
పి.వి. సింధుదే మకావు టైటిల్
మకావు:మకావు ఓపెన్ గ్రాండ్ ప్రిక్స్ గోల్డ్ టైటిల్ ను హైదరాబాద్ అమ్మాయి పి.వి.సింధు మరోసారి కైవశం చేసుకుంది. మహిళల సింగిల్స్ లో భాగంగా ఆదివారం జరిగిన ఫైనల్లో సింధు 21-12, 21-17 తేడాతో దక్షిణ కొరియా క్రీడాకారిణి కిమ్ హో మిన్ ను మట్టికరిపించి టైటిల్ ను ఎగురవేసుకుపోయింది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలో దిగిన సింధు మకావులో తనకు తిరుగులేదని నిరూపించుకుంది.
టైటిల్ వేటలో వరుస రెండు సెట్లలో తిరుగులేని ఆధిక్యాన్ని సాధించిన సింధు.. ప్రపంచ 91 ర్యాంక్ క్రీడాకారిణి కిమ్ కు చుక్కలు చూపించింది. తొలి సెట్ ను సునాయాసంగా చేజార్చుకున్న కిమ్ .. రెండో సెట్ లో మాత్రం పోరాడింది. అయితే సింధు తనదైన శైలిలో విజృంభించి రెండో గేమ్ ను స్వల్ప తేడాతో గెలుచుకుని టైటిల్ ను చేజిక్కించుకుంది. అంతకుముందు శనివారం జరిగిన సెమీఫైనల్లో సింధు 21-14, 21-15 తేడాతో ఎనిమిదో సీడ్ బుసానన్ ఒంగ్‌బుమ్‌రుంగ్‌పాన్ (థాయ్‌లాండ్)పై గెలిచింది.