చదువు..నైపుణ్యం.. విలువలకు కేరాఫ్‌ ఓక్రిడ్జ్‌ | Silver Jubilee Celebrations in all Oakridge International Schools | Sakshi
Sakshi News home page

చదువు..నైపుణ్యం.. విలువలకు కేరాఫ్‌ ఓక్రిడ్జ్‌

Published Sun, Mar 18 2018 1:46 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

Silver Jubilee Celebrations in all Oakridge International Schools - Sakshi

ఖాజాగూడలోని ఓక్రిడ్జ్‌ అంతర్జాతీయ పాఠశాల న్యూటన్‌ క్యాంపస్‌ భవనాలు

దాదాపు రెండు దశాబ్దాల క్రితం.. ఇద్దరు స్నేహితులు కలసి అప్పటి వరకూ ఉన్న బట్టీ విద్యా విధానానికి ప్రత్యామ్నాయంగా.. విలువలతో కూడిన నాణ్యమైన విద్య అందించాలనే సదాశయంతో వికాస్‌ ఎడ్యుకేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ అనే ఓ చిన్న మొక్కను నాటారు. ఆ మొక్క కాస్తా ఇప్పుడు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఓక్రిడ్జ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ అనే మహావృక్షంగా మారింది. దాని నీడలో ఇప్పుడు వేలాది మంది అత్యున్నతమైన విద్యను అభ్యసిస్తూ.. బంగారు భవితకు బాటలు వేసుకుంటున్నారు.. ఆ ఇద్దరు స్నేహితులే నూజివీడుకు చెందిన తుమ్మల నాగప్రసాద్, యార్లగడ్డ రాజశేఖర్‌బాబు. వికాస్‌ ఇన్‌స్టిట్యూషన్స్, ఓక్రిడ్జ్‌ పాఠశాలలు, వెస్ట్‌బెర్రీ పాఠశాలలన్నింటికీ మాతృ సంస్థ పీపుల్‌ కంబైన్‌ 2010లో ఆవిర్భవించింది. ‘వికాస్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌’ నెలకొల్పి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అన్ని ఓక్రిడ్జ్‌ పాఠశాలల్లో సిల్వర్‌జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. 
    –సాక్షి, హైదరాబాద్‌

అత్యున్నత నైపుణ్యం, నైతిక విలువలతో కూడిన విద్య, సంస్కారమే లక్ష్యంగా పురుడు పోసుకున్న ఓక్రిడ్జ్‌ విద్యా సంస్థలు వేలాది మంది విద్యార్థులను సమాజ హితులుగా తీర్చిదిద్ది అప్పుడే సిల్వర్‌జూబ్లీ వేడుకలకు చేరువయ్యాయి. విశాఖలో వికాస్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌గా మొగ్గతొడిగి నేడు ఓక్రిడ్జ్‌ అంతర్జాతీయ పాఠశాలగా అవతరించి ‘స్కిల్స్, వాల్యూస్, హ్యాబిట్స్‌’అనే నినాదంతో వేలాది మంది ఉత్తమ విద్యార్థులను సమాజానికి అందిస్తోంది. తమ పిల్లలకు మార్కులు వస్తే చాలనుకుంటున్న తల్లిదండ్రుల ఆలోచనలను మారుస్తూ.. నైపుణ్యం, సమయానికి ఆహారపు అలవాట్లు, నియమాలు పాటిస్తే ‘ఫర్‌ఫెక్ట్‌ స్టూడెంట్‌’గా మారతారని చేతల్లో చూపిస్తున్నారు నూజివీడుకు చెందిన తుమ్మల నాగప్రసాద్, యార్లగడ్డ రాజశేఖర్‌బాబు. వీరిద్దరూ రెండో తరగతి నుంచి నూజివీడు జెడ్‌పీ హైస్కూల్‌లో కలసి చదువుకున్నారు. ధర్మా అప్పారావు కాలేజీలో ఇంటర్‌ చదివారు. నాగప్రసాద్‌ డీఏఆర్‌ కాలేజీలో బీఎస్సీ, సాగర్‌ యూనివర్సిటీలో ఎంఎస్సీ పూర్తి చేశారు. రాజశేఖర్‌ భీమవరంలో సివిల్‌ ఇంజనీరింగ్‌ చదివారు. 1993లో ఇద్దరూ కలసి వైజాగ్‌లో వికాస్‌ ఎడ్యుకేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ నెలకొల్పారు. ఐఐటీ, ఎంసెట్, మెడిసిన్‌లో శిక్షణ ఇచ్చేవారు. జాయ్‌ఫుల్‌ లెర్నింగ్‌ కోసం దేశవిదేశాల్లోని 100కుపైగా పాఠశాలల్లో రీసెర్చ్‌ చేశారు. డెహ్రాడూన్‌లోని డూన్‌ పాఠశాలకు వెళ్లి పదవీ విరమణ పొందిన షౌమీరంజన్‌దాస్‌ను కలిశారు. ఆయనిచ్చిన సలహాలు, మానసికస్థైర్యంతో ఇంటర్నేషనల్‌ బ్యాకులరేట్‌(ఐబీ) సిలబస్‌తో ఓక్రిడ్జ్‌ అంతర్జాతీయ పాఠశాల పెట్టాలనే ఆలోచన వచ్చింది. 

అదే స్ఫూర్తిగా హైదరాబాద్‌లో.. 
2001 జూన్‌ 11న జూబ్లీహిల్స్‌లో ఓక్రిడ్జ్‌ స్కూల్‌ ప్రారంభమైంది. ప్రశాంత వాతావరణం ఉండేలా ఖాజాగూడలోని 10.5 ఎకరాల్లో మొదటి ఐబీ స్కూల్‌ కొత్త క్యాంపస్‌ను నిర్మించి దానికి న్యూటన్‌ క్యాంపస్‌గా నామకరణం చేసి అక్కడికి మార్చారు. దేశవ్యాప్తంగా ఉన్న ఐదు క్యాంపస్‌ల్లో ఇదే అతి పెద్దది. బాచుపల్లిలో ఐన్‌స్టీన్‌ క్యాంపస్, బెంగళూరు, విశాఖపట్నం, మొహలీలో ఇతర క్యాంపస్‌లు ఉన్నాయి. ‘ఖాజాగూడలోని న్యూటన్‌ క్యాంపస్‌లో ఐబీ సిలబస్‌ను మూడు రకాలుగా అందుబాటులో ఉంచాం. బాచుపల్లిలో కేంబ్రిడ్జి ప్రోగ్రామ్, కేంబ్రిడ్జి ఇంటర్నేషనల్‌ ఎడ్యుకేషన్, కేంబ్రిడ్జి ఇంటర్నేషనల్‌ ప్రైమరీ ఇయర్‌ ప్రోగ్రామ్, ఇంటర్నేషనల్‌ గ్రేడ్‌ సర్టిఫికెట్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ వంటి సిలబస్‌లతో విద్యార్థులను అన్నింట్లో ఆరితేరేలా చూస్తున్నాం. ఇవే కాకుండా హైదరాబాద్‌లో 25, బెంగళూరులో 20 ఓపెన్‌ ఇంటరాక్షన్‌ ప్లేస్కూల్స్‌ను ఫ్రాంచైజీల సహకారంతో నిర్వహిస్తూ పసిప్రాయంలోనే పిల్లలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతున్నాం’అని నాగప్రసాద్, రాజశేఖర్‌ తెలిపారు. 

పీర్‌ లెర్నింగ్‌తో ఆలోచనల వెల్లువ.. 
ఓక్రిడ్జ్‌ అంతర్జాతీయ పాఠశాలలో లెటర్‌ మోడ్‌లో కాకుండా ఐల్యాండ్‌ మోడ్‌(పీర్‌ లెర్నింగ్‌)లో విద్యార్థులు గుంపులు గుంపులుగా కూర్చుని.. తమ ఆలోచనలను పంచుకుంటారు. చర్చా కార్యక్రమాలు, వ్యాస రచనలు, క్విజ్‌ నిర్వహిస్తారు. విద్యార్థుల ఆలోచనలకు అద్దంపట్టేలా పర్సనల్‌ ప్రాజెక్టుల పేరిట పరిశోధనలను ప్రోత్సహిస్తారు. ప్రతి 25 మందికి ఒక టీచర్, లోయర్‌ గ్రేడ్‌లో పది మందికి ఒక టీచర్‌ ఉంటారు. విద్యార్థుల్లో సేవా దృక్ఫథాన్ని అలవర్చేందుకు ఐబీ కరికులమ్‌లో భాగంగా కమ్యూనిటీ యాక్షన్‌ సర్వీస్‌(క్యాస్‌) కార్యక్రమం ప్రారంభించారు. దీనిద్వారా విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, స్వచ్ఛ భారత్, వృద్ధాశ్రమాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించడం, అనాథ పిల్లల సంరక్షణ కేంద్రాలను పరిశీలించి చేయూత అందించడం వంటి కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తున్నారు. 

అవార్డుల వెల్లువ

- 2018లో ఫోర్బ్స్‌ మేగజీన్‌ సర్వేలో గ్రేట్‌ ఇండియన్‌ స్కూల్‌గా ఓక్రిడ్జ్‌ అంతర్జాతీయ పాఠశాలకు గుర్తింపు. 
- తెలంగాణ రాష్ట్రంలో పీపుల్‌ కంబైన్‌ గ్రూప్‌నకు బెస్ట్‌ ఎంప్లాయర్‌ బ్రాండ్‌–2017 అవార్డు పొందింది.
- ఎడ్యుకేషన్‌ టుడే సర్వేలో వరుసగా మూడేళ్లపాటు టాప్‌ ర్యాంక్‌ ఇన్‌ ఇండియన్‌ స్కూల్‌ మెరిట్‌ అవార్డు 
- 2017లో టైమ్స్‌ సర్వేలో ఇంటర్నేషనల్‌ స్కూళ్లలో న్యూటన్‌ క్యాంపస్‌కు మొదటిస్థానం. 2016లో టైమ్స్‌ సర్వేలో నంబర్‌ వన్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌ ఇన్‌ ఇండియాగా ఓక్రిడ్జ్‌కు గుర్తింపు. 
- 2015లో దేశంలోనే టాప్‌ టెన్‌ స్కూల్స్‌లో ఒకటిగా ఎడ్యుకేషన్‌ వరల్డ్‌ మేగజైన్‌ గుర్తింపు ళి 2015 టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా సర్వేలో బెస్ట్‌ స్కూల్‌ ఆఫ్‌ హైదరాబాద్‌గా నిలిచింది. 

క్రీడల్లోనూ మెరిసేలా.. 
క్రీడల్లోనూ విద్యార్థులు రాణించేలా.. అన్ని క్యాంపస్‌ల్లో క్రీడల మౌలిక వసతులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఒక్క న్యూటన్‌ క్యాంపస్‌లోనే అంతర్జాతీయ ప్రమాణాలతో టెన్నిస్‌ కోర్టులు, స్విమ్మింగ్‌పూల్, స్క్వాష్‌పూల్, క్రికెట్‌ పిచ్, వాలీబాల్‌ కోర్టు, బాస్కెట్‌బాల్‌ కోర్టు, సాకర్‌ ఫీల్డ్, రాక్‌ క్లైంబింగ్, స్కేటింగ్‌ రింక్‌ వంటివి అందుబాటులోకి తీసుకొచ్చారు. సుశిక్షితులైన స్పోర్ట్‌ కోఆర్డినేటర్‌ çపర్యవేక్షణలో కోచ్‌లను నియమించి శిక్షణ ఇస్తున్నారు. దీంతో దేశవిదేశీ క్రీడా పోటీల్లో ఓక్రిడ్జ్‌ విద్యార్థులు అనేక పతకాలు సాధించారు. 

ప్రశ్న తలెత్తితేనే జవాబు దొరుకుతుంది.. 
కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలనే ఓక్రిడ్జ్‌ స్కూల్స్‌ స్థాపించాం. విద్యార్థుల మెదడులో ఒక ప్రశ్న తలెత్తితేనే జవాబు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు. ప్రశ్నే తలెత్తకపోతే ఆ విద్యార్థి« సరైన మార్గంలో వెళ్లడం కష్టం. బట్టీ విధాçనంతో శిక్షణ లోపిస్తుంది. ఈ విధానానికి స్వస్తి చెప్పేందుకే ఓక్రిడ్జ్‌ అంతర్జాతీయ పాఠశాల ప్రారంభించాం. భవిష్యత్తుకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించేలా బోధన చేపడుతున్నాం. 
– తుమ్మల నాగప్రసాద్‌(చైర్మన్, పీపుల్‌ కంబైన్‌), యార్లగడ్డ రాజశేఖర్‌బాబు (మేనేజింగ్‌ డైరెక్టర్, పీపుల్‌ కంబైన్‌)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement