న్యూఢిల్లీ : టీమిండియా మాజీ కెప్టెన్, సీనియర్ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనికి భారత ఆర్మీ అంటే ఎనలేని గౌరవం. క్రికెట్ అభిమానుల మాదిరిగానే ఇండియన్ ఆర్మీకీ అతనంటే ప్రత్యేకమైన అభిమానం. 2011లో ధోనికి లెఫ్టినెంట్ కల్నల్ హోదా ఇచ్చి ఇండియన్ ఆర్మీ గౌరవించిన సంగతి తెలిసిందే. భారత పారామిలటరీ దళంలో పనిచేయడమంటే తనకెంతో ఇష్టమని ధోని పలు సందర్భాల్లో వెల్లడించాడు కూడా. ఇక ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019ని ఘనంగా ఆరంభించిన కోహ్లిసేన దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో జయకేతనం ఎగురవేసింది. 227 పరుగుల లక్ష్యాన్ని నాలుగు వికెట్లు కోల్పోయి 47.3 ఓవర్లలో ఛేదించింది. ఈ మ్యాచ్‌లో మిస్టర్‌కూల్ ఎంస్ ధోని ఇండియన్ పారామిలటరీ రెజిమెంట్‌తో తయారు చేసిన గ్లోవ్స్ ధరించి కీపింగ్ చేయడం విశేషం.
(సూపరోహిట్...)
ధోని గ్లోవ్స్‌పై ఉన్న ‘బలిదాన్’(త్యాగం) చిహ్నం దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ ఫెలుక్వాయోను (34) స్టంపౌట్ చేసిన సమయంలో బయటపడింది. అమర జవాన్లకు నివాళిగా ధోని చేసిన పనిపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ‘అందుకే మీరంటే మాకు అత్యంత అభిమానం, గౌరవం.. మీకిదే మా సెల్యూట్’ అంటూ అభిమానులు పేర్కొంటున్నారు. ఇక లక్ష్య ఛేదనలో 34 పరుగులు సాధించిన ధోని టీమిండియా విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. అతని సారథ్యంలో టీమిండియా 2011 క్రికెట్ వరల్డ్‌కప్ గెలుచుకున్న సంగతి విదితమే. ఈ ఏడాది ప్రారంభంలో.. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లోనూ టీమిండియా ఆటగాళ్లు ఆర్మీ క్యాప్‌లు ధరించి పుల్వామా అమరులకు నివాళర్పించారు. ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా రెండో మ్యాచ్ జూన్ 9న ఆస్ట్రేలియాతో జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment