రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండేసి కార్యవర్గాలు సిద్ధం
ఇక ఎవరు అసలో తేలాలి
సాక్షి, హైదరాబాద్: సాధారణంగా ఎక్కడైనా ఎన్నికలు అంటే ఒకే పదవి కోసం పలువురు పోటీ పడతారు. కానీ తెలుగు రాష్ట్రాల ఒలింపిక్ సంఘాల ఎన్నికల్లో మాత్రం విభిన్న ‘సిత్రం’ తయారయింది. అటు ఆంధ్రప్రదేశ్‌లో, ఇటు తెలంగాణలో రెండేసి కార్యవర్గాలు సిద్ధమయ్యాయి. వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించుకుని రెండేసి సంఘాలను సిద్ధం చేసుకున్నారు. తమదే అసలు సంఘమని వాదిస్తున్నారు. ఈ రెండు కార్యవర్గాల్లో ఏది అసలుదో తేలాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ సంఘం (ఏపీఓఏ) పాత అధ్యక్షుడు లగడపాటి రాజగోపాల్ ఆధ్వర్యంలో ఆదివారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ సంఘాలకు ఎన్నికలు నిర్వహించారు.
తెలంగాణకు జితేందర్ రెడ్డి, ఏపీకి సీఎం రమేశ్ అధ్యక్షులుగా ఎన్నికైనట్లు ప్రకటించారు. అయితే ఇటు తెలంగాణలో దీనికంటే ముందే రంగారావు అధ్యక్షుడిగా ఒక సంఘాన్ని ఎన్నుకున్నారు. అటు ఏపీలో గల్లా జయదేవ్ అధ్యక్షుడిగా ఒక సంఘం సిద్ధంగా ఉంది. జయదేవ్ సంఘానికి ఇప్పటికే భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) గుర్తింపునివ్వగా... దీనిపై సీఎం రమేశ్ వర్గం కోర్టును ఆశ్రయించింది.
తెలంగాణలో రంగారావు నిర్వహించిన ఎన్నికలకు కూడా ఐఓఏ పరిశీలకుడు వచ్చారు. రాజగోపాల్ నిర్వహించిన ఎన్నికలకు ఐఓఏ నుంచి ఎవరూ పరిశీలకులుగా రాలేదు. కాబట్టి రంగారావు కార్యవర్గానికే గుర్తింపు వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఒకవేళ అదే జరిగితే జితేందర్ రెడ్డి వర్గం కూడా కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి. మొత్తం మీద కోర్టు తీర్పులు, ఐఓఏ దగ్గర పంచాయితీలు పూర్తయ్యి, కొత్త కార్యవర్గాలు పని ప్రారంభించడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది.