హరికృష్ణ శుభారంభం
తొలి గేమ్‌లో హారికపై గెలుపు
దోహా: ఖతార్ మాస్టర్స్ ఓపెన్ చెస్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ శుభారంభం చేశాడు. మరో తెలుగు గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారికతో జరిగిన తొలి రౌండ్‌లో నల్లపావులతో ఆడిన హరికృష్ణ 80 ఎత్తుల్లో గెలిచాడు. హారికపై హరికృష్ణకిది రెండో విజయం కావడం విశేషం. వీరిద్దరూ తొలిసారి 2012 టాటా స్టీల్ టోర్నీలో తలపడగా హరికృష్ణ 33 ఎత్తుల్లో నెగ్గాడు. మొత్తం 40 దేశాల నుంచి 154 మంది పాల్గొంటున్న ఖతార్ మాస్టర్స్ టోర్నీలో 92 మంది గ్రాండ్‌మాస్టర్లు ఉండటం విశేషం. తొమ్మిది రౌండ్లపాటు జరిగే ఈ టోర్నీలో విజేతకు 25 వేల డాలర్లు ప్రైజ్‌మనీ ఇస్తారు.