
స్టెయిన్ కు తప్పని నిరీక్షణ
కేప్టౌన్: దాదాపు ఏడాది కాలంగా క్రికెట్ కు దూరంగా ఉంటున్న దక్షిణాఫ్రికా స్పీడ్ స్టార్ డేల్ స్టెయిన్ అంతర్జాతీయ పునరాగమనం కోసం నిరీక్షణ తప్పడం లేదు. వచ్చే వారం దేశవాళీ క్రికెట్ లోకి అడుగుపెట్టాలని భావించిన స్టెయిన్ మరికొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోనున్నాడు. ఈ మేరకు తాను ఇంకా టెస్టు క్రికెట్ ఆడటానికి సిద్ధం కాలేదని విషయాన్ని స్టెయిన్ స్వయంగా వెల్లడించాడు.
'నేను క్రికెట్ ఆడటానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం నేను బౌలింగ్ బాగానే వేస్తున్నా. కాకపోతే ఎక్కువ పని భారాన్ని భుజాన వేసుకునేంతగా ఫిట్ కాలేదు. అప్పుడే టెస్టు క్రికెట్ ఆడటం అంత మంచిది కాదనేది నా అభిప్రాయం. అది నాలుగు రోజుల దేశవాళీ మ్యాచ్ కావొచ్చు.. ఐదు రోజుల టెస్టు మ్యాచ్ కావొచ్చు. ఫిట్ గా ఉన్నానని భావించిన తరువాత మాత్రమే టెస్టు క్రికెట్ ఆడతా'అని స్టెయిన్ తెలిపాడు. దాంతో త్వరలో బంగ్లాదేశ్ తో స్వదేశంలో జరిగే టెస్టు సిరీస్ లో స్టెయిన్ పాల్గొనే అవకాశాలు సన్నగిల్లాయి.
గతేడాది నవంబర్ లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో చివరిసారి కనిపించి స్టెయిన్.. భుజం గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. అతని భుజానికి శస్త్ర చికిత్స అనంతరం సుదీర్ఘమైన విశ్రాంతి తీసుకున్న స్టెయిన్ తిరిగి బరిలోకి వచ్చేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు.