ఓక్రిడ్జ్ స్కూల్‌కు ‘డబుల్'
ఎల్బీ స్టేడియం: ఐఎంజీ-రిలయన్స్ స్కూల్స్ బాస్కెట్‌బాల్ లీగ్ టోర్నమెంట్‌లో బాలబాలికల టైటిళ్లను ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ జట్లు చేజిక్కించుకున్నాయి. ఈ రెండు విభాగాల్లో చిరెక్ స్కూల్ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. బేగంపేట్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్‌పీఎస్) బాస్కెట్‌బాల్ మైదానంలో మంగళవారం జరిగిన బాలుర ఫైనల్లో ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ జట్టు 42-21 పాయింట్ల తేడాతో చిరెక్ పబ్లిక్ స్కూల్ జట్టుపై ఘనవిజయం సాధించింది.
ఓక్రిడ్జ్ స్కూల్ జట్టులో హర్ష 13, నీల్ 13, రావల్ 11 పాయింట్లు చేశారు. చిరెక్ పబ్లిక్ స్కూల్ జట్టులో సంజయ్ 11 పాయింట్లు చేశాడు. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ జట్టు 54-40తో గీతాంజలి స్కూల్ జట్టుపై గెలిచింది. బాలికల ఫైనల్లో ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ జట్టు 37-31 పాయింట్ల తేడాతో చిరెక్ పబ్లిక్ స్కూల్ జట్టుపై గెలిచింది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ జట్టు 66-51తో ఫ్యూచర్ కిడ్స్ స్కూల్‌పై నెగ్గింది.