హైదరాబాద్: ఆస్ట్రేలియాతో శనివారం ఉప్పల్ వేదికగా జరుగనున్న తొలి వన్డేలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఆడటం అనుమానంగా మారింది. ప్రాక్టీస్ సెషన్‌లో ధోనికి గాయం కావడంతో అతను ఆడటంపై సందేహం నెలకొంది. శుక్రవారం భారత క్రికెట్ జట్టు ప్రాక్టీస్ చేస్తుండగా ధోని ముంజేతికి గాయమైంది. జట్టు సహాయక సిబ్బంది రాఘవేంద్ర విసిరిన ఒక త్రోకు ధోని గాయపడ్డాడు. వేగంగా విసిరిన బంతి ధోని కుడిచేతికి బలంగా తగలడంతో ధోని ఎక్కువసేపు ప్రాక్టీస్ చేయలేదు. ఈ క్రమంలోనే అతను తొలి వన్డేకు దూరమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఇంకా తుది జట్టును ప్రకటించకపోయినప్పటికీ ధోని ఆడటం అనేది అనుమానంగా మారింది. తొలి వన్డేలో ధోని ఆడతాడా.. లేదా అనే విషయంపై ఈరోజు రాత్రికి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఒకవేళ తొలి వన్డేకు ధోని దూరమైతే టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బగానే చెప్పొచ్చు. ఇప్పటికే రెండు టీ20ల సిరీస్‌ను కోల్పోయిన టీమిండియా.. తొలి వన్డేలో విజయం సాధించి బోణి కొట్టాలనే యోచనలో ఉంది. ఈ తరుణంలో ధోని గాయం టీమిండియా మేనేజ్‌మెంట్‌ను కలవరపరుస్తోంది. రేపటి మ్యాచ్‌కు ధోని అందుబాటులోకి రాకపోతే రిషభ్ పంత్ వికెట్ కీపర్‌గా వ్యవహరించనున్నాడు. రేపు మధ్యాహ్నం గం. 1.30ని.లకు తొలి వన్డే ఆరంభం కానుంది.
ఇక్కడ చదవండి: అబ్బా ధోని.. ఏం ఫిట్‌నెస్ అయ్యా నీది!
Comments
Please login to add a commentAdd a comment