
గోల్డ్ కోస్ట్: కామన్వెల్త్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో మూడో రోజు కూడా భారత షూటర్ల హవా కొనసాగింది. తొలుత 50మీటర్ల రైఫిల్ ప్రోన్ ఈవెంట్ లో భారత షూటర్ గగన్ నారంగ్ రజత పతకాన్ని కైవసం చేసుకోగా, ఆపై అదే ఈవెంట్ లో మరో భారత షూటర్ స్వప్నిల్ సురేశ్ కాంస్య పతకాన్ని సాధించాడు. ఇందులో ఆస్ట్రేలియాకు చెందిన సాంప్సన్ కు స్వర్ణ పతకం సాధించాడు. ఇక మహిళల 25 మీటర్ల పిస్టోల్ విభాగంలో భారత షూటర్ స్నురజ్ సింగ్ కాంస్య పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.
నిన్నటి షూటింగ్ పోరులో భారత ఖాతాలో ఐదు పతకాలు చేరిన సంగతి తెలిసిందే. ఇందులో రెండు స్వర్ణాలు, రెండు రజతాలు, ఒక కాంస్యం ఉన్నాయి. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. అందుబాటులో ఉన్న మూడు పతకాలను భారత షూటర్లు షాజర్ రిజ్వీ, ఓంకార్ సింగ్, జీతూ రాయ్ సొంతం చేసుకున్నారు. ఫైనల్లో షాజర్ రిజ్వీ 240.7 పాయింట్లు స్కోరు చేసి స్వర్ణాన్ని దక్కించుకోగా... 236 పాయింట్లతో ఓంకార్ సింగ్ రజతం, 214.1 పాయింట్లతో జీతూ రాయ్ కాంస్యం సంపాదించారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో పూజా ఘాట్కర్ స్వర్ణం, అంజుమ్ మౌద్గిల్ రజతం గెలిచారు.
Comments
Please login to add a commentAdd a comment