సైనా శుభారంభం | Picking up women | Sakshi
Sakshi News home page

సైనా శుభారంభం

Published Thu, Mar 6 2014 1:04 AM | Last Updated on Sat, Sep 2 2017 4:23 AM

సైనా శుభారంభం

సైనా శుభారంభం

 బర్మింగ్‌హమ్: ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ టోర్నమెంట్‌లో మహిళల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ సైనా నెహ్వాల్ శుభారంభం చేసింది. బుధవారం జరిగిన తొలి రౌండ్‌లో ఏడో సీడ్ సైనా 21-15, 21-6తో ప్రపంచ 20వ ర్యాంకర్ కిర్‌స్టీ గిల్మౌర్ (స్కాట్లాండ్)పై విజయం సాధించింది.

 

గిల్మౌర్‌పై సైనాకిది వరుసగా రెండో గెలుపు. గతేడాది డెన్మార్క్ ఓపెన్‌లో గిల్మౌర్‌తో జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లోనూ సైనానే విజయం వరించింది. గురువారం జరిగే రెండో రౌండ్‌లో ప్రపంచ 41వ ర్యాంకర్ బీవెన్ జాంగ్ (అమెరికా)తో సైనా ఆడుతుంది. తొలి రౌండ్‌లో ప్రపంచ 11వ ర్యాంకర్ జూలియన్ షెంక్ (జర్మనీ) నుంచి బీవెన్ జాంగ్‌కు ‘వాకోవర్’ లభించింది.

 

 పురుషుల సింగిల్స్ విభాగంలో భారత పోరాటం ముగిసింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రపంచ 18వ ర్యాంకర్ పారుపల్లి కశ్యప్, ప్రపంచ 21వ ర్యాంకర్ కిడాంబి శ్రీకాంత్ తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టారు. కశ్యప్ 21-14, 19-21, 17-21తో ప్రపంచ ఐదో ర్యాంకర్ కెనిచి టాగో (జపాన్) చేతిలో; శ్రీకాంత్ 11-21, 15-21తో కెంటో మొమోటా (జపాన్) చేతిలో ఓటమి పాలయ్యారు. గతేడాది ఈ టోర్నీ రెండో రౌండ్‌లో కెనిచి టాగోను ఓడించి క్వార్టర్ ఫైనల్ చేరుకున్న కశ్యప్ ఈసారి మాత్రం అదే ఫలితాన్ని పునరావృతం చేయలేకపోయాడు. గంటా 15 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో కశ్యప్ తొలి గేమ్‌ను అలవోకగా నెగ్గినా తర్వాతి రెండు గేముల్లో తడబడి మ్యూలం చెల్లించుకున్నాడు. ఈ ఏడాది ఇప్పటివరకు ఆడిన నాలుగు టోర్నీల్లోనూ కశ్యప్ క్వార్టర్ ఫైనల్ దాటి ముందుకెళ్లలేకపోయాడు.
 

మిక్స్‌డ్ డబుల్స్ తొలి రౌండ్‌లో తరుణ్ కోనా-అశ్విని పొనప్ప (భారత్) జంట 13-21, 16-21తో నాలుగో సీడ్ జోచిమ్ నీల్సన్-క్రిస్టినా పెడర్సన్ (డెన్మార్క్) జోడి చేతిలో పరాజయం పాలైంది.

 మంగళవారం జరిగిన పురుషుల క్వాలిఫయింగ్ తొలి రౌండ్‌లో ఆనంద్ పవార్ 21-18, 13-21, 19-21తో ఆండ్రీ కుర్నియావాన్ (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయాడు. మహిళల డబుల్స్ క్వాలిఫయింగ్ రెండో రౌండ్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొనప్ప ద్వయం 21-14, 15-21, 17-21తో జిన్ మా-యువాన్‌టింగ్ తంగాస్ (చైనా) జోడి చేతిలో ఓడింది
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement