కేన్ విలియమ్సన్
వెల్లింగ్టన్ : బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ గాయంతో విలవిలలాడాడు. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ మూడో రోజు ఆటలో విలియమ్సన్ ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. బంతిని ఆపే క్రమంలో అతని ఎడమ భుజానికి గాయమైంది. అయితే అప్పుడు సాధారణ గాయమని భావించిన విలియమ్సన్ తన ఆటను అలానే కొనసాగించాడు. ఇక నాలుగో రోజు ఆటలో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో విలియమ్సన్‌కు ఆ గాయం తిరగబెట్టింది. ఆ నొప్పి భరించలేక మైదానంలో విలవిలాడాడు. ఈ క్రమంలో ఫిజియోలు పలుమార్లు ప్రాథమిక చికిత్స అందించినప్పటికి నొప్పి తగ్గలేదు.
దీంతో అతన్ని ఆసుపత్రికి తరలించి స్కానింగ్ తీయించగా మాములు గాయమేనని తేలింది. నొప్పితోనే బ్యాటింగ్ చేసిన విలియమ్సన్ ఈమ్యాచ్ అర్థసెంచరీ సాధించాడు. మరో బ్యాట్స్‌మెన్ రాస్‌టేలర్ డబుల్ సెంచరీ సాధించగా.. హెన్రీ నికోలస్ శతకం బాదడంతో కివీస్ తొలి ఇన్నింగ్స్‌ను 432/6 వద్ద డిక్లేర్డ్ చేసింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేసిన తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన బంగ్లాదేశ్ నాల్గో రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 80 పరుగులు చేసింది. అంతకుముందు బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 211 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బంగ్లాదేశ్ 141 పరుగుల వెనుకబడి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment