‘ట్రాక్‌’ మార్చిన ద్యుతీచంద్‌ | Poor Gachibowli track Hits Dutees Olympics Training | Sakshi
Sakshi News home page

‘ట్రాక్‌’ మార్చిన ద్యుతీచంద్‌

Published Tue, Nov 5 2019 11:54 AM | Last Updated on Tue, Nov 5 2019 5:49 PM

Poor Gachibowli track Hits Dutee’s Olympics Training - Sakshi

సాక్షి,హైదరాబాద్‌: అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పతకాలు, జాతీయ స్థాయిలో మరెన్నో రికార్డులు భారత మహిళా స్ప్రింటర్‌ ద్యుతీచంద్‌ సొంతం. కానీ ఒలింపిక్స్‌లో పతకం మాత్రం ఆమెను ఇంకా ఊరిస్తూనే ఉంది. ఈసారి ఒలింపిక్స్‌ పతకమే లక్ష్యంగా ద్యుతీచంద్‌ సిద్ధమవుతున్నారు. ఇటీవల జరిగిన నేషనల్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో 100 మీటర్ల రేసులో 11.22 సెక్లనలో లక్ష్యాన్ని పూర్తి చేసి సరికొత్త జాతీయ రికార్డు నెలకొల్పిన ద్యుతీచంద్‌ తన ప్రాక్టీస్‌ను ముమ్మరం చేశారు. తన రికార్డులను తానే బ్రేక్‌ చేస్తూ అథ్లెటిక్స్‌ ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ ఈవెంట్‌కు వన్నె తెచ్చిన ద్యుతీచంద్‌.. వచ్చే ఏడాది టోక్యో వేదికగా జరుగనున్న ఒలింపిక్స్‌లో పతకాన్ని గెలిచి తీరాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.

‘ట్రాక్‌’ మార్చిన ద్యుతీచంద్‌
దాదాపు ఐదేళ్లుగా హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియం వేదికగా ప్రాక్టీస్‌ చేస్తున్న ద్యుతీచంద్‌ చాలాకాలం తర్వాత తన ప్రాక్టీస్‌ను భువనేశ్వర్‌కు మార్చారు. ప్రస్తుతం గచ్చిబౌలిలోని సింథటిక్‌ ట్రాక్‌ ప్రాక్టీస్‌కు అనుకూలంగా లేకపోవడంతో భువనేశ్వర్‌లో ప్రాక్టీస్‌ చేయాలని నిర్ణయించారు. గచ్చిబౌలి గట్టిగా మారిపోవడంతో ప్రాక్టీస్‌ చేయడం కష్టంగా మారింది. ప్రాక్టీస్‌ చేసే సమయంలో కాళ్లకు అసౌకర్యంగా మారడంతో పాటు గాయం అయ్యే అవకాశాలు కూడా ఉండటంతో తన ప్రాక్టీస్‌ను కొన్ని రోజుల పాటు భువనేశ్వర్‌లో కొనసాగించేందుకు సిద్ధమయ్యారు. టోక్యో ఒలింపిక్స్‌ సమయం దగ్గర పడుతున్న సమయంలో ప్రతీక్షణం ముఖ్యమేనని భావిస్తున్న ద్యుతీచంద్‌.. తాత్కాలికంగా తన సొంత రాష్టంలో ప్రాక్టీస్‌ కొనసాగించనున్నారు. హైదరాబాద్‌లో ప్రాక్టీస్‌ తర్వాతే ఆమె కెరీర్‌ ఉన్నత స్థాయికి వెళ్లడంతో ఇక్కడే ప్రాక్టీస్‌కు తొలి ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. కాగా, ప్రస్తుతం గచ్చిబౌలి సింథటిక్‌ ట్రాక్‌ పేలవంగా మారిపోవడంతో ఇక్కడ ఆమె ప్రాక్టీస్‌కు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. ఇక్కడ పరిస్థితులు మెరుగైన తర్వాత  మళ్లీ గచ్చిబౌలిలోనే ఆమె తిరిగి ప్రాక్టీస్‌ చేయనున్నారు.

ఎంతోమందికి ద్యుతినే స్ఫూర్తి
భారత అథ్లెట్లలో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ద్యుతీచంద్‌ మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. భారత్‌లో అథ్లెట‍్లకు తగినంత ప్రాచుర్యం లభిస్తుందంటే అందుకు ద్యుతీచంద్‌ ప్రధాన కారణంగా చెప్పొచ్చు. తన ప్రాక్టీస్‌ను ద్యుతీచంద్‌ ఆకస్మికంగా భువనేశ్వర్‌కు ఎందుకు మార్చాల్సి వచ్చిందంటూ ఆమె కోచ్‌ నాగపురి రమేశ్‌ను ఫోన్‌లో సంప్రదిస్తే.. ఇక్కడ ప్రాక్టీస్‌కు తాత్కాలికంగా విరామం మాత్రమే ఇచ్చారన్నారు. ట్రాక్‌ ప్రాక్టీస్‌కు అనుకూలంగా లేకపోవడం కూడా ఒక కారణంగా చెప్పుకొచ్చారు. ఒలింపిక్స్‌ వంటి మెగా ఈవెంట్‌కు సన్నద్ధమయ్యే క్రమంలో ట్రాక్‌ కారణంగా ఏమైనా గాయాలైతే తేరుకోవడం కష్టమని భావించడంతోనే గచ్చిబౌలిలో ప్రాక్టీస్‌కు కొన్ని రోజులు బ్రేక్‌ ఇచ్చారన్నారు. పరిస్థితులు మెరుగైన తర్వాత ద్యుతీచంద్‌ యథావిధిగా ఇక్కడ ప్రాక్టీస్‌ కొనసాగిస్తారని పేర్కొన్నారు. ద్యుతీచంద్‌ను చూసి చాలామంది అథ్లెట్లుగా రాణిస్తున్నారన్నారు. ప్రధానంగా తెలంగాణ నుంచి పలువురు అథ్లెటిక్స్‌ను ఎంచుకోవడానికి ద్యుతీనే ప్రధాన కారణమన్నారు. ఓవరాల్‌గా భారత్‌లో అథ్లెటిక్స్‌కు మరింత గుర్తింపు రావడానికి ద్యుతీచంద్‌ కీలక పాత్ర పోషించారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదన్నారు.

40 మంది అథ్లెట్లకు శిక్షణ
హైదరాబాద్‌లో ఏర్పాటైన భారత క్రీడాప్రాధికార సంస్థ(సాయ్‌)- గోపీచంద్‌-మైత్ర ఫౌండేషన్‌ ఎంతోమంది ప్రతిభావంతులకు అండగా నిలుస్తుందని నాగపూరి రమేశ్‌ అన్నారు. తెలంగాణ అథ్లెట్లు దీప్తి, శ్రీనివాస్‌లు అంతర్జాతీయ-జాతీయ స్థాయిలో పతకాలు సాధించడంలో ఈ ఫౌండేషన్‌ సహకారం మరువలేనిదని పేర్కొన్నారు. మార్చిలో జరిగిన యూత్‌ ఆసియా చాంపియన్‌షిప్‌లో దీప్తి, శ్రీనివాస్‌లు రెండేసి పతకాలు సాధించిన విషయాన్ని రమేశ్‌ ఈ సందర్భంగా ప్రస్తావించారు. 200 మీటర్ల పరుగులో దీప్తి  కాంస్యం సాధించగా, మెడ్లే రిలేలో రజతం సాధించిందన్నారు. ఇక శ్రీనివాస్‌ కూడా ఇదే ఈవెంట్‌లో రజతం, స్వర్ణాలు గెలుచుకున్నారన్నారు. ప్రస్తుతం గోపీచంద్‌-మైత్ర ఫౌండేషన్‌లో దాదాపు 40 మంది అథ్లెట్లు శిక్షణ పొందుతున్నారని తెలంగాణ నుంచి తొలి ద్రోణాచార్య అవార్డు అందుకున్న నాగపూరి రమేశ్‌ తెలిపారు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement