటయ్యాడు. అటు తర్వాత షకిబుల్ హసన్, దీపక్ హుడాలు స్వల్ప వ్యవధిలో ఔట్ కావడంతో సన్‌రైజర్స్ 144 పరుగుల వద్ద ఐదో వికెట్‌ను నష్టపోయింది. అయితే యూసఫ్ పఠాన్ ఆదుకోవడంతో సన్‌రైజర్స్ 170 పరుగుల మార్కును దాటింది.
Comments
Please login to add a commentAdd a comment