'బోర్డు చేతిలో లేదు.. ప్రభుత్వమే నిర్ణయించాలి'
జంషెడ్పూర్: భారత్ టి-20, వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీలో ఇంకా క్రికెట్ మిగిలుందని, మరి కొన్నేళ్లపాటు జట్టుకు ప్రాతినిధ్యం వహించే సత్తా ఉందని మాజీ కెప్టెన్, క్యాబ్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. ధోనీ గొప్ప క్రికెటర్ అని, అంతర్జాతీయ క్రికెట్లో ప్రమాణాలు నెలకొల్పాడని దాదా కితాబిచ్చాడు.
వచ్చే వన్డే ప్రపంచ కప్ నాటికి భారత్ కెప్టెన్గా ఎవరు ఉంటారన్న ప్రశ్నకు దాదా బదులిస్తూ.. 2019లో జరిగే ప్రపంచ కప్నకు టీమిండియా కెప్టెన్ ఎవరన్నది నిర్ణయించడానికి చాలా సమయముందని చెప్పాడు. ధోనీ స్థాయికి చేరుకోవాలంటే ప్రతిభతో పాటు కఠిన సాధన అవసరమని దాదా అన్నాడు. సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియాలో మళ్లీ చోటు దక్కించుకున్న ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్.. ఆస్ట్రేలియా పర్యటనలో రాణిస్తాడని విశ్వాసం వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియా టూర్కు వెళ్లే భారత్ టి-20 జట్టుకు యువీ ఎంపికైన సంగతి తెలిసిందే. ఇక భారత్-పాకిస్తాన్ ద్వైపాక్షిక సిరీస్ గురించి దాదా మాట్లాడుతూ.. ఇరు జట్లు మళ్లీ ఆడాలిన ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని, అయితే నిర్ణయాధికారం బీసీసీఐ చేతిలో లేదని, ప్రభుత్వమే నిర్ణయించాలని అన్నాడు.