వన్డే సిరీస్‌పైనే టీమిండియా గురి | India eye series win in Dhonis last match at Ranchi | Sakshi
Sakshi News home page

వన్డే సిరీస్‌పైనే టీమిండియా గురి

Published Thu, Mar 7 2019 1:26 PM | Last Updated on Thu, Mar 7 2019 1:28 PM

India eye series win in Dhonis last match at Ranchi - Sakshi

రాంచీ: ఆస్ట్రేలియాతో రెండు టీ20ల సిరీస్‌ను కోల్పోయిన టీమిండియా.. ఇప్పడు వన్డే సిరీస్‌ను దక్కించుకోవడంపైనే దృష్టి పెట్టింది. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇప్పటికే రెండు వరుస విజయాలతో మంచి ఊపు మీద ఉన్న భారత జట్టు.. మూడో వన్డేలో సైతం గెలుపొంది ముందుగానే సిరీస్‌ను కైవసం చేసుకోవడానికి కసరత్తులు చేస్తోంది. శుక్రవారం రాంచీ వేదికగా జేఎస్‌సీఏ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో జరుగనున్న మూడో వన్డేలో భారత్‌ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది. భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డేకు వేదిక అయిన ఈ మైదానంలో బహుశా ధోనికిదే చివరి మ్యాచ్‌ కావచ్చు. ఈ నేపథ్యంలో రాంచీ విజయాన్ని ధోని కానుకగా ఇవ్వాలని భారత జట్టు యోచిస్తోంది. రేపు మధ్యాహ్నం గం.1.30ని.లకు మూడో వన్డే ఆరంభం కానుంది.

హైదరాబాద్‌లో జరిగిన తొలి వన్డేలో, నాగ్‌పూర్‌లో జరిగిన రెండో వన్డేలో సమిష్టిగా పోరాడి విజయాల్ని సాధించిన భారత్‌.. మూడో వన్డేకు రెట్టించిన ఉత్సాహంతో సిద్ధమవుతోంది. ఈ వన్డే సిరీస్‌ను ముందుగానే ముగించాలని భావిస్తున్న విరాట్ సేన మూడో వన్డేకు సైతం గత జట్టునే కొనసాగించే అవకాశం ఉంది. చివరి రెండు వన్డేల్లో శిఖర్‌ ధావన్‌ ఆశించిన స్థాయిలో రాణించినప్పటికీ అతన్ని తొలగించేందుకు టీమిండియా యాజమాన్యం సుముఖంగా ఉండకపోవచ్చు. ధావన్‌ తాను ఆడిన గత 15 వన్డేల్లో కేవలం రెండు హాఫ్‌ సెంచరీలు మాత్రమే చేసినా రెగ్యులర్‌ ఓపెనర్‌ కావడంతో  అతన్ని తీసే సాహసం చేయకపోవచ‍్చు. అందులోనూ వరల్డ్‌కప్‌కు ముందు భారత్‌ ఆడుతున్న కీలక సిరీస్‌ కావడంతో మూడో వన్డేలో ధావన్‌ను కొనసాగించేందుకే ఎక్కువ ఛాన్స్‌ ఉంటుంది. ఇక్కడ కేఎల్‌ రాహుల్‌ ఉన్నప్పటికీ సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకోవాలనుకుంటున్న భారత్‌.. ఎటువంటి ప్రయోగాలకు ఆస్కారం ఇవ్వకపోవచ్చు. ఒకవేళ రాహుల్‌కు చాన్స్‌ ఇవ్వాలని అనుకుంటే మాత్రం అంబటి రాయుడుకి ఉద్వాసన తప్పదు. ఆసీస్‌త్ రెండు వన్డేల్లోనూ రాయుడు నిరాశపరచడంతో ఆ స్థానాన్ని రాహుల్‌తో భర్తీ చేయవచ్చు.

ఇక ఇప్పటివరకూ ఈ స్టేడియంలో భారత్‌ నాలుగు వన్డేలు ఆడగా రెండింట విజయం సాధించింది.  2013లో ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కాగా,  2016లో న్యూజిలాండ్‌తో భారత్‌ చివరిసారి తలపడిన వన్డేల్లో ఓటమి పాలైంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement